చికెన్, మటన్ కంటే చేపలు తినడం ఆరోగ్యానికి చాలా మంచిదన్న విషయం తెలిసిందే. ఇందులో ఆరోగ్యానికి మంచి చేసే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి తినడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. గుండె జబ్బులు, క్యాన్సర్, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు ఇలా రక రకాల ప్రాబ్లమ్స్‌ను అదుపు చేసుకోవచ్చు. చేపల్లో కొరమీనుకు చాలా ప్రత్యేకత ఉంది. ఈ చేప ఎంతో రుచిగా ఉంటుంది. దీంతో ఏం చేసినా చాలా బావుంటుంది. కొరమీను ఫ్రై గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక్కసారి ఇలా చేశారంటే.. తిన్న వాళ్లందరూ మీకు ఫ్యాన్స్ అయిపోతారు. దీన్ని పిల్లలకు కూడా పెడితే.. ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ కొరమీను ఫ్రై ఎలా తయారు చేస్తారు? దీనికి కావాల్సిన పదార్థాల గురించి ఇప్పుడు చూద్దాం.
కొరమీను చేపలు, ఆయిల్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పొడి, కొద్దిగా పెరుగు, కరివేపాకు, నిమ్మకాయ.
ముందుగా కొరమీను చేపల్ని పెరుగు, ఉప్పు, పసుపు వేసి నీచు వాసన లేకుండా బాగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న ముక్కల్నీ.. పక్కకి పెట్టుకోవాలి. ఫ్రైకి ఎప్పుడైనా చేపలను సన్నగా పల్చగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఖాళీగా ఉండే ఒక గిన్నె తీసుకోవాలి. అందులో పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా పొడి, కరివేపాకు, కొద్దిగా పెరుగు వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి. కనీసం ఒక గంట పాటైనా ఉంచి.. ఫ్రై చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. దీన్ని డీప్ ఫ్రై కాకుండా.. పెనం మీద షాలో ఫ్రై చేసుకోవచ్చు. రెండు వైపులా ఎర్రగా కాల్చుకుని.. ఆ తర్వాత నిమ్మ రసం పిండి తింటే.. ఖచ్చితంగా వావ్ అంటారు. ఈ రెసిపీని వీకెండ్స్ లేదా స్పెషల్ డేస్‌లో తయారు చేసుకోవచ్చు. అంతే కాదు ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.