మంచి ఆరోగ్యానికి పండ్లు ఎంతగానో సహకరిస్తాయి. పండ్లు తినడం వల్ల శరీర పోషణ, ఎదుగుదల బాగుంటుంది. అటువంటి ఆరోగ్యకరమైన పండ్లలో దానిమ్మ ఒకటి. ఇది శరీరాన్ని దృఢంగా ఉంచుతుంది. అనేక ఆరోగ్య సమస్యలను నయం చేయడంలో కూడా సహాయపడుతుంది. దానిమ్మలో విటమిన్లు కె, సి, బి, ఐరన్, పొటాషియం వంటి వివిధ పోషకాలు ఉన్నాయి. క్రమం తప్పకుండా దానిమ్మ పండును తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి శరీరం ఉపశమనం పొందుతుంది. ఇది శరీరంలోని అధిక స్థూలకాయాన్ని దూరం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇది అనేక వ్యాధులను దూరం చేసే ఔషధ నిధిగా పిలుస్తారు. రోజు ఉదయాన్నే దానిమ్మ జ్యూస్ తాగితే కలిగే లాభాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
దానిమ్మ జ్యూస్‌లో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫైబర్, ఐరన్, విటమిన్ సి, పొటాషియం, ఫాస్పరస్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి. దానిమ్మ జ్యూస్ లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గుణాల కారణంగా రోగ నిరోధక శక్తి పెరిగి సీజనల్ ఇన్‌ఫెక్షన్లు సోకకుండా కాపాడుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. స్కిన్ అండ్ హెయిర్ కేర్‌కు అద్బుతంగా పనిచేస్తుంది. రోజూ క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తాగితే చర్మం రంగులో కూడా మార్పు కన్పిస్తుంది. వృద్ధాప్య లక్షణాలు తగ్గుతాయి.
దానిమ్మ జ్యూస్‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాల కారణంగా ఆస్తమా, ఆర్థరైటిస్ వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. దానిమ్మ జ్యూస్ రోజూ క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ వ్యాధి అదుపులో ఉంటుంది. ఇన్సులిన్ లెవెల్స్‌ను బ్యాలెన్స్ చేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. దానిమ్మలో లెక్కకు మించి ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండె వ్యాధుల సమస్యల్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే ప్యూనికాలజిన్ అనే రసాయనం కారణంగా శరీరంలో ఫ్రీ రాడికల్స్ నాశనమౌతాయి.
దానిమ్మ జ్యూస్‌లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఇమ్యూనిటీ అద్భుతంగా పెరుగుతుంది. సీజనల్ వ్యాధుల నుంచి రక్షణగా నిలుస్తుంది. పొటాషియం, ఇతర పోషకాల కారణంగా రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్త ప్రసరణ సక్రమంగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని విష పదార్ధాలు బయటకు తొలగిపోతాయి. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారుతుంది. చర్మంపై ముడతలు పోతాయి. వృద్ధాప్య లక్షణాలు దూరమౌతాయి. జుట్టు రాలే సమస్యకు కూడా ఇది చెక్ పెడుతుంది. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాల కారణంగా జుట్టు బలంగా ఉంటుంది.
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. పలు వార్తా కథనాలు, నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను సంప్రదించండి.)