ఓ వైపు వేసవిలో ఎండలు మండిస్తున్నాయి. దాహంతో ప్రజలు అల్లాడుతున్నారు. దీంతో దాహార్తిని తీర్చుకోవడానికి శీతల పానీయాలవైపు కొందరు దృష్టి సారిస్తారు. మరోవైపు ఈద్ పర్వదినం సందర్భంగా కూడా ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకోవడానికి, రుచికరమైన వంటకాలతో పాటు శీతల పానీయాలను ఆస్వాదించడానికి ఒకరి ఇళ్లకు ఒకరు వెళతారు. ఈ నేపధ్యంలో ఈద్ రోజున ఇంటికి వచ్చే అతిథులు వేసవి దాహార్తిని తీర్చడానికి తినడం కంటే రీఫ్రెష్ డ్రింక్స్ తాగాలని కోరుకుంటారు. దీంతో ఈ రోజు కొన్ని రకాల సహజమైన పానీయాలను తయారు చేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.. ఈ రిఫ్రెష్ డ్రింక్స్ ను తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసి ఈద్ రోజున అతిథులకు అందించవచ్చు.
రోజ్ మిల్క్ షర్బత్: ఈద్ సందర్భంగా గులాబీ, పాలతో చేసిన షర్బత్ ను అతిధులకు అందించవచ్చు. వేసవి దాహార్తిని తీర్చే ఈ డ్రింక్ తయారు చేయడానికి ముందుగా పాలను మరిగించాలి. మరుగుతున్నప్పుడు అందులో బెల్లం, యాలకుల పొడి వేయాలి. మరిగించిన పాలను కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు కొన్ని గులాబీ రేకులను కడిగి ఒక గ్లాసు నీళ్లను వేసి మరిగించాలి. ఈ గులాబీ నీరు సగానికి సగం తగ్గే వరకూ మరిగించాలి. ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న పాలను గులాబీ నీరులో కలపాలి. ఈ రోజ్ మిల్క్ ను కనీసం రెండు గంటలపాటు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి. అతిథులు వచ్చినప్పుడు.. గాజు గ్లాస్ తీసుకుని రోజ్ మిల్క్ పోసి.. ఆపై డ్రై ఫ్రూట్స్‌తో అలంకరించి సర్వ్ చేయండి.
పాన్ గుల్కంద్ షర్బత్: తమలపాకులతో తయారు చేసే గుల్కంద్ షర్బత్ కూడా అతిధులకు మంచి విందు అని చెప్పవచ్చు. ఇది తయారు చేయడానికి ముందుగా కొన్ని తమలపాకులను తీసుకుని నీటిలో బాగా కడగాలి. దీని తరువాత చేతులతో ఆకులను ముక్కలుగా కట్ చేయండి. ఇప్పుడు ఈ తమలపాకులను బాగా గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ను పక్కన పెట్టి డ్రై ఫ్రూట్స్‌ని కట్ చేసి ఒక గిన్నెలో ఉంచండి. ఇప్పుడు ఒక పెద్ద పాత్రలో తమలపాకు పేస్ట్ , కాచి చలార్చిన పాలు కలపాలి. బాగా కలిపిన తర్వాత అందులో గుల్కంద్, తేనె, తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి కాసేపు ఫ్రిజ్ లో పెట్టుకోవాలి. అతిథులు వచ్చినప్పుడు.. ఈ చల్లటి షర్బత్ అందించండి.
ఖర్జూరం అరటి మిల్క్ షేక్: వేసవిలో దాహార్తిని తీర్చడమే కాదు నీరసాన్ని కూడా తగ్గిస్తుంది అరటి ఖర్జూరం మిల్క్ షేక్. దీనిని తయారు చేయడానికి ముందుగా ఖర్జూరాలను తీసుకుని పాలలో నానబెట్టి కొన్ని గంటలపాటు అలాగే ఉంచాలి. దీని తరువాత ఖర్జూరం నుంచి గింజలను తియ్యాలి, అరటి పండ్లను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అరటిపండు, ఖర్జూరం, పాలు, తేనెను ఒక గ్లాసులో వేసి మిక్సీలో వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిల్క్ షేక్ ను అలాగే ఫ్రెష్‌గా అందించవచ్చు. లేదా తయారు చేసిన తర్వాత ఫ్రిజ్‌లో నిల్వ చేసుకుని అతిధులకు అందిచవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..