Chai Biscuit: పొద్దున్నే చాయ్ బిస్కెట్లు తింటున్నారా..? ఎంత డేంజరో తెలుసుకోండి..
రోజువారీ అలవాటైన టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి హానికరం. శుద్ధి చేసిన పిండి, చక్కెరతో నిండిన బిస్కెట్లు రక్తంలో చక్కెరను అకస్మాత్తుగా పెంచుతాయి, జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తాయి. ఇది ఆమ్లత్వం, బరువు పెరుగుట, దీర్ఘకాలంలో మధుమేహానికి దారితీయవచ్చు. ఉదయం ఖాళీ కడుపుతో సోంపు నీరు, ధనియా వాటర్ వంటి ఆరోగ్యకరమైన పానీయాలను ఎంచుకోవడం ఉత్తమం.

మన దేశంలో చాలా మందికి రోజువారీ అలవాటు టీతో బిస్కెట్లు తినడం. ఉదయం నిద్రలేవగానే కప్పు టీ కడుపులో పడితేనే మరో పని ముట్టుకుంటారు. టీతో పాటు బిస్కెట్లు తినడం కూడా మంచిదని భావిస్తారు. అయితే, ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ సాధారణ అలవాటు ఆరోగ్యానికి అంతే ప్రమాదకరం. టీ, బిస్కెట్ కలిపి తినటం వల్ల జీర్ణవ్యవస్థ, రక్తంలో చక్కెర, జీవక్రియపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి, ప్రతిరోజూ టీతో బిస్కెట్లు తినడం ఎంత ప్రమాదకరమో ఇక్కడ చూద్దాం..
మార్కెట్లో లభించే బిస్కెట్లలో ఎక్కువ భాగం శుద్ధి చేసిన పిండి, అదనపు చక్కెర, ఉప్పు, ప్రిజర్వేటివ్‌లతో తయారు చేస్తారు. అలాంటి బిస్కెట్లు టీతో తినడం వల్ల రక్తంలో చక్కెర అకస్మాత్తుగా పెరుగుతుంది. శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఉదయాన్నే టీ, బిస్కెట్ తీసుకోవటం వల్ల టీలోని కెఫిన్, టానిన్లు ఖాళీ కడుపులో ఆమ్లత్వాన్ని పెంచుతాయి. బిస్కెట్లలోని శుద్ధి చేసిన పిండి, చక్కెర ఆమ్లత్వాన్ని, గుండెల్లో మంటను మరింత ప్రేరేపిస్తాయి. అదనంగా, ఉదయం పూట చక్కెర లేదా శుద్ధి చేసిన కార్బ్ బిస్కెట్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి, ఆ తర్వాత క్షీణిస్తాయి. ఈ అలవాటు దీర్ఘకాలంలో ఇన్సులిన్ నిరోధకత, మధుమేహానికి దారితీస్తుంది.
టీ, బిస్కెట్ల కలయిక పేగులలోని మంచి బ్యాక్టీరియాను బలహీనపరుస్తుంది. జీర్ణ సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. బరువు, గ్యాస్, కడుపు ఉబ్బరంకు దారితీస్తుంది. అదనంగా, టీలోని టానిన్లు నీటి నిలుపుదలను పెంచుతాయి. బిస్కెట్లలో ఫైబర్ తక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం, కడుపు నొప్పి వంటి సమస్యలకు దారితీస్తుంది. మరోవైపు శుద్ధి చేసిన పిండి, చక్కెర, అనారోగ్యకరమైన కొవ్వులు కలిగిన బిస్కెట్లు ఉదయాన్నే తినటం వల్ల కొవ్వును నిల్వ చేస్తాయి. ఇది క్రమంగా బొడ్డు కొవ్వు, బరువు పెరగడానికి దారితీస్తుంది.
ఉదయాన్నే టీతో బిస్కెట్లు తినడం వల్ల కలిగే హానిని నివారించడానికి ఖాళీ కడుపుతో ఎప్పుడూ పేగులు, జీవక్రియను మెరుగుపరిచే హెల్తీ డ్రింక్స్‌తో ప్రారంభించాలి. టీ, బిస్కెట్లకు బదులుగా మీరు ప్రతిరోజూ ఉదయం సోంపు నీరు, ధనియా వాటర్, కలబంద రసం లేదా దాల్చిన చెక్క కలిపిన కొబ్బరి నీళ్ళు వంటి వాటితో మీ రోజును ప్రారంభించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








