సాధారణంగా సైక్లింగ్ చేస్తే వ్యాయామంలా పని చేసి దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడవచ్చని వైద్యులు చెబుతూ ఉంటారు. వైద్యుల సూచనలకు అనుగుణంగా చాలా మంది సైక్లింగ్ చేసి ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఈ-సైకిల్స్ కూడా పెరగడంతో వాటి కొనుగోలు అందరూ ఆసక్తి చూపుతున్నారు. అయితే వీటి వాడకం క్రమేపి పెరగడంతో శరీరానికి సరైన వ్యాయామం ఉండడం లేదని బాధపడుతుంటారు. ఇలాంటి వారికి శుభవార్త చెబుతూ ఓ నివేదిక వెల్లడైంది. ఎలక్ట్రిక్ సైకిళ్ల వాడకం గుండె జబ్బులు, క్యాన్సర్ మరియు మధుమేహం, అలాగే అధిక రక్తపోటు, ఊబకాయం ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. జర్మనీలోని హన్నోవర్ మెడికల్ స్కూల్ పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం సాంప్రదాయ సైకిల్‌ను ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో? ఎలక్ట్రిక్ సైకిల్‌ను ఉపయోగించడం వల్ల కూడా దాదాపు అలాంటి లాభాలే వస్తాయని వెల్లడైంది. ఎలక్ట్రిక్ బైక్‌ను నడపడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని 40 శాతం తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. రోజుకు 10 నుంచి 15 కిమీల మధ్య ఎలక్ట్రిక్ బైక్‌ను నడపడం వల్ల క్యాన్సర్, డయాబెటిస్, కొలెస్ట్రాల్, డిమెన్షియా, అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాల నుంచి బయటపడవచ్చని పేర్కొంటున్నారు.
1,250 ఎలక్ట్రిక్ బైక్ రైడర్లు, 629 సాంప్రదాయ బైక్ వినియోగదారుల నుంచి డేటాను విశ్లేషించిన ఈ నిర్ధారణకు వచ్చామని జర్మన్ పరిశోధకుల బృంద తెలుపుతుంది. ఈ డేటా సైక్లింగ్‌పై గడిపిన సమయం, ప్రయాణించిన దూరం, హృదయ స్పందన రేటు వంటి వివరాలు నాలుగు వారాల వ్యవధిలో కార్యాచరణ ట్రాకర్‌లను ఉపయోగించి సేకరించారు. శారీరక శ్రమ స్థాయి తక్కువగా ఉన్నప్పటికీ, ఎలక్ట్రిక్ సైకిల్ ఉపయోగించడం అనేది ఒక వ్యక్తి వారి శారీరక స్థితిని మెరుగుపరచడానికి అలాగే తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి చేసే మొత్తం కార్డియో వ్యాయామానికి దోహదం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా కండరాలు, హృదయనాళ వ్యవస్థ దాదాపుగా ఎలక్ట్రికల్ అసిస్టెడ్ రైడింగ్‌లో నిమగ్నమై ఉన్నాయని చూపుతున్నాయని నిపుణులు వివరిస్తున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ సైకిళ్లను విశ్రాంతి కోసం లేదా పనికి వెళ్లడానికి, బయటికి వెళ్లడానికి ఉపయోగించడం వల్ల ఆ వ్యక్తి మొత్తం వ్యాయామ కార్యకలాపానికి తోడ్పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వృద్ధుల్లో హృదయ స్పందన రేటును పెంచడంతో పాటు తీవ్రమైన అనారోగ్యాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అయితే అధ్యయనంలో పాల్గొన్న ఎలక్ట్రిక్ బైక్ వినియోగదారుల్లో మూడో వంతు కంటే ఎక్కువ మంది గుండెపోటు, అధిక రక్తపోటు ఉన్నవారని నిపుణులు పేర్కొంటున్నారు. కాబట్టి వ్యాయామం గురించి ఆలోచించకుండా హ్యాపీగా ఎలక్ట్రిక్ బైక్స్‌ను వాడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం..