AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను ఇలా షార్ప్‌గా మార్చేయండి..

వంటగదిలో చట్నీల నుండి మసాలాల వరకు ప్రతిదానికీ మిక్సీపైనే ఆధారపడతాం. నిరంతరం వాడటం వల్ల మిక్సీ బ్లేడ్లు మొద్దుబారిపోయి పదార్థాలను మెత్తగా రుబ్బకపోవడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇలాంటప్పుడు కంగారుపడి కొత్త జార్ కొనడం లేదా రిపేర్ షాపుల చుట్టూ తిరగడం దండగ.. కొన్ని చిట్కాలు పాటిస్తే మొద్దుబారిన మిక్సీ బ్లేడ్లు మళ్లీ కత్తిలా అవుతాయి.

మిక్సీ సరిగ్గా పనిచేయడం లేదా.. పైసా ఖర్చు లేకుండా బ్లేడ్లను ఇలా షార్ప్‌గా మార్చేయండి..
How To Sharpen Mixer Grinder Blades
Krishna S
|

Updated on: Jul 14, 2026 | 5:02 PM

Share

ఆధునిక వంటగదిలో మహిళ పనిని ఈజీగా చేసే ఎన్నో మిషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో అత్యంత కీలకమైనది మిక్సర్ గ్రైండర్. ఉదయం టిఫిన్ చట్నీల నుండి, మధ్యాహ్నం మసాలాలు నూరడం, సాయంత్రం హెల్తీ స్మూతీలు, షేక్స్ తయారు చేయడం వరకు ప్రతి పనిలోనూ మిక్సీ పాత్ర ఎంతో ఉంటుంది. అయితే దీనిని నిరంతరం ఉపయోగించడం వల్ల కాలక్రమేణా అందులోని బ్లేడ్ల అంచులు మొద్దుబారిపోతుంటాయి. దీనివల్ల పదార్థాలు సరిగ్గా నలగక, ముక్కలు ముక్కలుగా ఉండిపోవడం గృహిణులకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇలాంటప్పుడు వెంటనే కంగారుపడి కొత్త జార్ కొనడం లేదా ఎలక్ట్రీషియన్ దగ్గరకు పరిగెత్తడం చేయాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో లభించే కొన్ని సాధారణ వస్తువులతోనే మిక్సీ బ్లేడ్లను మళ్లీ పదునుగా మార్చుకోవచ్చు.

గుడ్డు పెంకులతో అద్భుత ఫలితం

సాధారణంగా మనం వాడి పారేసే గుడ్డు పెంకులు మిక్సీ బ్లేడ్లను బాగు చేయడానికి అద్భుతంగా పనికొస్తాయి. ఇందుకోసం గుడ్డు పెంకులను ముందుగా శుభ్రంగా కడిగి, కాసేపు ఆరబెట్టాలి. ఆ తర్వాత వాటిని మిక్సీ జార్‌లో వేసి కొన్ని సెకన్ల పాటు గ్రైండ్ చేయాలి. గుడ్డు పెంకులకు ఉండే గరుకుదనం వల్ల, బ్లేడ్లకు పట్టిన మొండి మురికి, ఆహార రేణువులు పూర్తిగా తొలగిపోయి, బ్లేడ్ల పనితీరు మెరుగవుతుంది.

రాతి ఉప్పు చిట్కా

మిక్సీ బ్లేడ్ల అంచులను పదును పెట్టడానికి వంటగదిలో ఉండే ముతక ఉప్పు లేదా రాతి ఉప్పు బాగా సహాయపడుతుంది. జార్‌లో ఒక కప్పు లేదా టీస్పూన్ ముతక ఉప్పు వేసి, మిక్సర్‌ను కొన్ని సెకన్ల పాటు హై స్పీడ్‌లో నడపాలి. ఉప్పు రేణువుల ఘర్షణ కారణంగా బ్లేడ్ల చుట్టూ పేరుకుపోయిన మురికి వదిలిపోవడమే కాకుండా, బ్లేడ్ల అంచులు మునుపటిలా పదునుగా మారతాయి.

ఐస్ క్యూబ్స్

ఐస్ క్యూబ్స్, మిక్సీని క్లీన్ చేయడానికి బాగా ఉపయోగపడతాయి. జార్‌లో 3 నుండి 4 మంచు ముక్కలను వేసి కొన్ని సెకన్ల పాటు బ్లెండ్ చేయాలి. ఐస్ క్యూబ్స్ తగలడం వల్ల బ్లేడ్‌ల సందుల్లో ఇరుక్కుపోయిన చిన్న చిన్న ఆహార రేణువులు సులభంగా ఊడిపోతాయి. ఇది బ్లేడ్లను శుభ్రపరిచి, వాటి వేగాన్ని పెంచుతుంది.

అల్యూమినియం ఫాయిల్ ట్రిక్

వంటకాలను ప్యాక్ చేయడానికి వాడే అల్యూమినియం ఫాయిల్ ద్వారా కూడా బ్లేడ్లను పదును పెట్టవచ్చు. ఒక చిన్న అల్యూమినియం ఫాయిల్ ముక్కను తీసుకుని, దానిని చిన్న చిన్న ఉండలుగా చుట్టాలి. ఈ ఉండలను మిక్సీ జార్‌లో వేసి కొన్ని సెకన్ల పాటు తిప్పాలి. ఈ ప్రక్రియ వల్ల బ్లేడ్ల అంచులకు ఉండే మొద్దుబారిన తనం పోయి, అవి మళ్లీ షార్ప్‌గా తయారవుతాయి.

బేకింగ్ సోడాతో జిడ్డుకు చెక్

మిక్సీ బ్లేడ్లకు నూనె జిడ్డు లేదా ఆహార పదార్థాలు గట్టిగా అంటుకుని ఉంటే బేకింగ్ సోడా ఉత్తమ నివారణి. కొద్దిగా బేకింగ్ సోడాలో నీళ్లు కలిపి చిక్కటి పేస్ట్‌లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ఒక పాత టూత్ బ్రష్ సహాయంతో బ్లేడ్‌లపై, వాటి కింద ఉండే సందుల్లో బాగా పూయాలి. కొన్ని నిమిషాల పాటు అలాగే వదిలేసి, ఆపై శుభ్రమైన నీటితో కడిగేస్తే జిడ్డు మొత్తం వదిలిపోయి జార్ సరికొత్తగా మారుతుంది.

Follow Us