నిమ్మకాయలే కాదండోయ్.. తమలపాకులతో ఇలా శర్బత్ చేసి తాగితే.. బాడీ మొత్తం కూల్ కూల్
సమ్మర్ వచ్చిందంటే చాలూ వేడి ఉక్కపోతతో నరకం కనిపిస్తుంది. కాసేపు బయటకు వెళ్లి వచ్చిన బాడీ మొత్తం హీటెక్కిపోతుంది. అలాంటప్పుడే చల్లగా ఏదైనా తాగాలి అనిపిస్తుంది. కానీ బయట దొరికే కూల్‌డ్రింక్స్ మొత్తం కెమికల్స్, కలర్స్ నిండిపోయి ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే క్షణాల్లో మీ బాడీని కూల్ చేసే డ్రింక్‌ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోండి.

వేసవి కాలంలో చల్లని పానీయాలు తాగడం అందరికీ ఇష్టమే. అయితే, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్నవారు మార్కెట్లో దొరికే కృత్రిమ రంగులు, చక్కెర కలిపిన పానీయాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారి కోసం ‘షాహీ పాన్ శరబత్’ ఒక అద్భుతమైన ఎంపిక. ఇది రుచిలోనే కాకుండా, జీర్ణక్రియకు కూడా ఎంతో మేలు చేస్తుంది. ఈ రిఫ్రెషింగ్ డ్రింక్‌ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఆప్పుడు తెలుసుకుందాం.
షాహీ పాన్ శరబత్ తయారీకి కావలసినవి:
- 15-20 తాజా తమలపాకులు
- 1 కప్పు సోంపు
- 20-25 యాలకులు
- 250 గ్రాముల పటిక బెల్లం
- గుప్పెడు పుదీనా ఆకులు
- 2-3 చెంచాలు నానబెట్టిన సబ్జా గింజలు
- 1 చెంచా నల్ల ఉప్పు
షాహీ పాన్ శర్‌బత్ తయారీ విధానం:
- మొదట తమలపాకులను నీటితో శుభ్రంగా కడిగి, వాటి తొడిమలు తొలగించాలి
- తర్వాత మిక్సీ జార్‌లో తమలపాకులు, సోంపు, యాలకులు, పటిక బెల్లం, పుదీనా ఆకులు కొద్దిగా నీరు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి.
- ఈ మిశ్రమం తయారైన తర్వాత, ఒక వడపోత గరిటెతో వడకట్టుకోవాలి. దీనివల్ల శరబత్ తాగేటప్పుడు పీచు తగలకుండా స్మూత్‌గా ఉంటుంది.
- వడకట్టిన రసంలో నల్ల ఉప్పు కలిపి, ఫ్రిజ్‌లో పెట్టి చల్లబరచాలి.
- తర్వాత ఒక గ్లాసులో ఐస్ ముక్కలు వేసి అందులో మనం తయారుచేసుకున్న పాన్ సిరప్‌ను వేసి, పైన చల్లటి నీరు లేదా సోడా కలపాలి.
- చివరగా నానబెట్టిన సబ్జా గింజలు, తాజా పుదీనా ఆకులతో గార్నిష్ చేసి గ్లాస్‌లో పొసుకొని తాగేయండి
ఆరోగ్య ప్రయోజనాలు
ఇందులో ఉండే సోంపు, యాలకులు జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి. అలాగే పుదీనా, సబ్జా గింజలు శరీరంలోని వేడిని తగ్గించి చల్లదనాన్ని ఇస్తాయి. ఇక పటిక బెల్లం నీరసాన్ని తగ్గించి తక్షణ శక్తిని అందిస్తుంది. తమలపాకులు నోటి దుర్వాసనను పోగొట్టి రోజంతా తాజాగా ఉంచుతాయి. ఈ వేసవిలో అతిథులకు ఇచ్చేందుకు లేదా మీరు తాగేందుకు ఇది ఒక పరిపూర్ణమైన హెల్దీ డ్రింక్
(Note: పైన పేర్కొన్న అంశాలు ఇంటర్నెట్, నివేదిక ఆదారంగా మాత్రమే అందించబడినవి.. వీటిని టీవీ9 దృవీకరించడం లేదు. వీటిని ఉపయోగించే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం)
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
