AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బొంబాయి రవ్వ, పెరుగుతో యమ టేస్ట్.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ ఇదిగో!

ఉదయం టిఫిన్‌కు ఏం చేయాలో ఆలోచిస్తున్నారా? అయితే హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీని ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. ఎలాంటి సోడా, ఈనో ఉపయోగించకుండానే మెత్తగా, రుచిగా చేసుకోవచ్చు. బొంబాయి రవ్వ, పెరుగు, పోపుతో తయారయ్యే ఈ ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. తయారీ విధానం, మెత్తటి ఇడ్లీలు రావడానికి పాటించాల్సిన చిట్కాలు తెలుసుకోండి.

బొంబాయి రవ్వ, పెరుగుతో యమ టేస్ట్.. పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఇష్టమైన రెసిపీ ఇదిగో!
Rava Idli Recipe
Shaik Madar Saheb
|

Updated on: Nov 12, 2026 | 12:40 PM

Share

ఉదయాన్నే టిఫిన్ చేయడం అనేది కొందరికీ.. కష్టంగా మారుతుంది.. కొందరు సింపుల్ గా చేసుకుని తింటే.. మరికొందరు వెరైటీగా ఏదో ఒకటి తయారు చేసుకుని తింటారు.. అయితే.. ఉదయం వేళ టిఫిన్‌కు ఏం చేయాలో తెలియక తికమక పడుతున్నారా..? ఉదయం వేళలో అల్పాహారం కోసం తొందరగా, రుచిగా, ఆరోగ్యంగా ఏదైనా సిద్ధం చేయాలనుకుంటే, హోటల్ స్టైల్ రవ్వ ఇడ్లీ ఉత్తమ ఎంపిక.. ఎటువంటి సోడా లేదా ఈనో వంటి పదార్థాలు వాడకుండానే, ఈ ఇడ్లీలు చాలా మృదువుగా, రుచిగా ఉంటాయి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఇష్టపడే ఈ తక్షణ రవ్వ ఇడ్లీ తయారీ విధానం, కొన్ని ముఖ్యమైన చిట్కాలను ఈ కథనంలో తెలుసుకుందాం..

కావలసిన పదార్థాలు:

  • బొంబాయి రవ్వ (సుజీ రవ్వ) – 1 కప్పు (సుమారు 150 గ్రాములు)
  • పులిసిన పెరుగు – 1 కప్పు
  • నీరు – 1 కప్పు
  • నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు
  • పచ్చిపప్పు – 1 టేబుల్ స్పూన్
  • మినపప్పు – 1 టేబుల్ స్పూన్
  • ఆవాలు – 1 టేబుల్ స్పూన్
  • జీలకర్ర – ½ టేబుల్ స్పూన్
  • ఇంగువ – చిటికెడు
  • కరివేపాకు – కొద్దిగా
  • అల్లం తురుము – ¼ ఇంచు ముక్క
  • పచ్చిమిర్చి – 3 (సన్నగా తరిగినవి)
  • టమాటా – 1 (సన్నగా తరిగినది) – (ఐచ్ఛికం)
  • క్యారెట్ తురుము – కొద్దిగా
  • ఉప్పు – రుచికి సరిపడా
  • జీడిపప్పు – కొన్ని (అలంకరణకు, ఐచ్ఛికం)

తయారీ విధానం:

పోపు తయారీ: ముందుగా, స్టవ్ వెలిగించి పాన్ పెట్టి, రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేయండి. నెయ్యి వేడయ్యాక, పచ్చిపప్పు, మినపప్పు, ఆవాలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. అవి కాస్త వేగిన తర్వాత అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి, చిటికెడు ఇంగువ, కరివేపాకు వేయాలి.

అల్లం, పచ్చిమిర్చి వేయడం: ఇప్పుడు సన్నగా తురిమిన అల్లం, సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేసి, అల్లం పచ్చి వాసన పోయే వరకు లైట్ గా వేయించాలి.

కూరగాయలు జోడించడం: సన్నగా తరిగిన టమాటా, క్యారెట్ తురుము వేసి మీడియం మంటపై రెండు నిమిషాలు వేయించాలి. టమాటా నచ్చకపోతే దీనిని మినహాయించవచ్చు, కానీ వేస్తే రుచి మరింత పెరుగుతుంది. కూరగాయలు పూర్తిగా ఉడకాల్సిన అవసరం లేదు, పచ్చి వాసన పోతే సరిపోతుంది.

రవ్వ వేయించడం (ముఖ్యమైన చిట్కా): ఇప్పుడు ఒక కప్పు బొంబాయి రవ్వ (సుజీ రవ్వ) వేసి, కేవలం ఒక్క నిమిషం మాత్రమే వేయించాలి. రవ్వను ఎక్కువ సేపు వేయిస్తే ఇడ్లీలు గట్టిపడతాయి. ఇది చాలా ముఖ్యమైన చిట్కా, మెత్తటి ఇడ్లీల కోసం దీనిని కచ్చితంగా పాటించాలి.

చల్లార్చడం: రవ్వ వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, రవ్వను పూర్తిగా చల్లారనివ్వాలి. వేడి మీద పెరుగు కలపకూడదు.

పిండి తయారీ: రవ్వ పూర్తిగా చల్లారిన తర్వాత, రుచికి సరిపడా ఉప్పు, ఒక కప్పు పులిసిన పెరుగు, ఒక కప్పు నీరు వేసి బాగా కలపాలి. పెరుగు కొద్దిగా పులిసినదైతే సోడా అవసరం ఉండదు. పిండిని మరీ గట్టిగా కాకుండా, కొద్దిగా పల్చగా ఉండేలా చూసుకోండి. అవసరమైతే పావు కప్పు నీరు అదనంగా కలపవచ్చు.

నానబెట్టడం: పిండిని కలుపుకున్న తర్వాత, పది నిమిషాల పాటు పక్కన ఉంచి నానబెట్టాలి. మీకు సమయం ఉంటే, సోడా వేయలేదు కాబట్టి ఇంకో పది నిమిషాలు అదనంగా నానబెట్టినా పర్వాలేదు.

ఇడ్లీ ఉడికించడం: ఇడ్లీ కుక్కర్‌లో ఒక గ్లాసు నీళ్లు పోసి, మీడియం మంటపై మరిగించుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, ఒక్కొక్క గదిలో పిండి వేయాలి. రుచి కోసం ప్రతి ఇడ్లీ పైన ఒక జీడిపప్పు పెట్టుకోవచ్చు.

ఆవిరిపై ఉడికించడం: మరిగిన నీటిపై ఇడ్లీ ప్లేట్లను పెట్టి, మొదట స్టవ్ హై ఫ్లేమ్‌లో మూడు నుండి నాలుగు నిమిషాలు, ఆ తర్వాత లో ఫ్లేమ్‌లో రెండు నిమిషాలు ఉడికించాలి.

ఇడ్లీలు ఉడికిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేసి, కుక్కర్ మూత వెంటనే తీయకుండా రెండు నిమిషాల పాటు అలానే వదిలేయండి. ఇలా చేయడం వల్ల ఆవిరి అంతా పోయి, ఇడ్లీలు ప్లేట్లకు అంటుకోకుండా చక్కగా, మెత్తగా వస్తాయి.

రెండు నిమిషాల తర్వాత ఇడ్లీలను తీసి, వేడివేడిగా చట్నీ లేదా సాంబార్‌తో వడ్డించండి. టమాటా వేయడం వల్ల ఇడ్లీలకు మరింత అద్భుతమైన రుచి వస్తుంది.

ఈ చిట్కాలను పాటిస్తూ ఈ రవ్వ ఇడ్లీలను ఒకసారి ప్రయత్నించండి. మీకు కూడా మెత్తటి, రుచికరమైన ఇడ్లీలు వస్తాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us