సీజన్ వచ్చేసింది.. అస్సలు వదలొద్దు.. చింత చిగురుతో ఆ సమస్యల చింతే ఉండదు..
చింత చిగురులో విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. కీళ్ల నొప్పులు, మధుమేహం, చర్మ సౌందర్యం, రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలోనూ చింత చిగురు ప్రభావవంతంగా పనిచేస్తుంది.

చింత చిగురు.. మన పూర్వీకులు తరచుగా తమ ఆహారంలో భాగంగా చేసుకున్న ఒక అద్భుతమైన ఆకు.. తెలుగు రాష్ట్రాలలో చింత చిగురు (Tamarind leaves)కు అత్యంత ప్రాచుర్యం ఉంది. చింత చెట్టు లేత ఆకు కూర అద్భుమైన రుచిని కలిగిఉంటుంది. వర్షాకాలం ప్రారంభంలో లభించే చింత చిగురు రుచికి పుల్లగా, వగరుగా ఉండటమే కాకుండా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. చింత చిగురులో విటమిన్ సి, టర్మెరిక్ ఆమ్లం, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా లభిస్తాయి. పల్లెల్లో సులువుగా లభించే ఇది, పట్నంలో మాత్రం అధిక గిరాకీని కలిగి ఉంటుంది.
చింత చిగురు ఆరోగ్య ప్రయోజనాలు..
జీర్ణవ్యవస్థకు మేలు: చింత చిగురులో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మలబద్ధకం సమస్యను పూర్తిగా తొలగించి, విరేచనం సాఫీగా జరిగేలా చేస్తుంది. ఫైల్స్ (అర్షమొలలు) ఉన్న వారికి చింత చిగురు మంచి ఫలితాన్ని ఇస్తుంది. కడుపులో నులిపురుగులు ఉన్నప్పుడు చింత చిగురుతో వండిన వంటలు తినడం వలన మంచి ఫలితం ఉంటుంది.
కొలెస్ట్రాల్ నియంత్రణ – గుండె ఆరోగ్యం:
చింత చిగురులోని ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో సహాయపడతాయి. ఇది రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి దోహదపడుతుంది.
మధుమేహం – కీళ్ల నొప్పులకు పరిష్కారం:
ఆర్థరైటిస్ సమస్యతో బాధపడే వారికి చింత చిగురు చక్కగా పనిచేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర నిల్వలను తగ్గించి, చక్కెర వ్యాధితో బాధపడే వారికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. చింత చిగురును పేస్ట్ లాగా చేసి కీళ్ల నొప్పులపై కట్టుగా కట్టుకోవడం వలన నొప్పులు తగ్గుతాయి.
చర్మ సౌందర్యం – వృద్ధాప్య నిరోధకం:
చింత చిగురును తరచుగా తినడం వలన శరీర అందాన్ని పెంచుకోవచ్చు. ఇది శరీర కాంతిని పెంచి, నిత్య యవ్వనంగా ఉండేలా చేస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం వలన వృద్ధాప్యాన్ని దూరం చేసుకోవచ్చు.
రోగ నిరోధక శక్తి పెంపు – కాలానుగుణ వ్యాధులు:
చింత చిగురులో ఉండే విటమిన్ సి – యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో రోగ నిరోధక శక్తిని గణనీయంగా పెంచుతాయి. చింత చిగురుతో కషాయం కాచుకొని తాగడం వలన జలుబు, దగ్గు, చలి, జ్వరం వంటి కాలానుగుణ వ్యాధుల నుండి ఉపశమనం లభిస్తుంది.
చింతాకు ఇతర ప్రయోజనాలు:
- కంటి ఆరోగ్యం: నేత్ర సంబంధిత వ్యాధులకు కూడా చింత చిగురు చక్కగా పనిచేస్తుంది.
- నోటి దుర్వాసన: నాలుగు లేదా ఐదు చింత చిగురు ఆకుల్ని నమలడం వలన నోటి దుర్వాసన తగ్గుతుంది.
- తల్లి పాలు: చింత చిగురు తల్లి పాలను వృద్ధి చేస్తుంది.
- థైరాయిడ్ – డయాబెటిస్: థైరాయిడ్, డయాబెటిస్, కామెర్లు ఉన్నవారు దీనిని పుష్టిగా తీసుకోవచ్చు.
- ఎముకల బలం: ఇది శరీరంలోని ఎముకలను బలోపేతం చేస్తుంది.
- యాంటీ-క్యాన్సర్ గుణాలు: చింత చిగురులో యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. కొన్ని రకాల క్యాన్సర్లు రాకుండా చూసే ఔషధ గుణాలు దీనికి ఉన్నాయి.
- గొంతు సమస్యలు: చింత చిగురును ఉడికించిన నీటితో పుక్కిలించడం వలన గొంతు నొప్పి, వాపు, మంట తగ్గుతాయి.
చింత చిగురు మన ఆరోగ్యానికి అందించే ప్రయోజనాలు అపారం. పూర్వం పప్పు, పచ్చడి, కూర, పులిహోరా వంటి అనేక వంటకాలలో దీనిని ఉపయోగించేవారు. ప్రస్తుత కాలంలో దీని వాడకం తగ్గినప్పటికీ, దీని ఆరోగ్య గుణాలను తెలుసుకుని మన దైనందిన ఆహారంలో దీనిని తిరిగి చేర్చుకోవడం ఎంతో మంచిది.
అయితే.. ఈ సమాచారం కేవలం అవగాహాన కోసం మాత్రమే.. ఏమైనా సమస్యలున్నా.. సందేహాలున్నా.. నేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది..
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
