
వేసవి వచ్చ్చేసింది.. వేసవి రారాజు మామిడి కాయలు కూడా మార్కెట్ లో సందడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు చిన్న చిన్న మామిడి కాయలు మాత్రమే వస్తాయి. అయినప్పటికీ పప్పు, దప్పళం, మామిడికాయ జీడిపప్పు కూరలు వంటి రుచికరమైన ఆహార పదార్ధాలను తయారు చేసుకోవడానికి రెడీ అయిపోతారు. అయితే మామిడి కాయతో చేసిన ఎన్ని రకాల కూరలు తిన్నా.. ఆవకాయ అనగానే నోరు ఊరుతుంది. కానీ మామిడి కాయ పక్వానికి వచ్చే వరకూ ఆగాల్సిందే.. ఈ నేపథ్యంలో చిన్న మామిడి కాయలతోనే ముక్కల పచ్చడి తయారు చేసుకోవచ్చు. ఈ ముక్కల ఆవకాయ ఏప్రిల్ లో నిల్వ ఆవకాయ పెట్టె వరకూ నిల్వ కూడా ఉంటుంది. మరి కోనసీమ జిల్లా స్టైల్ లో ముక్కల ఆవకాయ తయారీ గురించి తెలుసుకుందాం..
చిన్న పుల్లని మామిడి కాయలు – 2
పచ్చి కారం -50 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
మెంతులు – ఒక చిన్న స్పున్
వెల్లుల్లి రెబ్బలు – 20నుంచి 30వరకూ
ఆవపిండి – 50 గ్రాములు
పసుపు – కొంచెం
గానుగ నూనె (నువ్వుల నూనె) – సరిపడా
తయారీ విధానం: ముందుగా మామిడి కాయలను కడిగి శుభ్రం చేసి .. తడి లేకుండా పొడి బట్టతో బాగా తుడుచుకోవాలి. ఇంతలో ఒక గిన్నె తీసుకుని కారం, ఆవపిండి, ఉప్పు, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా కలపాలి. ఈ ఆవ మిశ్రమం పక్కకు పెట్టి.. ఇప్పుడు మామిడి కాయలను ముక్కలుగా కట్ చేయాలి. మధ్యలో ఉన్న మామిడి జీడిని దాని లోపల పొరను తీసి శుభ్రం చేసుకోవాలి. ఈ మామిడి కాయ ముక్కల్లో ఒక గరిటె నూనె.. కొంచెం పసుపు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మామిడికి కాయ ముక్కలను ఆవ మిశ్రమంలో వేసి నూనె పోసుకుని బాగా కలపాలి. తర్వాత నీటి చెమ్మ లేని శుభ్రమైన గాజు సీసా లేదా జాడీలో ఈ మిశ్రమాన్ని పెట్టుకోవాలి. మిగిలిన నూనె వేసి మూత గట్టిగా పెట్టుకోవాలి. ఈ ఆవకాయను రెండు రోజుల తిరగ కలిపి తినవచ్చు. తడి చేతులు, నీరు తగలకుండా ఉంటె ఈ ఆవకాయ రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది. కొత్త ఆవకాయ రుచిని ఆస్వాదించవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..