Gen Z: మద్యానికి గుడ్‌బై చెప్తున్న యువత.. భారత్‌లో సీన్ రివర్స్! షాకింగ్ సర్వే
జనరేషన్ మారిపోయింది.. లెక్కలన్నీ మారిపోతున్నాయి. సాంకేతికతపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో నేటి యువత బకెట్ లిస్ట్‌లో ఎన్నో అంశాలు చేరిపోతున్నాయి. ముఖ్యంగా జెనరేషన్-జెడ్ (జెన్-జెడ్) యువత మద్యానికి దూరంగా ఉంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. చట్టబద్ధంగా మద్యం సేవించే వయసున్న ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు (36 శాతం) ఇప్పటివరకు ఆల్కహాల్..

జనరేషన్ మారిపోయింది.. లెక్కలన్నీ మారిపోతున్నాయి. సాంకేతికతపరంగా శరవేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో నేటి యువత బకెట్ లిస్ట్‌లో ఎన్నో అంశాలు చేరిపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆల్కహాల్ వినియోగం తగ్గుతుండగా, భారత్‌లో మాత్రం పరిస్థితి భిన్నంగా ఉంది. తాజాగా యూరోమానిటర్ సంస్థ నిర్వహించిన ‘వరల్డ్ మార్కెట్ ఫర్ ఆల్కహాలిక్ డ్రింక్స్ 2025’ సర్వే ఫలితాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.
ముఖ్యంగా జెనరేషన్-జెడ్ (జెన్-జెడ్) యువత మద్యానికి దూరంగా ఉంటూ కొత్త ట్రెండ్ సృష్టిస్తోంది. చట్టబద్ధంగా మద్యం సేవించే వయసున్న ప్రతి ముగ్గురు యువకుల్లో ఒకరు (36 శాతం) ఇప్పటివరకు ఆల్కహాల్ ముట్టలేదని ఈ సర్వే తేల్చింది. 2020లో వారానికి ఒకసారైనా మద్యం తాగే యువత 23 శాతం ఉండగా, 2025 నాటికి ఇది 17 శాతానికి పడిపోయింది.
కారణాలు ఇవే..
దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుంచి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో యువత ఆల్కహాల్‌కి దూరంగా ఉంటోంది. ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆల్కహాల్ కోసం పెట్టే ఖర్చుని అనవసర ఖర్చులా భావిస్తున్నట్లు సర్వేలో వెల్లడైంది. ఆల్కహాల్ వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుందని 25 శాతం యువత దీనికి దూరంగా ఉంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. అంతేకాదు, మద్యం అలవాటు ఉన్నవారిలోనూ 53 శాతం మంది వినియోగాన్ని తగ్గించుకోవాలని ప్రయత్నిస్తున్నారు (2020లో ఇది 44 శాతం మాత్రమే).
కొత్త ట్రెండ్- జీబ్రా స్ట్రైపింగ్
నేటి యువతలో ప్రాచుర్యం పొందుతున్న ‘జీబ్రా స్ట్రైపింగ్’ విధానం మద్య నియంత్రణకు దోహదపడుతోంది. స్నేహితులతో కలిసి ఉన్నప్పుడు ఒకసారి ఆల్కహాలిక్ డ్రింక్, మరోసారి నాన్-ఆల్కహాలిక్ డ్రింక్ తీసుకోవడం ద్వారా మద్య వినియోగాన్ని సమతుల్యం చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా నాన్-ఆల్కహాలిక్ డ్రింక్స్ మార్కెట్ వేగంగా వృద్ధి చెందుతోంది.
అయితే భారత్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది పరిస్థితి. ప్రపంచ ధోరణికి భిన్నంగా, భారత్‌లో మద్య వినియోగం విపరీతంగా పెరుగుతోంది. 2024-2029 మధ్య ఆల్కహాలిక్ డ్రింక్స్ వినియోగం 357 మిలియన్ లీటర్లు అధికమవుతుందని అంచనా. బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా దేశాలతో పోల్చితే ఇది ప్రపంచంలోనే అత్యధిక వృద్ధి రేటు. యువత ఆరోగ్యం, ఆదా, జీవన నాణ్యత కోసం మద్యానికి దూరమవుతుండగా, భారత్‌లో ఈ ధోరణి రివర్స్‌లో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ విషయంపై అవగాహన, నియంత్రణ చర్యలు అవసరం అని నిపుణులు సూచిస్తున్నారు.




