పిల్లల ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారా? ఈ విషయాలు ఎప్పుడైనా ఆలోచించారా?
డిజిటల్ ప్రపంచంలో ముద్దులొలికే పిల్లలకు ఎంత వరకు భద్రత ఉందో ఆలోచించారా? సోషల్ మీడియాలో సరదాగా పెట్టే ఒక్క చిన్న ఫొటో లేదా వీడియో వారి వ్యక్తిగత జీవితాన్ని, భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేసే అవకాశం ఉంటుందా అని ఎప్పుడైనా ఊహించారా ..?

పిల్లల అమాయకపు నవ్వులను, ముద్దు ముద్దు మాటలను నెట్టింట పంచుకుంటూ మురిసిపోతున్నారా? ఈ షాకింగ్ నిజాలు, హెచ్చరికలు ప్రతి ఒక్క తల్లిదండ్రులు కచ్చితంగా తెలుసుకోవాల్సిందే. లేదంటే భవిష్యత్తులో మీరే బాధపడాల్సి వస్తుంది.
ఇంటర్నెట్ యుగంలో సోషల్ మీడియా ప్రతి ఒక్కరి జీవితంలో భాగమైపోయింది. నేటి తరం తల్లిదండ్రులు తమ పిల్లల చిన్ననాటి ముద్దు మాటలను, ఆటలను, మొదటి పుట్టినరోజు వేడుకలను ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో షేర్ చేయడానికి ఇష్టపడుతున్నారు. అయితే, ఇలా చేయడం మీ పిల్లల మానసిక ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఎప్పుడైనా ఆలోచించారా?
ఆ ఒక్క లైక్..
మొదట్లో సరదాగా పెట్టే ఒక చిన్న ఫొటో లేదా వీడియోకు వచ్చే లైక్స్, కామెంట్స్ తల్లిదండ్రులకు ఎంతో ఆనందాన్ని ఇస్తాయి. ఆ ఉత్సాహంతో పిల్లల ప్రతి కదలికను సోషల్ మీడియాలో పెట్టడం అలవాటుగా మారుతుంది. కానీ, దీనివల్ల పిల్లలు కెమెరా ముందు ఉన్నప్పుడే తమకు ఎక్కువ ప్రేమ, గుర్తింపు లభిస్తాయని నమ్మడం ప్రారంభిస్తారు. వారు సహజంగా ఆ క్షణాన్ని ఆస్వాదించడం మానేసి, కేవలం ఇతరుల మెప్పు కోసమే నటించే అవకాశం ఉంది.
భవిష్యత్తులో..
ఈ రోజు మీకు ఎంతో ముద్దుగా, సరదాగా అనిపించే ఫొటోలు లేదా వీడియోలు, మీ పిల్లలు పెద్దయ్యాక చూసుకుంటే వారికి అసహ్యంగా లేదా అవమానకరంగా అనిపించవచ్చు. ఇంటర్నెట్‌లో ఒకసారి పోస్ట్ చేసిన సమాచారం ఎప్పటికీ ఉండిపోతుంది. కాబట్టి, ఏదైనా పోస్ట్ చేసే ముందు.. ‘భవిష్యత్తులో నా బిడ్డ దీనిని చూసి ఇబ్బంది పడతాడా?’ అని తల్లిదండ్రులు కచ్చితంగా ఆలోచించాలి. ఆ ప్రశ్నకు పూర్తి నమ్మకంతో ‘ఏం ఇబ్బంది ఉండదు’ అని అనిపిస్తేనే ముందుకు వెళ్ళాలి.
వ్యక్తిగత స్వేచ్ఛకు..
ప్రతి బిడ్డకు తమకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఉంటుంది. తమకు సంబంధించిన ఏ విషయాలు సమాజానికి తెలియాలి, ఏవి తెలియకూడదో నిర్ణయించుకునే వయసు వారికి ఇంకా రాలేదు. కాబట్టి, వారి గోప్యతను కాపాడాల్సిన పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే. పిల్లలకు కావలసింది సోషల్ మీడియా గుర్తింపు కాదు, సురక్షితమైన వాతావరణం, అందమైన బాల్యం అని గుర్తుంచుకోవాలి.
జ్ఞాపకాలను దాచుకోవడం మంచిదే. కానీ ప్రతి విషయాన్ని ఇంటర్నెట్‌లో పెట్టాల్సిన అవసరం లేదు. కాబట్టి, ఈసారి మీ పిల్లల ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. ఆ చిన్న ఆలోచనే మీ బిడ్డ ఆత్మవిశ్వాసానికి, భవిష్యత్తుకు రక్షణగా మారుతుంది.
