
చాలా ఇళ్లలో రిఫ్రిజిరేటర్లను నిరంతరాయంగా ఉపయోగించడం వల్ల వాటిలో చిన్నపాటి సమస్యలు తలెత్తడం చాలా సహజం. మొదట్లో ఇవి చిన్న సమస్యలుగా అనిపించినప్పటికీ, సకాలంలో స్పందించకపోతే ఒకరోజు ఫ్రిజ్ పూర్తిగా పాడైపోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీ రిఫ్రిజిరేటర్ నుండి నీరు కారుతున్నట్లు మీరు గమనిస్తే, ఆ లీకేజీకి గల అసలు కారణాన్ని వెంటనే గుర్తించి పరిష్కరించుకోవాలి.
డ్రెయిన్ పైపులు , వాటర్ లైన్ బ్లాక్ అవ్వడం
చాలా రిఫ్రిజిరేటర్ మోడళ్లలో త్రాగునీటిని , ఐస్‌ను సరఫరా చేసే ప్రత్యేక నీటి గొట్టం ఉంటుంది. ఏ కారణం చేతనైనా ఈ గొట్టం మూసుకుపోతే, రిఫ్రిజిరేటర్ అడుగు భాగం నుండి నీరు కారడం మొదలవుతుంది. ఈ సమస్య ఉన్నప్పుడు ఫ్రిజ్‌ను ఆఫ్ చేసి, వాటర్ లైన్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలి. కేవలం మంచు పేరుకుపోవడం వల్ల మాత్రమే ఈ సమస్య ఏర్పడితే, మంచు పూర్తిగా కరగడానికి వీలుగా మీరు రిఫ్రిజిరేటర్ ప్లగ్‌ను సుమారు నాలుగు గంటల పాటు తీసివేస్తే సరిపోతుంది. అదేవిధంగా ఫ్రిజ్ దానంతట అదే డిఫ్రాస్ట్ అయ్యేలా చేసే ‘డిఫ్రాస్ట్ డ్రెయిన్’ ఆహార కణాలతో మూసుకుపోవడం వల్ల కూడా నీరు లీక్ అవుతుంది. దీనిని పరిష్కరించడానికి ఫ్రీజర్ డ్రెయిన్‌లో కొద్దిగా వేడి నీటిని పోయాలి లేదా వైర్ హ్యాంగర్ సహాయంతో లోపల ఉన్న అడ్డంకులను తొలగించాలి.
ఫ్రిజ్ అమరికలో పొరపాట్లు
రిఫ్రిజిరేటర్‌ను పూర్తిగా సమతలంగా ఉన్న నేలపై ఉంచడం వల్ల కూడా నీరు కారే ప్రమాదం ఉంది. నిజానికి, సరైన శీతలీకరణ ప్రవాహం కోసం ఫ్రిజ్ ముందు భాగం కొద్దిగా ఎత్తుగా ఉండాలి. ప్రవాహానికి ఆటంకం ఏర్పడితే అడుగుభాగంలో తేమ పేరుకుపోయి నీరు లీక్ అవుతుంది. అలాగే ఫ్రిజ్‌ను గోడకు మరీ దగ్గరగా పెట్టకూడదు. దీనివల్ల పాత మోడళ్లలో డ్రైనేజ్ ట్రే నుండి నీరు బయటకు వస్తుంది. కాబట్టి ఎల్లప్పుడూ రిఫ్రిజిరేటర్‌కు , గోడకు మధ్య కనీసం 5 నుండి 6 అంగుళాల ఖాళీ స్థలం ఉండేలా చూసుకోవాలి. వీలైతే ఫ్రిజ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన స్టాండ్‌ను ఉపయోగించడం మంచిది.
ఈ చిట్కాలన్నీ ప్రయత్నించిన తర్వాత కూడా లీకేజీ తగ్గకపోతే, అప్పుడు మాత్రమే కంపెనీ టెక్నీషియన్‌ను సంప్రదించాలి. ఒకవేళ మీరు కొత్త ఫ్రిజ్ కొనాలనుకుంటే ఎల్లప్పుడూ ‘ఎనర్జీ స్టార్’ లేబుల్ ఉన్న రిఫ్రిజిరేటర్లను ఎంచుకోవడం వల్ల విద్యుత్ ఆదా అవుతుంది.