Work From Home: కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్ని గడగడలాడించింది. ప్రపంచానికి పెద్దన్నలమని చెప్పుకునే దేశాలు సైతం కంటికి కనిపించని ఓ వైరస్ కారణంగా చిగురుటాకులా వణికిపోయాయి. ఇక కరోనా ఎన్నో మార్పులకు నాంది పలికింది. ఇందులో ప్రధానమైంది ఉద్యోగం. కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినడంతో కొందరు ఉద్యోగాలను కోల్పోతే మరికొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్‌ను తీసుకొచ్చాయి.
అప్పటి వరకు అసలు ఇంటి నుంచి పని చేసే విధానాన్ని అవలభించని కంపెనీలు సైతం కరోనా దెబ్బకి ఈ విధానాన్ని పాటించాల్సి వచ్చింది. దీంతో వర్క్ ఫ్రమ్ హోం కల్చర్ బాగా పెరిగిపోయింది. ఇక కరోనా తీవ్రత తగ్గి, కేంద్రం నిబంధనలను సడలిస్తున్నా కూడా కొన్ని కంపెనీలు ఇంకా.. ఇదే విధానాన్ని అవలంభిస్తున్నాయి. మరి ఉద్యోగులు ఈ విధానాన్ని ఆహ్వానిస్తున్నారా.? లేదా అయిష్టంగానే కొనసాగిస్తున్నారా.? అన్నదానిపై ప్రముఖ జాబ్స్ వెబ్‌సైట్ ఇండీడ్ సర్వే నిర్వహించింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఎంచక్కా ఇంటి నుంచి పని చేసుకుంటే డబ్బు మిగులుతుంది, ట్రావెల్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మొదట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం పట్ల ఉద్యోగుల ఆలోచన ఇలా ఉండేది. అయితే ప్రస్తుతం వారి ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. సుమారు 59 శాతం మంది ఉద్యోగులు ఆఫీసులు తెరిస్తే వెంటనే వెళ్లి పని చేసుకుంటామని చెప్పుకొచ్చారు. అయితే మహిళలు మాత్రం ఇంకా ఇదే విధానం కొనసాగితే బాగుంటుందని భావిస్తున్నారు. ఇక సొంతూళ్లకు వెళ్లి పోయిన వారిలో 50 శాతం మంది ఆఫీసులకు వెళ్లడానికి సిద్ధమని చెప్పారు. అలాగే సర్వేలో పాల్గొన్న యాజమాన్యల విషయానికొస్తే.. 70 శాతం కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించమని చెప్పారు. ఇక 75 శాతం మంది కంపెనీ యాజమాన్యాలు ఇంటి నుంచి వర్క్ చేయడం వల్ల పని నాణ్యత ఏమాత్రం తగ్గలేదని చెప్పడం విశేషం.
Also Read: Food For Sleep: నిద్రలేమితో సతమతమవుతున్నారా..? అయితే ఇవి తినండి.. తిండికి నిద్రకు లింక్ ఏంటనేగా..