హోలీ పండగ రోజున చేసే ఈ కజ్జికాయలు నిజానికి టర్కీకి చెందిన వంటకంగా చెప్తారు. మరి ఈ వంటకం మన దేశానికి ఎలా వచ్చింది. భారతీయుల వంటకంగా ఎలా స్థిరపడింది అనే విషయాల వెనక పెద్ద స్టోరీనే ఉంది. హోలీ రోజు చేసే ఈ తీపి వంటకాన్ని ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా పిలుస్తారు. ఎలా పిలిచినా, ఏం పదార్థాలు వాడినా దీని రుచిలో మాత్రం ఎప్పుడూ కొత్తదనమే ఉంటుంది. దీని చరిత్ర తెలిస్తే ఎన్నో ఆశ్చర్యకర విషయాలు తెలుస్తాయి. ఇది ఎంత పురాతన వంటకమో మీరూ చూడండి.
పురాతన సంస్కృత గ్రంథాల ప్రకారం కరణిక అని పిలిచే తీపి పదార్థం ఒకప్పుడు ఉండేది. దీనిని అప్పట్లో ఎండిన పండ్లు, తేనెతో చేసే వారిని చెప్పుకుంటారు. మౌర్య సామ్రాజ్యం కాలంలో కూడా కజ్జికాయ వంటి స్వీట్లు ఉన్నట్టు పురావస్తు ఆధారాలు చెబుతున్నాయి. ఇది భిన్నమైన చంద్రవంక ఆకారంలో ఉండేవని శిల్పాల ద్వారా తెలుస్తున్నాయి.
గుజియా అని పిలిచే ఈ వంటకం మొదట టర్కీలోనే తయారైందని కొందరి వాదన. బక్లావా అనే స్వీట్ వంటకం నుంచే దీనికి ప్రేరణ లభించిందట. అప్పట్లో టర్కీ నుంచి ఉత్తరప్రదేశ్ కు ఎంతో మంది వ్యాపారులు ప్రయాణాలు చేసేవారు. ఆ సమయంలో తమతో పాటు బక్లావా అని పిలిచే స్వీటును కూడా తీసుకొచ్చారని ఇక్కడ ప్రజలకు నేర్పించారని చెప్పుకుంటారు. అలా గుజియా అనేది ఉత్తరప్రదేశ్లో తొలిసారిగా పరిచయమైందని అంటారు. ఇక్కడ ఈ స్థానిక అభిరుచులకు తగ్గట్టు స్థానికులు ఈ గుజియాలను తయారు చేయడం మొదలు పెట్టారని అంటారు.
మొఘల్ యుగంలో కూడా గుజియాలు ఉండేవి. కాలం మారుతున్న కొద్ది కజ్జికాయ కూడా ఎన్నో రకాలుగా తయారవడం మొదలైంది. కోవాతో, కొబ్బరి కోరుతో, డ్రైఫ్రూట్స్ తో ఇలా లోపల నచ్చిన పదార్థాన్ని పెట్టి వండడం మొదలుపెట్టారు. మొఘల్ చక్రవర్తులు, రాజపుత్రుల కూతుళ్ల మధ్య వివాహాలకు ఈ గుజియాలను ఎక్కువగా వడ్డించేవారని చెప్పుకుంటారు.
మైదాపిండి
రవ్వ
ఉప్పు
నెయ్యి
పుట్నాలు
ఎండు కొబ్బరి
యాలకులు
నూనె
మైదాపిండి శుభ్రంగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. ఇందులోకి రవ్వ, ఉప్పు, నెయ్యి కలుపుకోవాలి. కొద్ది కొద్దిగా నీళ్లు మెత్తని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. తరువాత ఈ ముద్దపైన నూనెరాసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి.
కొబ్బరి ముక్కలు, యాలకులు, పుట్నాల పప్పు నెయ్యితో దోరగా వేయించుకోవాలి. దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో బెల్లం ఆర్గానిక్ బెల్లం పౌడర్ లేదంటే మెత్తగా చేసుకున్న చక్కెర పొడి ,యాలకుల పొడి వేసి బాగా కలిపి పక్కకు పెట్టుకోవాలి. కావాలంటే దీంట్లో రుచి కోసం జీడిపప్పు, బాదం పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొబ్బరి, బెల్లం, యాలకులు, జీడిపప్పుతో తయారు చేసినకొబ్బరి లౌజును కూడా వాడుకోవచ్చు.
ఇపుడుముందుగానే కలిపి ఉంచుకన్న చపాతీ పిండిని చపాతీలాగా ఒత్తుకుని, కజ్జికాయలు ఒత్తుకునే (మౌల్డ్) చెక్కపై ఉండి, మధ్యలో రెడీ చేసిపెట్టుకున్న స్టఫింగ్ వేసి ప్రెస్ చేసుకోవాలి. లేదంటే చపాతీ మధ్యలో స్టఫింగ్ పెట్టి, మడిచి అంచుల్లో ఫోర్క్‌తో డిజైన్ వత్తుకుంటే సరిపోతుంది. ఇపుడు స్టవ్‌మీద బాండ్లీ పెట్టుకుని, నూనె పోసి బాగా వేడెక్కిన తరువాత ఒత్తి పెట్టుకున్న కజ్జికాయలను, మంచి రంగు వచ్చేదాకా తక్కువమంటపై వేయించుకోవాలి. అంతే కజ్జికాయలు రెడీ. చల్లారిన తరువాత వీటిని ప్లాస్టిక్ లేదా స్టీల్ డబ్బాల్లో ఉంచుకోవాలి.