AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అసలు రోజుకు ఎంత నూనె వాడాలి..? మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు..

Cooking Oil: ఐదుగురు ఉన్న మీ కుటుంబానికి నెలకు ఎన్ని కిలోల నూనె కావాలి? ఐదు కిలోలా? పది కిలోలా? అయితే ఇది మీ కోసమే. రుచి కోసం మనం వాడుతున్న నూనె.. మనకు తెలియకుండానే మన గుండెను ఎంత ప్రమాదంలోకి నెడుతుందో తెలుసా? వంటింట్లో వాడే నూనె అమృతమా లేక స్లో పాయిజనా? గుండె పదిలంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అసలు నిజాలు ఇవే..

అసలు రోజుకు ఎంత నూనె వాడాలి..? మీ చిట్టి గుండె గట్టిగా ఉండాలంటే ఈ తప్పులు అస్సలు చేయొద్దు..
How Much Oil Per Month For A Person
Krishna S
|

Updated on: Jul 20, 2026 | 5:49 PM

Share

భారతీయ వంటకాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. మన వంటల్లో వాడే మసాలాలు ఎంత ముఖ్యమో, రుచిని పెంచే నూనె కూడా అంతే ముఖ్యం. తాలింపు వేయాలన్నా, పరాటాలు కాల్చాలన్నా, బజ్జీలు, పకోడీలు వేయించాలన్నా నూనె లేనిదే మన వంటిల్లు గడవదు. అయితే నోటికి రుచినిచ్చే ఈ నూనె… మోతాదు మించితే మాత్రం గుండె ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కేవలం ఎలాంటి నూనె వాడుతున్నామనేదే కాదు, ఎంత పరిమాణంలో వాడుతున్నామనేది కూడా అంతే ముఖ్యం.

నెలకు ఒక వ్యక్తికి ఎంత నూనె అవసరం?

ఫరీదాబాద్‌లోని మారెంగో ఆసియా హాస్పిటల్స్ ప్రోగ్రామ్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ గజిందర్ కుమార్ గోయల్ తెలిపిన వివరాల ప్రకారం… ఆరోగ్యంగా ఉన్న ఒక వ్యక్తి రోజుకు 15 నుండి 20 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ నూనె తీసుకోకూడదు. ఈ లెక్కన ఒక వ్యక్తికి నెలకు 500 నుండి 600 మిల్లీలీటర్ల నూనె సరిపోతుంది. నాలుగురు సభ్యులున్న ఒక కుటుంబానికి నెలకు 2 లీటర్లకంటే ఎక్కువ నూనె అవసరం లేదు. కానీ దురదృష్టవశాత్తూ చాలా భారతీయ కుటుంబాల్లో ఐదుగురు సభ్యులున్న చోట నెలకు ఏకంగా 5 నుండి 10 కిలోల నూనెను వాడేస్తున్నారని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

గుండెకు ఏ నూనె మేలు చేస్తుంది?

మార్కెట్లో ఆవనూనె, సన్‌ఫ్లవర్, సోయాబీన్, కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్ వంటి ఎన్నో రకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం… ఆవనూనె, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ మిగతా వాటితో పోలిస్తే మెరుగైనవి. వీటిల్లో ఉండే హెల్తీ ఫ్యాట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.

ఆవనూనె: చెక్క గానుగ ద్వారా తీసిన ఆవనూనె భారతీయ వంటకాలకు అత్యంత ఉత్తమమైనది. దీని స్మోక్ పాయింట్ చాలా ఎక్కువ. కాబట్టి ఎక్కువ సెగపై వండినా ఇది త్వరగా పాడవదు, ఇందులో ఉండే పోషకాలు నశించవు.

ఆలివ్ ఆయిల్ : దీనిని తక్కువ సెగపై వండే వంటలకు లేదా సలాడ్స్‌పై చల్లుకోవడానికి మాత్రమే వాడాలి. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ డీప్ ఫ్రై కోసం ఉపయోగించకూడదు.

రిఫైన్డ్ ఆయిల్స్‌తో ప్రమాదం

రిఫైన్డ్ నూనెలను తయారుచేసేటప్పుడు వాటిని అధిక ఉష్ణోగ్రత వద్ద కెమికల్ ప్రాసెస్ చేస్తారు. దీనివల్ల అందులో కొన్ని హానికరమైన మూలకాలు చేరతాయి. నిరంతరం రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి, గుండె జబ్బుల ముప్పు ముంచుకొస్తుంది.

మోతాదు మించితే వచ్చే నష్టాలు

ఎప్పుడో ఒకసారి వేపుళ్లు తింటే పెద్దగా నష్టం జరగకపోవచ్చు. కానీ ప్రతిరోజూ డీప్ ఫ్రై చేసిన ఆహార పదార్థాలను తింటే శరీరంలో అనవసర కొవ్వు పేరుకుపోతుంది. ఫలితంగా బరువు పెరగడం, డయాబెటిస్, హై కొలెస్ట్రాల్, శరీరంలో ఇన్ఫ్లమేషన్, గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

హార్ట్ పేషెంట్లు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్న వారు నూనె విషయంలో మరింత కఠినంగా ఉండాలి. డాక్టర్ గోయల్ సూచన ప్రకారం.. హార్ట్ పేషెంట్లు ఉన్న కుటుంబంలో నెలకు 750 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ నూనె వాడకూడదు. రుచి, పోషణ సమతుల్యంగా ఉండటం కోసం.. 80 శాతం ఆవనూనె, 20 శాతం నెయ్యి లేదా వెన్న మిశ్రమాన్ని చాలా పరిమిత పరిమాణంలో వాడుకోవచ్చు. మంచి నూనెను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో… అది తక్కువ మోతాదులో వాడుకోవడం కూడా అంతే ముఖ్యం.

Follow Us