ముఖానికి ఐస్ మసాజ్ చేస్తున్నారా? ఈ చిన్న చిట్కాలతో మీ చర్మం మెరిసిపోవడం ఖాయం!
ప్రస్తుత బిజీ లైఫ్‌స్టైల్, కాలుష్యం, ఎండల కారణంగా ముఖ చర్మం త్వరగా అలసిపోయినట్లు, నిర్జీవంగా మారిపోతుంటుంది. చర్మాన్ని తక్షణమే రీఫ్రెష్ చేయడానికి, సహజమైన గ్లో తీసుకురావడానికి ఇంట్లోనే సులభంగా చేసుకునే పద్ధతి ఐస్ ఫేషియల్ లేదా ఐస్ థెరపీ. ముఖంపై ఐస్ ముక్కలను సరైన పద్ధతిలో ఉపయోగించడం వల్ల ఎలాంటి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం.

ముఖ చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చుకోవడానికి ఐస్ థెరపీ (మంచు ముక్కలతో మసాజ్) ఎంతగానో ఉపయోగపడుతుందని చర్మ సంరక్షణ నిపుణులు చెబుతున్నారు. ముఖంపై క్రమంగా ఐస్ రుద్దడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడి సహజమైన మెరుపు వస్తుంది. అంతేకాకుండా, ఇది చర్మంపై ఉండే పెద్ద ఓపెన్ పోర్స్‌ను తగ్గించి, అదనపు జిడ్డును (సీబమ్) నియంత్రిస్తుంది. అయితే, ఐస్ థెరఫీని ఎలా అప్లై చేయాలి..? మరిన్ని ప్రయోజనాలేంటో వివరంగా చూద్దాం..
ఐస్ థెరపీ వల్ల కలిగే ప్రయోజనాలు:
తక్షణ మెరుపు (Instant Glow): ముఖంపై ఐస్ ముక్కలతో మసాజ్ చేసినప్పుడు, ఆ చల్లదనానికి రక్తనాళాలు కుంచించుకుపోయి, ఆ తర్వాత రక్త ప్రసరణ వేగంగా పెరుగుతుంది. దీనివల్ల చర్మానికి తగినంత ఆక్సిజన్ అంది, ముఖం తక్షణమే కాంతివంతంగా మారుతుంది.
ఓపెన్ పోర్స్ నియంత్రణ: చాలా మంది చర్మంపై పెద్ద రంధ్రాలు (Open Pores) ఉండి, వాటిలో మురికి చేరి మొటిమలు వస్తుంటాయి. ఐస్ మసాజ్ ఈ రంధ్రాలను దగ్గరకు చేసి, చర్మాన్ని బిగుతుగా (Tighten) మారుస్తుంది.
మొటిమలు, వాపుల నివారణ: ముఖంపై మొటిమలు వచ్చి ఎర్రగా మారినప్పుడు ఐస్ ముక్కతో కాపడం పెడితే, అక్కడ వాపు, నొప్పి త్వరగా తగ్గుతాయి. ఇది చర్మంలోని అదనపు జిడ్డును కూడా నియంత్రిస్తుంది.
కళ్ల కింద నల్లటి వలయాలు (Dark Circles): నిద్రలేమి, అలసట వల్ల కళ్ల కింద వచ్చే వాపు (Puffiness), నల్లటి వలయాలను తగ్గించడంలో ఐస్ థెరపీ అద్భుతంగా పనిచేస్తుంది.
ఐస్ ఉపయోగించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
నేరుగా అప్లై చేయవద్దు: ఐస్ క్యూబ్‌ను ఎప్పుడూ కూడా నేరుగా చర్మంపై రుద్దకూడదు. ఇలా చేయడం వల్ల చర్మ కణాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. ఎల్లప్పుడూ ఒక మెత్తటి కాటన్ కర్చీఫ్ లేదా క్లాత్‌లో ఐస్ ముక్కను చుట్టి మాత్రమే ముఖంపై తిప్పాలి. ముఖంపై ఐస్ మసాజ్‌ను కేవలం 2 నుండి 5 నిమిషాలు మాత్రమే చేయాలి. అంతకంటే ఎక్కువ సమయం ఉంచితే చర్మం అతిగా పొడిబారిపోతుంది.
సాధారణ నీటికి బదులుగా గ్రీన్ టీ, రోజ్ వాటర్ లేదా కీరా దోస రసాన్ని ఐస్ ట్రేలో పోసి ఐస్ క్యూబ్స్‌గా మార్చుకుని వాడితే చర్మానికి రెట్టింపు పోషణ లభిస్తుంది. రసాయనాలతో కూడిన బ్యూటీ ప్రొడక్ట్స్ కంటే ఇలాంటి సహజమైన హోమ్ రెమెడీస్ చర్మానికి ఎంతో సురక్షితం. అయితే, మీది మరీ సెన్సిటివ్ స్కిన్ అయితే ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకుని వాడటం మంచిది.




