New Year Resolutions: కొత్త సంవత్సరంలో ఫిట్ నెస్ మంత్రా! మీ రిజల్యూషన్స్ ఎలా ఉండాలి? నిపుణుల సూచనలు మీ కోసం..

| Edited By: Anil kumar poka

Dec 29, 2022 | 5:18 PM

ఈ నేపథ్యంలో వచ్చే కొత్త సంవత్సరంలో తీసుకొనే రిజల్యూషన్ ఎలా ఉండాలి అన్న దానిపై ఒక్కసారి ఫోకస్ పెడితే .. తొలి ప్రాధాన్యం మీ ఆరోగ్యానికి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే.. మనసు ఉల్లాసంగా ఉంటుంది.

New Year Resolutions: కొత్త సంవత్సరంలో ఫిట్ నెస్ మంత్రా! మీ రిజల్యూషన్స్ ఎలా ఉండాలి? నిపుణుల సూచనలు మీ కోసం..
New Years Resolutions
Follow us on

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నాం.. 2022 చివరి రోజుల్లో ఉన్నాం. కొత్త సంవత్సరం వస్తుందంటే అందరూ రిజల్యూషన్స్(తీర్మానాలు) చేసుకుంటారు. నేను అలా ఉండాలి. ఇలా ఉండకూడదు అని గట్టిగా అనుకుంటాం. కానీ ఒక్కసారి ఈ ఏడాది మొదటికి మళ్లీ ఒక్కసారి వెళ్దాం. 2022లో అడుగుపెట్టినప్పుడు కూడా మన ఆలోచన ఇలాగే ఉండి ఉంటుంది. ఆ సమయంలో ఏవో కొన్ని రిజల్యూషన్స్ తీసుకొని ఉంటాం. అవి ఇప్పుడు పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించాలి.. నూటికి 99 శాతం పాటించలేరు. ఎందుకంటే మనం తీసుకున్న రిజల్యూషన్స్ జనవరి నెలలో ఒకటి రెండు వారాల పాటు కొనసాగిస్తాం.. ఆ తర్వాత మర్చిపోతాం. దీనికి మనం పాటించలేని కఠినమైన రిజల్యూషన్స్ తీసుకోవడం కూడా ఓ కారణం కావచ్చు. ఈ నేపథ్యంలో వచ్చే కొత్త సంవత్సరంలో తీసుకొనే రిజల్యూషన్ ఎలా ఉండాలి అన్న దానిపై ఒక్కసారి ఫోకస్ పెడితే .. తొలి ప్రాధాన్యం మీ ఆరోగ్యానికి ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉంటే.. మనసు ఉల్లాసంగా ఉంటుంది. తద్వారా పనులు వేగవంతంగా చేసుకొనే వీలు కలుగుతుంది. అందుకనే వచ్చే కొత్త సంవత్సరంలో ఆరోగ్య పరంగా మీరు తీసుకోవాల్సిన కొన్ని రిజల్యూషన్స్ పలువురు వైద్యులు సూచించారు.. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

రోజూ 15 నిమిషాలు ప్రకృతితో గడపాలి..

అద్భుత ప్రయోజనాలను చేకూర్చే సాధారణ ఆరోగ్య సూత్రం ప్రతి రోజూ ప్రకృతితో గడపడం. రోజూ ఉదయం సమయంలో కనీసం 15 నిమిషాలు బయట తిరగడం ద్వారా మీ శరీరంపై సూర్యరశ్మి పడి విటమిన్ డీ ని పుష్కలంగా పొందుకుంటారు. ఇది మీ ఆరోగ్యానికి అన్ని రకాలుగా సాయపడుతుంది. అలాగే రాత్రి బాగా నిద్రపట్టడానికి ఉపకరిస్తుంది. మీ ఫస్ట్ రిజల్యూషన్ ఇదైతే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

మీరు ఆనందించే వ్యాయామం..

కొత్త సంవత్సరంలో మరింత వ్యాయామం చేయాలని నిర్ణయించుకోవడం గొప్ప ఆలోచన. కానీ, మీరు చేయడాన్ని ఇష్టపడే వ్యాయామాన్ని ఎంచుకోవడం చాలా ముఖ్యం. తద్వారా మీరు దానిని కొనసాగించే అవకాశం ఉంది. లేకపోతే మధ్యలోనే ఆపివేసే అవకాశం ఉంటుంది.

ఇవి కూడా చదవండి

స్వీయ-సంరక్షణ అవసరం..

మీరు మీ జీవితంలో ఇతర వ్యక్తులను జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటారు. కానీ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా కాపాడుకోవడం కూడా ముఖ్యమే. కొత్త సంవత్సరంలో విశ్రాంతి తీసుకోవడానికి , మీకు ఆనందాన్ని, ఆత్మ సంతృప్తిని కలిగించే పనులను చేయడానికి సమయం కేటాయించండి.

సమతుల్య ఆహారం తీసుకోండి..

డైట్ కంట్రోల్ పేరిట అసలు తినడం మానేస్తే ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టే అవకాశం ఉంటుంది. మీకున్న ఆరోగ్య సమస్యలు, పరిస్థితులను బట్టి సమతుల్య ఆహారం తీసుకోవాలి. ఏదైనా మితంగా తీసుకుంటే ఇబ్బంది ఉండదు. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తీసుకోవడంతో పాటు, కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం.

మంచి సహచరులను వెతకండి..

“సత్సంగ్” అంటే మంచి సావాసం. మిమ్మల్ని ఆదరించే , సానుకూల దృక్పథాలను కల్గించే వ్యక్తులు మీ చుట్టూ ఉండేటట్లు చూసుకోండి. ఇది మీ మానసిన ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఒంటరిగా ఉండకుండా చూసుకోండి.

ఒత్తిడిని అదుపులో ఉంచాలి..

అతిగా ఆలోచించడం మానేయాలి. విభిన్న అలవాట్లను అలవర్చుకోవాలి. మిమ్మల్ని మీరు బిజీ చేసుకోవాలి. స్క్రీన్ సమయాన్ని తగ్గించాలి. భోజనం చేసేటప్పుడు లేదా కాఫీ సమయంలో కుటుంబం,స్నేహితులను కలవండి. ఇది ఒత్తిడిని దూరం చేస్తుంది. యోగా, ధ్యానం సాధన కూడా ఒత్తిడి స్థాయిలను తగ్గించడానికి దోహదం చేస్తుంది. అవకాశం ఉన్నప్పుడు చిన్న చిన్న ట్రిప్లకు వెళ్లి రండి. ఇది మిమ్మల్ని రీచార్జ్ చేస్తుంది.

హెల్త్ చెకప్ అవసరం..

క్రమం తప్పకుండా శరీర ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి. రక్తపోటు, బ్లడ్ షుగర్, చెడు కొలెస్ట్రాల్‌ను నిర్వహించడంలో ఇది మీకు సహాయపడుతుంది.

మంచిగా నిద్ర పొండి..

8 గంటల నిరంతరాయ నిద్ర ఎప్పుడూ ఆరోగ్యానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతారు. నిద్ర షెడ్యూల్‌కు కట్టుబడి ఉండండి. ఇటువంటి చిన్న చిన్న ఆలోచనలను న్యూ ఇయర్ రిజల్యూషన్స్ గా తీసుకుంటే మీ ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం..