కాలీఫ్లవర్ తినేముందు ఈ నిజాలు తెలుసుకోండి.. లేకపోతే సమస్యలు కొని తెచ్చుకున్నట్లే..
కాలీఫ్లవర్ అనగానే మనకు గుర్తొచ్చేది వేడి వేడి పకోడీలు లేదా రుచికరమైన కర్రీస్.. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మనం ఇష్టంగా తినే ఈ కూరగాయ వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉన్నాయని మీకు తెలుసా? ముఖ్యంగా కిడ్నీ సమస్యలు, థైరాయిడ్ ఉన్నవారు దీని విషయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? కాలీఫ్లవర్‌ను ఎలా తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసుకుందాం..

కూరగాయల్లో కాలీఫ్లవర్ రుచికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని అందరికీ తెలుసు. జ్ఞాపకశక్తిని పెంచడం నుండి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడం వరకు దీని ప్రయోజనాలు అనేకం. అయితే “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు.. కాలీఫ్లవర్‌ను అతిగా తీసుకోవడం వల్ల కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు కాలీఫ్లవర్ ఎవరు తినాలి? ఎవరు దూరంగా ఉండాలి? అనే విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం.
పోషకాల గని.. ఆరోగ్యానికి ఎంతో మేలు..
కాలీఫ్లవర్‌లో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి6, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
బరువు నియంత్రణ: కేలరీలు తక్కువగా ఉండటం, నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి ఛాయిస్.
క్యాన్సర్ నిరోధకం: ఇందులో ఉండే సల్ఫోరాఫేన్, ఇండోల్స్ వంటి సమ్మేళనాలు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయని పరిశోధనలు చెబుతున్నాయి.
గుండె ఆరోగ్యం: యాంటీఆక్సిడెంట్లు రక్తపోటును నియంత్రించి, కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.
జీర్ణక్రియ: అధిక ఫైబర్ ఉండటం వల్ల మలబద్ధకం సమస్య తగ్గుతుంది.
అతిగా తింటే వచ్చే దుష్ప్రభావాలు ఇవే
ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కాలీఫ్లవర్‌ను పరిమితికి మించి తీసుకుంటే కొన్ని ఇబ్బందులు తప్పవు..
జీర్ణ సమస్యలు: కాలీఫ్లవర్‌లో రాఫినోస్ అనే చక్కెర ఉంటుంది. ఇది జీర్ణం కావడం కాస్త కష్టం. పెద్దప్రేగులోని బ్యాక్టీరియాతో ఇది చర్య జరిపి గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలకు దారితీస్తుంది.
థైరాయిడ్ ముప్పు: ఇందులో ఉండే గోయిట్రోజెన్స్ అనే పదార్థాలు శరీరం అయోడిన్‌ను గ్రహించకుండా అడ్డుకుంటాయి. ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఉన్నవారు కాలీఫ్లవర్‌ను పచ్చిగా తింటే సమస్య మరింత తీవ్రమవుతుంది.
కిడ్నీలో రాళ్లు: క్యాలీఫ్లవర్‌ను ఎక్కువగా తినడం వల్ల శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది.
రక్తం గడ్డకట్టడం: ఇందులో విటమిన్ కె సమృద్ధిగా ఉంటుంది. రక్తం గడ్డకట్టకుండా మందులు వాడేవారు దీనిని ఎక్కువగా తింటే మందుల ప్రభావం తగ్గే ప్రమాదం ఉంది.
అలర్జీలు: కొంతమందిలో చర్మం ఎర్రబడటం, ముఖం వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపించవచ్చు.
సురక్షితంగా ఎలా తినాలి?
కాలీఫ్లవర్ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాలి..
మితంగా తినాలి: రోజువారీ డైట్‌లో మితమైన పరిమాణంలో మాత్రమే దీనిని చేర్చుకోవాలి.
ఉడికించి తినండి: పచ్చిగా తినడం కంటే బాగా ఉడికించి తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలు మరియు థైరాయిడ్ సమస్యల ముప్పు తగ్గుతుంది.
వైద్యుల సలహా: గతంలో కిడ్నీ సమస్యలు లేదా థైరాయిడ్ ఇబ్బందులు ఉన్నవారు వైద్యుని సంప్రదించిన తర్వాతే దీనిని ఆహారంలో భాగం చేసుకోవాలి.
కాలీఫ్లవర్ ఖచ్చితంగా పోషకాహారమే, కానీ మీ ఆరోగ్య పరిస్థితిని బట్టి దానిని తీసుకోవడం ఉత్తమం. సరైన పద్ధతిలో, మితంగా తీసుకుంటేనే పూర్తి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
(గమనిక : ఈ వివరాలు కేవలం సాధారణ సమాచారం కోసం మాత్రమే. ఏదైనా వైద్య పరిస్థితికి చికిత్స, ఆహార మార్పుల కోసం అర్హత గల ఆరోగ్య నిపుణుడి సలహా తప్పనిసరి.)
