
మీరు చేపలు అంటే ఇష్టంగా తింటారా..? అయితే బెంగాలీ స్టైల్ ఫిష్ కర్రీ రెసిపీని మీకోసం తీసుకొచ్చాను. ఈ రుచికరమైన కూరను తయారు చేయడం చాలా సులభం రుచి అద్భుతంగా ఉంటుంది. బెంగాలీ ఆహారప్రియులు చేపలను ప్రత్యేకంగా భావిస్తారు. ఈ ఫిష్ కర్రీకి ప్రత్యేక రుచి టెంపరింగ్ కారణంగా వస్తుంది. ఆవ నూనె, పంచ్‌ఫోరాన్ వంటి పదార్థాలు దీనికి విభిన్నమైన రుచిని ఇస్తాయి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం.
ముందుగా చేపల ముక్కలకు పసుపు, ఉప్పు, కారం రాసి దాదాపు 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఆవాల నూనెను పాన్‌లో వేడి చేసి చేపలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. తరువాత వాటిని పక్కన పెట్టుకోవాలి. అదే పాన్‌లో మరికొంత నూనె వేసి పంచ్‌ఫోరాన్ వేయాలి. తరువాత తరిగిన ఉల్లిపాయను వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఉల్లిపాయ సన్నగా వేగిన తర్వాత అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయి సువాసన వచ్చే వరకు వేయించాలి.
ఇప్పుడు టమోటా ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ఆవా పేస్ట్ వేసి బాగా కలిపి నూనె వేరుగా బయటికొచ్చే వరకు వేయించాలి. తరువాత కొంచెం నీళ్లు పోసి 2-3 నిమిషాలు మరిగించాలి. ఇప్పుడు ముందుగా వేగించి పెట్టుకున్న చేప ముక్కలను గ్రేవీలో వేసి తక్కువ మంటపై 5 నిమిషాలు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లి ఈ రుచికరమైన చేప కర్రీని వేడి అన్నంతో వడ్డించి తినండి.