
మనం వంటలో ఉపయోగించే నూనెలలో ఆలివ్ ఆయిల్ అత్యంత ఆరోగ్యకరమైనది అని నిపుణులు చెబుతున్నారు. ఇందులో కేవలం ఆరోగ్యకరమైన కొవ్వులే కాక, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉండటం వలన ఇది మన మొత్తం ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఆలివ్ ఆయిల్‌ను క్రమం తప్పకుండా తీసుకునే వారు ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. ఈ అద్భుతమైన నూనె అందించే ముఖ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ఆలివ్ నూనెలోని మోనోశాచురేటెడ్ కొవ్వులు శరీరంలో పేరుకుపోయే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. దీనివల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఇది శరీరంలో చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచడానికి సహాయపడుతుంది. నూనెలోని యాంటీఆక్సిడెంట్లు శరీరంలో మంటను తగ్గించి, అధిక కొలెస్ట్రాల్‌ను కూడా నియంత్రణలో ఉంచుతాయి.
ఆలివ్ ఆయిల్ చర్మానికి అవసరమైన పోషణను అందించి.. ముడతలు లేకుండా యవ్వనంగా ఉంచుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మ కణాల పునరుత్పత్తికి సహాయపడి, చర్మాన్ని మరింత మెరిసేలా చేస్తాయి.
జ్ఞాపకశక్తి కోల్పోవడం, అల్జీమర్స్ వంటి వ్యాధులతో బాధపడేవారికి ఆలివ్ నూనె మెదడు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది నరాలకు సంబంధించిన క్షీణత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థకు సహాయం చేసి మలబద్ధకాన్ని నివారించడంలో ఆలివ్ ఆయిల్ చాలా బాగా పనిచేస్తుంది. ఇది రక్తంలో చక్కెరను నియంత్రించడంలో కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆలివ్ ఆయిల్ జుట్టు పెరుగుదలకు కూడా చాలా దోహదపడుతుంది. ఇది జుట్టు కుదుళ్లను పోషిస్తుంది. జుట్టు పెరుగుదలకు సరైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. దీనిని వాడటం వలన జుట్టుకు మెరుపు వచ్చి పొడవుగా, మందంగా, నిండుగా పెరిగేలా చేస్తుంది. ఆలివ్ నూనెను నేరుగా చర్మానికి, జుట్టుకు ఉపయోగించడమే కాకుండా వంటలో భాగంగా తీసుకోవడం వల్ల కూడా ఈ ప్రయోజనాలన్నింటినీ పొందవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..