
ప్రతి ఇంట్లో ఉప్పును ఉపయోగిస్తారు. ఎందుకంటే ఉప్పు ఆహారంలో అత్యంత ప్రాథమిక పదార్థం. ఉప్పు లేకుండా చేసే ఆహారానికి రుచి ఉండదు. తినడం కూడా అత్యంత కష్టంగా భావిస్తారు. ఉప్పు ఆహారానికి రుచిని అందించడమే కాదు శరీరం ఆరోగ్యంగా ఉండటానికి పరిమిత పరిమాణంలో కూడా ఉప్పు అవసరం. ఉప్పు ఆరోగ్యానికి ముప్పు అంటూ పూర్తిగా తినడం ఆపివేస్తే.. అప్పుడు ఆరోగ్య సంబంధిత సమస్యలను కూడా కలిగిస్తుంది. అయితే ఆహారంలో ఉప్పుని కలపడం వలన రుచి అందించడమే కాదు.. ఉప్పుని అనేక ఇతర పనులకు కూడా ఉపయోగించవచ్చు. ప్రతి ఇంట్లో సులభంగా లభించే ఉప్పు.. అనేక సమస్యాత్మక పనులను సులభతరం చేస్తుంది.
ఇంటిని శుభ్రపరచడం, బూట్ల నుంచి దుర్వాసనను తొలగించడం లేదా ఇంట్లో వచ్చే దుర్వాసనను తొలగించడం వంటి అనేక రోజువారీ పనులకు ఉప్పును ఉపయోగించవచ్చు. ఇత్తడి పాత్రలపై పేరుకుపోయిన మురికిని తొలగించడానికి కూడా ఉప్పు ఉపయోగపడుతుంది. ఈ రోజు వంటింట్లో ఉప్పుని ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం..
శుభ్రం చేయడానికి ఉప్పుని ఎలా ఉపయోగించాలంటే
ఉప్పును సహజ క్లీనర్‌గా ఉపయోగించవచ్చు. దీని కోసం నిమ్మరసం లేదా వెనిగర్ తీసుకొని ఉప్పుతో కలిపి పేస్ట్ తయారు చేయండి. ఈ మిశ్రమంతో సింక్‌ను శుభ్రం చేయవచ్చు. అంతేకాదు కూరగాయల కటింగ్ బోర్డులను శుభ్రం చేసుకోవచ్చు. కౌంటర్ టాప్స్ , పాలరాయి మీద పడే మరకలను తొలగించడంలో కూడా ఉపయోగపడుతుంది. మాడిపోయిన పాత్రలను లేదా మొండి జిడ్డుతో ఉన్న పాత్రలను శుభ్రం చేయాల్సి వస్తే.. ఈ ఉప్పు మిశ్రమాన్ని ఉపయోగించడం వల్ల పని సులభతరం అవుతుంది.
ఇత్తడి పాత్రలు క్షణాల్లో శుభ్రం
ఇంట్లో ఉంచిన ఇత్తడి పాత్రలు నల్లగా మారుతాయి. దీనివల్ల అవి చాలా పాతవిగా కనిపిస్తాయి. దీన్ని శుభ్రం చేయడానికి ఉప్పు, నిమ్మకాయను ఉపయోగించవచ్చు లేదా ఉప్పు, బేకింగ్ సోడాను కలిపి ఈ మిశ్రమంతో ఇత్తడి పాత్రలను శుభ్రం చేయవచ్చు. దీనితో రాగి పాత్రలను కూడా సులభంగా శుభ్రం చేసుకోవచ్చు.
రిఫ్రిజిరేటర్ వాసననుంచి ఉపశమనం
కొన్నిసార్లు రిఫ్రిజిరేటర్ నుంచి వింత వాసన రావడం ప్రారంభమైతే.. వెంటనే జాగ్రత్త పడాలి. లేదంటే రిఫ్రిజిరేటర్‌లో ఉంచిన వస్తువులు కూడా చెడిపోయే అవకాశం ఉంది. దీని కోసం ఒక గిన్నెలో నిమ్మకాయ రసం, ఉప్పు మిశ్రమాన్ని వేసి ఫ్రిజ్‌లో ఉంచండి. ఇలా నిమ్మరసం, ఉప్పు వేసిన ఒక గిన్నెను.. ఇంటి మూలల్లో, అల్మారాలు మొదలైన వాటిలో కూడా ఉంచవచ్చు.
బూట్ల నుంచి వాసన వదిలించుకోండి
కొంతమంది బూట్ల నుంచి వచ్చే దుర్వాసనతో చాలా ఇబ్బంది పడుతుంటారు. అప్పుడు ఈ వాసనను వదిలించుకోవడానికి ఉప్పు మంచి ఉపయోగకరంగా ఉంటుంది. బూట్ల లోపల ఉప్పు వేసి ఉదయం శుభ్రం చేయండి. ఇది మీ బూట్ల దుర్వాసనను తగ్గించడంలో సహాయపడుతుంది.
మూసుకుపోయిన పైపులను తెరవడానికి ఉప్పు
చాలా ఇళ్లలో సింక్ పైపులు మూసుకుపోవడం సమస్య వస్తుంది. దీని కోసం కొన్ని చెంచాల ఉప్పు, బేకింగ్ సోడా కలిపి ఈ మిశ్రమాన్ని పైపులో వేసి.. ఆపై మరిగించిన నీటిని పోయండి. ఇలా చేసి కొంత సమయం వదిలేయండి. తర్వాత పైపులో పేరుకుపోయిన మురికి తొలగించబడటం ప్రారంభమవుతుంది. సింక్ పైపుల నుంచి నీరు సులభంగా వెళ్తుంది.
కూరగాయలు కడగడానికి ఉప్పు
మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలపై పేరుకుపోయిన మురికి ,బ్యాక్టీరియాను తొలగించడానికి ఉప్పు మంచి సహాయకారి. కూరగాయలు ఉప్పు వేసిన నీటిలో కొంత సమయం నానబెట్టాలి. దీనితో కూరగాయల మీద ఉన్న మురికి , బ్యాక్టిరియా తొలగిపోతాయి. కూరగాయలను ఉప్పునీటి నుంచి తీసి.. వాటి మీద ఉన్న తేమ ఆరిన తర్వాత కూరగాయలను నిల్వ చేస్తే.. వాటి షెల్ఫ్ లైఫ్ కూడా బాగుంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)