Chicken Kofta curry Recipe: ఇంట్లో ఉండే సింపుల్ పదార్థాలతోనే అదిరిపోయే చికెన్ కోఫ్తా కర్రీ.. ఇలా చేశారో బొక్కలు కూడా వదలరు
నాన్‌వెజ్ ప్రియులకు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ చికెన్ అంటే ఉండే ఇష్టమే వేరు. ముఖ్యంగా ఆదివారం రాగానే ప్రతి ఒక్కరి ఇంట్లో రకరకాల చికెన్ వంటకాల సువాసనలు గుబాళిస్తుంటాయి. చాలా మందికి చికెన్ ముక్క లేకపోతే ఆదివారం భోజనమే అసంపూర్ణంగా అనిపిస్తుంది. అయితే ఎప్పుడూ వండే రెగ్యులర్ చికెన్ ఫ్రై లేదా కర్రీ కాకుండా, ఈ వీకెండ్‌కు రెస్టారెంట్‌కు వెళ్లే పనిలేకుండా ఇంట్లోనే ఎంతో నోరూరించే 'చికెన్ కోఫ్తా కర్రీ'ని ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

చికెన్‌తో కోఫ్తాలు చేయడం గురించి చాలా మందికి తెలియదు. చికెన్ కీమాతో చేసుకునే ఈ వంటకం భోజనంలోకి ఒక అద్భుతమైన గ్రేవీ డిష్‌గా ఉపయోగపడుతుంది. చికెన్ ముక్కలు గట్టిగా కాకుండా దూది లాగా సాఫ్ట్‌గా మెత్తగా కుదరడానికి, అలాగే గ్రేవీ మంచి చిక్కటి రుచితో రావడానికి అనుసరించాల్సిన టిప్స్ గురించి తెలుసుకుందాం.
తయారీకి కావలసిన పదార్థాలు
బోన్‌లెస్ చికెన్ (కీమా చేసినది) – అర కేజీ
సన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ – 2 టీస్పూన్లు
గుడ్డు – 1
బ్రెడ్‌క్రంబ్స్ (బ్రెడ్ పొడి) – పావు కప్పు
సన్నగా తరిగిన టమోటాలు – 2
కారం పొడి – 2 టీస్పూన్లు
ధనియాల పొడి – 1 టీస్పూన్
జీలకర్ర పొడి – అర టీస్పూన్
పసుపు పొడి – అర టీస్పూన్
గరం మసాలా పొడి – 1 టీస్పూన్
మిరియాల పొడి – అర టీస్పూన్
జాజికాయ పొడి – ఒక చిటికెడు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2
కొద్దిగా చక్కెర – అర టీస్పూన్
ఉప్పు – రుచికి తగినంత
నూనె – వేయించడానికి , కూరకు సరిపడా
కొంత్త నీరు – గ్రేవీకి అవసరమైనంత
కొత్తిమీర ఆకులు – కొద్దిగా
సాఫ్ట్ చికెన్ కోఫ్తాలను వేయించే పద్ధతి ఈ వంటకం సరిగ్గా కుదరాలంటే మొదట కోఫ్తాలను పగలకుండా పర్ఫెక్ట్‌గా సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం ముందుగా చికెన్ కీమాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా పిండేయాలి. ఇప్పుడు ఒక గిన్నెలో చికెన్ కీమా, బ్రెడ్‌క్రంబ్స్, సన్నగా తరిగిన కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఒక స్పూన్ కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, తరిగిన పచ్చిమిర్చి, ఒక గుడ్డు , రుచికి సరిపడా ఉప్పు వేసి చేతులతో చపాతీ పిండిలా బాగా కలుపుకోవాలి. ఇందులో వేసే గుడ్డు , బ్రెడ్ పొడి వల్ల కోఫ్తాలు విడిపోకుండా గట్టి బైండింగ్ వస్తుంది.
ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న నిమ్మకాయ సైజు ముద్దలుగా తీసుకుని గుండ్రటి కోఫ్తాలుగా చుట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి బాణలిలో వేయించడానికి సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగాక సిద్ధం చేసుకున్న కోఫ్తాలను ఒక్కొక్కటిగా వేస్తూ, మంటను మధ్యస్థంగా ఉంచి అన్ని వైపులా మంచి బంగారు రంగు (గోల్డెన్ బ్రౌన్) వచ్చే వరకు వేయించి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి.
చిక్కటి ముద్ద మసాలా గ్రేవీ వంట విధానం కోఫ్తాలు వేయించడం పూర్తయిన తర్వాత, అదే బాణలిలో మిగిలిన నూనెలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు , మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాలి. ఆ తర్వాత తరిగిన టమోటా ముక్కలు వేసి అవి పూర్తిగా మెత్తబడే వరకు మగ్గించుకోవాలి. టమోటాలు ఉడికిన తర్వాత అందులో కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, పసుపు పొడి, గరం మసాలా , రుచికి సరిపడా ఉప్పు వేసి మసాలాల నుండి నూనె పైకి తేలే వరకు వేయించాలి.
ఇప్పుడు గ్రేవీకి సరిపడా నీటిని పోసి హై ఫ్లేమ్ మీద మరిగించాలి. ఎసరు బాగా మరుగుతున్నప్పుడు, ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ కోఫ్తాలను ఇందులో జాగ్రత్తగా వేయాలి. దాంతో పాటు గ్రేవీ రుచిని పెంచడానికి కొద్దిగా చక్కెర , ఒక చిటికెడు జాజికాయ పొడిని చల్లాలి. గ్రేవీ చిక్కబడి కోఫ్తాలకు మసాలాలన్నీ బాగా పట్టుకునేలా మంటను తగ్గించి (సిమ్ లో ఉంచి) మూత పెట్టి మరో 5 నుండి 8 నిమిషాలు ఉడికించాలి. చివరగా సన్నగా తరిగిన తాజా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన రెస్టారెంట్ స్టైల్ చికెన్ కోఫ్తా కర్రీ సిద్ధం. దీనిని వేడివేడి అన్నం, చపాతీ లేదా బటర్ నాన్‌లతో తింటే రుచి అమోఘంగా ఉంటుంది.
