
వేసవి వచ్చిందంటేనే దోమలు పెరుగుతాయి. ఇవి నిద్రకు భంగం కలిగించడమే కాదు అనేక ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. దీంతో దోమల సమస్య నుంచి ఉపశమనం కోసం ఎక్కువ మంది కాయిల్స్ ఉపయోగిస్తారు. అయితే కొంతమందికి ఈ కాయిల్స్ నుంచి వెలువడే పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో సమస్యలతో పాటు కొన్ని సార్లు కళ్ళకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఎందుకంటే మార్కెట్లో లభించే చాలా దోమల నివారణ ఉత్పత్తులు ఆరోగ్యానికి హానికరమైన రసాయనాలను ఉపయోగిస్తారు. కనుక ఎవరికైనా కాయిల్స్ ని ఉపయోగించడంలో సమస్య ఉంటే లేదా రసాయన ఉత్పత్తులను ఉపయోగించకూడదనుకుంటే, ఇంట్లో ఉండే వస్తువులతోనే దోమలను తరిమికొట్టవచ్చు. ఈ రోజు ఆ సింపుల్ చిట్కాల గురించి తెలుసుకుందాం..
మార్కెట్లో లభించే దోమల నివారణ ఉత్పత్తులకు బదులుగా సహజమైన వస్తువులను ఉపయోగిస్తే.. ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు తక్కువ డబ్బు ఖర్చవుతుంది. ఈ సహజ చిట్కాల వలన దోమలే కాదు ఇతర కీటకాలు కూడా పారిపోతాయి. దోమలను తరిమికొట్టడానికి ఇంట్లో ఏ వస్తువులను ఉపయోగించవచ్చునంటే..
దోమలను తరిమికొట్టడానికి బే ఆకులు (బిర్యానీ ఆకు), కర్పూరం ఉపయోగించవచ్చు. వీటి సువాసన ఇంటినంతా నింపుతుంది. అంతేకాదు దోమలు ఈ వాసనకు పారిపోతాయి. మీరు ఆవు పిడక టీసుకుని దానిమీద కర్పూరం, బే ఆకులను వేసి కాల్చండి. ఇలా వెలిగించి దాని పొగను దోమలున్న ప్రదేశంలో పెట్టండి. దీని పొగ దోమలను, ఇతర కీటకాలను తరిమివేస్తుంది.
కీటకాలను వదిలించుకోవడానికి అయినా.. చర్మ లేదా ఆరోగ్య సంబంధిత సమస్యలైనా వేప దివ్య ఔషధం. వేప మొక్క, వేప ఆకులు, వేప పండ్లు, వేప బెరడు అన్నీ ఉపయోగకరంగా ఉంటాయి. దోమలను తరిమికొట్టడానికి ఎండిన వేప ఆకులను కాల్చవచ్చు. ఇది ఇంట్లో బ్యాక్టీరియాను కూడా చంపుతుంది.
లవంగాలు,నిమ్మకాయలు కూడా దోమలను ఇంటి నుంచి దూరంగా తరిమివేయడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి. నిమ్మకాయను రెండు ముక్కలుగా కోసి, ఆపై అందులో లవంగాలను నిలువుగా గుచ్చండి. అప్పుడు ఆ నిమ్మకాయ ముక్కలను ఇంటి మూలల్లో, కిటికీల గుమ్మాల్లో మొదలైన ప్రదేశాల్లో పెట్టండి. ఇలా చేయడం వలన దోమలు పారిపోతాయి.
ఉల్లిపాయ, వెల్లుల్లి తొక్కలు దోమలను దూరంగా ఉంచడంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటికి బలమైన వాసన ఉంటుంది. తొక్కలను పారవేసే బదులు.. వాటిని ఎండబెట్టి ఇంట్లో కాల్చండి. అప్పుడు వీటి నుంచి వెలువడే పొగతో దోమలు పారిపోతాయి. అంతేకాదు ఉల్లి, వెల్లుల్లి తొక్కల నీటిని చెట్లకు ఎరువుగా కూడా ఉపయోగించవచ్చు. వీటి నీటిని స్ప్రే బాటిల్‌లో నింపి మూలల్లో పిచికారీ చేయడం ద్వారా కీటకాలు, చిమ్మటలు సంతానోత్పత్తి చేయవు.
నారింజ, నిమ్మ తొక్కలు కూడా బలమైన వాసనను వెదజల్లుతాయి. దోమలను తరిమికొట్టడానికి కమలాఫలం, నిమ్మ తొక్కలను ఎండలో పెట్టి.. వాటిని పొగవేయవచ్చు. ఇంట్లో ఉన్న కీటకాలు, చిమ్మటలను తరిమికొట్టడానికి ద్రవాన్ని తయారు చేయడానికి స్ప్రే బాటిల్‌లో నింపవచ్చు. ఈ రెండు తొక్కలను గ్రైండ్ చేసి ముఖానికి అప్లై చేయడం వల్ల కూడా చర్మానికి మేలు జరుగుతుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)