వంటగదిలో ఉన్న సుగంధ ద్రవ్యాలను సరైన రీతిలో ఉపయోగించుకుంటే మనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు కలగవు. ఇది కేవలం నోటి మాట కాదు.. ఎంతో మంది ఆరోగ్య నిపుణులు కూడా పరిశోధించి, ధ్రువీకరించిన అక్షర సత్యం ఇది. ఈ విషయాల్ని ముందుగానే తెలుసుకున్న మన పూర్వీకులు ఒక పథకం ప్రకారమే అవసరమైన వాటిని మన వంటగదిలోకి చేర్చి మనం అనునిత్యం తీసుకునేలా ఆహారపు అలవాట్లను అలవరిచారు. ఇవి మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపకరిస్తాయి. అంతే కాకుండా శరీర రోగ నిరోధక శక్తి మెరుగుపడడంలో కూడా ఇవి ఎంతగానో సహాయపడతాయి. అందుకే సుగంధ ద్రవ్యాలు లేకుండా భారతీయ వంటలు పూర్తి కానే కావు.
మరి అలాంటి ఉపయోగకరమైన సుగంధ ద్రవ్యాలలో ‘అల్లం’ కూడా ఒకటి. భారత దేశంలోని ప్రతి వంట గదిలో ‘అల్లం’ తప్పక ఉంటుంది. సాధారణంగా ఆహారానికి మంచి రుచిని అందించే అల్లం.. అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కూడా ఇస్తుంది. అందుకే చాలా రకాల వంటలలో దీనికి ఉపయోగిస్తారు. అల్లంను ఎక్కువగా టీలో ఉపయోగిస్తారు. అల్లం సాధారణంగా శీతాకాలపు ఆహారంగా ప్రసిద్ధి. ఎందుకంటే చలిని సమర్ధవంతంగా ఎదుర్కోవడానికి అల్లం ఎంతగానో సాయపడుతుంది. మరి శీతాకాల ఆహారంలో అల్లానికి ప్రాధాన్యత ఇవ్వడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..
కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం: అల్లం యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఇది వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిక్ లక్షణాలను నిర్వహించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది. క్రమం తప్పకుండా అల్లం తీసుకోవడం వల్ల నొప్పి, వాపు నుంచి తక్షణ ఉపశమనాన్ని పొందవచ్చు. దీనిని మీరు నోటి ద్వారా తీసుకున్నా లేదా చర్మానికి నేరుగా రాసుకున్నా.. మీ సమస్యలను తగ్గిస్తుంది.
జలుబు, ఫ్లూ: శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గిన వెంటనే తుమ్ములు, దగ్గు రావడం సహజం. జలుబు, ఫ్లూ నివారణగా అల్లంను చాలా కాలం నుంచే ఉపయోగిస్తున్నారు. వివిధ వంటకాలలో లేదా పానీయాలలో అల్లం రసం లేదా తురిమిన అల్లం కలపడం ద్వారా బలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు.
ముక్కు దిబ్బడ: చలికాలంలో చాలా మంది వ్యక్తులకు దగ్గు, జలుబు, ముక్కు దిబ్బడ అనేవి పెద్ద సమస్యలుగా ఉంటాయి. అర టేబుల్ స్పూన్ తేనెలో కొన్ని చుక్కల అల్లం రసం వేసి పడుకునే ముందు తాగితే ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఒక్క రోజులోనే మీరు ఉపశమనం లభించిన అనుభూతి చెందుతారు.
కొలెస్ట్రాల్: రోజువారీ ఆహారంలో భాగంగా అల్లాన్ని తీసుకోవడం ద్వారా మీ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించవచ్చు. అల్లం పచ్చడి, అల్లం రసం తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..