మందు తాగకపోయినా శరీరంలోకి ఆల్కహాల్.. ఎలా వెళ్తుందో తెలిస్తే నోరెళ్లబెడతారు..
మద్యం ఆరోగ్యానికి హానికరం.. ఇది అందరికీ తెలిసిన సత్యం. కానీ మీరు మద్యం ముట్టుకోకపోయినా.. మీరు తినే అరటిపండులో, తాగే జ్యూస్‌లో, చివరకు రోజూ తినే బ్రెడ్‌లో కూడా ఆల్కహాల్ ఉంటుందన్న విషయం మీకు తెలుసా? వినడానికి విడ్డూరంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం.. అసలు మనం తినే ఆహారంలో ఆల్కహాల్ ఎలా చేరుతోంది? అనే విషయాలు తెలుసుకుందాం..

సాధారణంగా ఆల్కహాల్ అంటే కేవలం వైన్, బీర్ లేదా ఇతర మత్తు పానీయాల్లోనే ఉంటుందని మనం భావిస్తాం. మద్యపానానికి దూరంగా ఉండే వారు తాము ఎప్పుడూ ఆల్కహాల్ తీసుకోమని గర్వంగా చెప్పుకుంటారు. కానీ సైన్స్ చెబుతున్న నిజం ఏమిటంటే.. మీరు మద్యం ముట్టుకోకపోయినా, మీ ప్రమేయం లేకుండానే ప్రతిరోజూ ఏదో ఒక రూపంలో స్వల్ప మోతాదులో ఆల్కహాల్ మీ శరీరంలోకి చేరుతూనే ఉంది. మనం రోజూ తినే టిఫిన్లు, పండ్లు, చివరికి పిల్లలు తాగే జ్యూస్‌లలో కూడా ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్నాయని పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి.
అసలు ఆహారంలో ఆల్కహాల్ ఎలా వస్తుంది..?
ఆహార పదార్థాల్లో ఆల్కహాల్ అనేది మనుషులు కావాలని కలిపింది కాదు. ఇది సహజంగా జరిగే కిణ్వ ప్రక్రియ వల్ల ఏర్పడుతుంది. ఆహారంలో ఉండే చక్కెరలు గాలిలో ఉండే ఈస్ట్ లేదా బ్యాక్టీరియాతో చర్య జరిపినప్పుడు అవి ఇథనాల్, కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతాయి. మన భారతీయ వంటకాల్లో పిండిని పులియబెట్టడం సర్వసాధారణం కాబట్టి మనకు తెలియకుండానే ఆల్కహాల్ మన డైట్‌లో భాగమైపోయింది.
ఆల్కహాల్ ఆనవాళ్లు ఉన్న 8 ముఖ్యమైన ఆహార పదార్థాలు
బాగా పండిన అరటిపండ్లు
అరటిపండు ఎంత బాగా పండితే దానిలో అంత ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. పండు పక్వానికి వచ్చే కొద్దీ దానిలోని స్టార్చ్ చక్కెరగా మారుతుంది. ఈ చక్కెర గాలితో చర్య జరిపి సహజంగా ఆల్కహాల్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఒక సాధారణ అరటిపండులో దాదాపు 0.2శాతం నుండి 0.4శాతం వరకు ఆల్కహాల్ ఉండవచ్చు.
బ్రెడ్ – బేకరీ ఐటమ్స్
బ్రెడ్ తయారీలో ఈస్ట్ వాడటం తప్పనిసరి. ఈస్ట్ పిండిని పొంగేలా చేసే క్రమంలో ఆల్కహాల్‌ను విడుదల చేస్తుంది. బ్రెడ్‌ను ఓవెన్‌లో కాల్చినప్పుడు చాలావరకు ఆల్కహాల్ ఆవిరైపోతుంది. కానీ శాస్త్రవేత్తల ప్రకారం బ్రెడ్‌లో 1.2శాతం వరకు ఆల్కహాల్ మిగిలి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా బర్గర్ బన్స్‌లో దీని శాతం కొంచెం ఎక్కువగా ఉంటుంది.
ప్యాక్ చేసిన పండ్ల రసాలు
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. మార్కెట్లో దొరికే ఆపిల్, ఆరెంజ్ లేదా గ్రేప్ జ్యూస్‌లలో కూడా ఆల్కహాల్ ఉంటుంది. పండ్లను ప్రాసెస్ చేసి ప్యాక్ చేసే సమయంలో జరిగే సహజ కిణ్వ ప్రక్రియ వల్ల లీటరు జ్యూస్‌లో సుమారు 0.5 గ్రాముల ఆల్కహాల్ చేరే అవకాశం ఉంది. అందుకే ఇవి ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి.
పెరుగు – కెఫిర్
పాలను తోడు పెట్టినప్పుడు బ్యాక్టీరియా చర్య వల్ల పాలు పెరుగుగా మారుతాయి. ఈ ప్రక్రియలో కూడా అతి తక్కువ మొత్తంలో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ముఖ్యంగా ప్రోబయోటిక్ డ్రింక్స్‌గా పేరొందిన కెఫిర్ వంటి పానీయాల్లో ఆల్కహాల్ శాతం కొంచెం స్పష్టంగానే ఉంటుంది.
వెనిలా ఎక్స్‌ట్రాక్ట్
కేకులు, ఐస్‌క్రీమ్‌ల సువాసన కోసం వాడే వెనిలా ఎక్స్‌ట్రాక్ట్ గురించి తెలిస్తే షాక్ అవుతారు. ఎందుకంటే ప్యూర్ వెనిలా ఎక్స్‌ట్రాక్ట్‌లో ఏకంగా 35శాతం ఆల్కహాల్ ఉంటుంది. అయితే, మనం వంటల్లో దీన్ని డ్రాప్స్ లెక్కన వాడతాం కాబట్టి ఆ మోతాదు మనపై ఏమీ ప్రభావం చూపదు.
సోయా సాస్
నౌడుల్స్, మంచూరియా వంటి చైనీస్ వంటకాల్లో వాడే సోయా సాస్‌ను నెలల తరబడి పులియబెట్టి తయారు చేస్తారు. ఈ సుదీర్ఘ ప్రక్రియ వల్ల దీనిలో 1.5శాతం నుండి 2శాతం వరకు ఆల్కహాల్ సహజంగానే తయారవుతుంది.
వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ లేదా వైట్ వెనిగర్ తయారీకి ఆల్కహాలే ఆధారం. ఆల్కహాల్‌ను ఆక్సిడైజ్ చేయడం ద్వారానే వెనిగర్ తయారవుతుంది. తయారీ పూర్తయిన తర్వాత కూడా దీనిలో స్వల్పంగా ఆల్కహాల్ ఆనవాళ్లు ఉంటాయి.
ఉడికించిన అన్నం
మన దగ్గర చాలామంది రాత్రి మిగిలిన అన్నంలో నీళ్లు పోసి ఉదయం తింటారు. ఈ అన్నం రాత్రంతా పులియడం వల్ల దీనిలో కూడా స్వల్ప మోతాదులో ఆల్కహాల్ మరియు బి-విటమిన్లు తయారవుతాయి.
ఇది ఆరోగ్యానికి హానికరమా..?
ఆహారంలో ఉండే ఈ సహజ ఆల్కహాల్ పరిమాణం చాలా తక్కువ. ఒక కప్పు జ్యూస్ లేదా ఒక బ్రెడ్ ముక్క తిన్నంత మాత్రాన మత్తు రాదు లేదా కాలేయం పాడవదు. మన శరీరం ఇలాంటి స్వల్ప మోతాదులను చాలా సులభంగా జీర్ణం చేసుకోగలదు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ మద్యపానం అలా కాదు. అది నేరుగా కాలేయంపై దాడి చేసి లివర్ సిర్రోసిస్, క్యాన్సర్, గుండె జబ్బులకు దారితీస్తుంది.
