Mysore Sandal Soap: ఓ వైపు ప్రపంచ యుద్ధం.. మనదేశంలో శాండల్ సబ్బుల తయారీ.. 107 ఏళ్లకూ తరగని ఆదరణ.
మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు.. ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మైసూరులో గంధపు చెక్కల కుప్పలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. మైసూరు మహారాజా నల్వాడి కృష్ణరాజ ఒడయారు ఇక్కడే గంథం చెక్కల నూనె తీయాలని నిర్ణయించుకున్నాడు.
ఇప్పుడు చాలా చాలా రకాల సబ్బులు అందుబాటులో ఉన్నాయి.. విదేశీ, స్వదేశీ సబ్బు కంపెనీలు ఉన్నాయి. అయితే కొన్ని దశాబ్దాల క్రితం వంటకూ ప్రజలకు కొన్ని రకాల సబ్బులు మాత్రమే అందుబటులో ఉండేవి. వాటిల్లో ఒకటి మైసూర్ శాండల్ సోప్. ఈ సబ్బు దాదాపు వందేళ్ల క్రితం మనదేశంలో 1916లో ఉనికిలోకి వచ్చింది. 107 సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగి ఉంది ఈ సబ్బు. ఇప్పుడు అనేక రకాల సబ్బుల తయారీ కంపెనీలు వచ్చినా.. నేటికీ ఏ మాత్రం ఆదరణ తగ్గలేదు మైసూర్ శాండల్ సోప్ కు. అంతేకాదు విదేశీ అంటే ముద్దు అనే ఈ తరానికి బెస్ట్ ఎంపిక.. అవును ఇప్పటికీ మైసూర్ శాండల్ సోప్ మిలియన్ల మంది ప్రజల ఎంపికగా మిగిలిపోయింది.
నేడు కర్ణాటక ప్రభుత్వ బ్రాండ్ మైసూర్ శాండల్ సోప్ అని చాలా మందికి తెలియదు. వీటిని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తుంది. నేడు ఈ కంపెనీ ప్రభుత్వ ఆధీనంలో ఉండవచ్చు.. కానీ మైసూర్ శాండల్ సోప్ కంపెనీ పునాది వెనుక మైసూర్ రాచరిక కుటుంబం ఉంది. మైసూరుని నల్వాడి కృష్ణరాజ ఒడయారు పాలిస్తున్న కాలంలో ఈ సబ్బుల కర్మాగారం క్రీ. శ.1916 సంవత్సరంలో బెంగుళూరులో స్థాపించబడింది. దీని కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
విదేశాల్లో చందన తైలం తయారీ అది మొదటి ప్రపంచయుద్ధ కాలం. భారతదేశంలో బ్రిటిష్ పాలన సాగుతుంది. మైసూర్‌లో ఒడయారు రాజ్యం ఉండేది. రాజు – ఒడయారు IV దగ్గర ఒక దివాన్ ఉండేవారు. అతనే మోక్షగుండం విశ్వేశ్వరయ్య. అదే విశ్వేశ్వరయ్య దేశంలోనే ప్రఖ్యాతిగాంచిన ఇంజనీర్‌గా, పరిపాలనాదక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పేరొందారు. 1912 నుండి 1918 వరకు మైసూర్ సంస్థానానికి దివాన్‌గా ఉన్నారు.
20వ శతాబ్దం ప్రారంభంలో మైసూర్ ప్రపంచవ్యాప్తంగా గంధపు చెక్కకు చాలా ప్రసిద్ధి చెందింది. మైసూర్ నుండి భారీగా చందనం ఐరోపాలోని వివిధ దేశాలకు ఎగుమతి చేయబడేది. అక్కడ వారు గంధం నుంచి నూనె తీసేవారు. అయితే మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు.. ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మైసూరులో గంధపు చెక్కల కుప్పలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయి. మైసూరు మహారాజా నల్వాడి కృష్ణరాజ ఒడయారు ఇక్కడే గంథం చెక్కల నూనె తీయాలని నిర్ణయించుకున్నాడు. విదేశాల నుంచి యంత్రాలను తెప్పించారు. 1916లో మోక్షగుండం విశ్వేశ్వరయ్య ఆధ్వర్యంలో బెంగుళూరులో ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని స్థాపించారు. ఇది ద్రవ బంగారంగా పిలువబడింది.
గంధపు నూనెతో సబ్బు తయారీ దేశంలో ప్రారంభం మైసూరులో మహారాజు స్నానానికి మొదట చందన తైలం ఉపయోగించారు. కొంతకాలం తర్వాత మైసూర్ మహారాజును కలవడానికి ఇద్దరు వ్యక్తులు ఫ్రాన్స్ నుండి వచ్చారు. గంధపు నూనెతో చేసిన సబ్బును తమ వెంట తెచ్చుకున్నారు. ఆ సబ్బుని చూసిన మహారాజ్‌కి తాము కూడా సబ్బులను తయారు చేయాలనే ఆలోచన వచ్చింది. దీంతో విశ్వేశ్వరయ్య బొంబాయి నుంచి నిపుణులను పిలిపించి ఏర్పాట్లు చేయమన్నారు. మహరాజు ప్రముఖ పారిశ్రామిక రసాయన శాస్త్రవేత్త SG శాస్త్రిని లండన్‌కు పంపారు. అతను సబ్బు, సువాసన సాంకేతికతను అధ్యయనం చేశాడు. లండన్ నుండి తిరిగి వచ్చిన శాస్త్రి శాండల్‌వుడ్ పరిమళాన్ని అభివృద్ధి చేశాడు. ఇది మైసూర్ శాండల్ సోప్ తయారీకి పునాది. 1918లో తొలిసారిగా బెంగుళూరులోని కబన్ పార్క్ సమీపంలో ఉన్న ఫ్యాక్టరీలో సబ్బును తయారు చేశారు.
ఈ సబ్బును కూడా మొదటగా మహారాజ ఉపయోగించేందుకు ఉంచారు. అప్పుడు మహారాజు ఈ సబ్బులను తన ప్రజలకు కూడా అందించాలనుకున్నాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడం ప్రారంభించి.. మైసూర్ శాండల్ సోప్ సామాన్యులకు అందుబాటులోకి వచ్చింది.
ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కంపెనీని ఏర్పాటు 1980లో.. కర్ణాటక ప్రభుత్వం మైసూర్ మహారాజా నుండి తయారీ కేంద్రాన్ని స్వాధీనం చేసుకుంది. ఆ తర్వాత ప్రభుత్వ సబ్బుల కర్మాగారాన్ని షిమోగా , మైసూర్‌లోని గంధపు నూనె కర్మాగారాలతో విలీనం చేసి కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్ లిమిటెడ్ (KSDL) అనే సంస్థను ఏర్పాటు చేశారు.
KSDL ఆధ్వర్యంలో 1982లో సబ్బు ఉత్పత్తి ప్రారంభమైంది. గంధపు సబ్బును స్వచ్ఛమైన గంధపు నూనెతో పాటు వెటివర్, పామ్ రోజా, ఆరెంజ్, ప్యాచౌలీ, జెరేనియం, పెటిట్‌గ్రెయిన్ వంటి ముఖ్యమైన నూనెలను ఉపయోగించి తయారు చేశారు. మైసూర్ శాండల్ సోప్ కాకుండా, KSDL క్రమంగా రోజ్, జాస్మిన్, హెర్బల్ వంటి కొన్ని ఇతర రకాల సబ్బుల తయారీని ప్రారంభించింది. భారతదేశం అంతటా మైసూర్ శాండల్ సోప్స్ ఆదరణ సొంతం చేసుకున్నాయి.
100 సంవత్సరాలకు పైగా ప్రయాణం 2003 మరియు 2006 మధ్య మైసూర్ శాండల్ సోప్ చాలా సంపాదించింది. KSDL 2006 సంవత్సరంలో మైసూర్ శాండల్ సోప్ మొదటి బ్రాండ్ అంబాసిడర్‌గా మాజీ భారత క్రికెట్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనిని కూడా నియమించింది. ఇప్పుడు KSDLలో మైసూర్ శాండల్ సోప్ కోసం యాజమాన్య భౌగోళిక సూచిక ట్యాగ్ (GI ట్యాగ్) ఉంది.
మైసూర్ శాండల్ సోప్ 30 జూలై 2016న 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కంపెనీ భారీ విజయాన్ని సాధించిన మైసూర్ శాండల్ మిలీనియం.. మైసూర్ శాండల్ గోల్డ్‌లకు వారసుడిగా మైసూర్ శాండల్ సెంటెనియల్ పేరుతో ప్రత్యేక సంచికను ప్రారంభించింది. అది కూడా ప్రజలకు బాగా నచ్చింది. 107 సంవత్సరాలకు సాగుతున్న మైసూర్ శాండల్ సోప్ కంపెనీ జర్నీ నేటికీ ఇది ప్రజలకు బెస్ట్ ఎంపికగా సాగుతుంది.
మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..