AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇదొక్కటి తగిలించండి.. కుక్కర్ అవసరమే లేదు.. పళ్లు లేనేళ్లు కూడా ఈజీగా తింటారు..

మటన్‌ను ప్రెషర్ కుక్కర్ లేకుండానే మెత్తగా, రుచికరంగా వండడం సాధ్యమే. బొప్పాయి పేస్ట్, పెరుగు లేదా నిమ్మరసంతో మ్యారినేట్ చేయడం, మందపాటి గిన్నెలో నెమ్మదిగా ఉడికించడం వంటి చిట్కాలు పాటిస్తే మటన్ ఎంతో మృదువుగా తయారవుతుంది. బోనాల సందర్భంగా చేసే స్పెషల్ స్పైసీ మటన్ కర్రీకి సరైన మసాలాలు, కొత్తిమీర, పుదీనాతో అద్భుతమైన రుచి తీసుకురావచ్చు.

ముదురు మటన్ మెత్తగా ఉడకాలంటే ఇదొక్కటి తగిలించండి.. కుక్కర్ అవసరమే లేదు.. పళ్లు లేనేళ్లు కూడా ఈజీగా తింటారు..
Mutton Curry
Shaik Madar Saheb
|

Updated on: Aug 07, 2026 | 12:14 PM

Share

చాలా మంది మటన్ ప్రియులు.. మేక మాంసాన్ని వండాలంటే చాలా పనుంటుంది.. రిస్క్‌తో కూడుకున్న పనిగా భావిస్తారు. ఇక ముదురు మటన్ అయితే.. గంటల తరబడి ఉడికించడంతోపాటు.. వండాల్సి వస్తుంది. అందుకే.. చాలా శ్రమతో కూడుకున్నదిగా పేర్కొంటుంటారు కొందరు మహిళలు.. అయితే.. కొన్ని టిప్స్ పాటిస్తే.. మటన్ కర్రీని ప్రెషర్ కుక్కర్ అవసరం లేకుండానే మెత్తగా వండుకోవచ్చు.. కుక్కర్ వాడకుండానే మటన్ కర్రీని అత్యంత రుచికరంగా, మృదువుగా ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.. అయితే.. ఈ సంప్రదాయ పద్ధతిలో మందపాటి గిన్నెను ఉపయోగించి మటన్‌ను నెమ్మదిగా ఉడికించడం ద్వారా, మాంసం మరింత రుచిగా, సులభంగా జీర్ణమయ్యేలా అద్భుతంగా మారుతుంది. అయితే.. బోనాల పండుగ సందర్భంగా చేసుకునే.. స్పెషల్ స్పైసీ మటన్ కర్రీ గురించి తెలుసుకుందాం..

మటన్ కర్రీని కుక్కర్ లేకుండానే మెత్తగా, రుచికరంగా తయారు చేసే పద్దతులు..

మటన్ సిద్ధం చేయడం..

మటన్ త్వరగా ఉడకాలంటే, వండటానికి ముందు శుభ్రంగా నాలుగైదు సార్లు కడగాలి.. ఆ తర్వాత.. నీటిని మొత్తం తీసేసి.. పచ్చి బొప్పాయి ముక్కల పేస్ట్ లేదా నిమ్మరసం, పెరుగుతో కొద్దిసేపు మ్యారినేట్ చేయాలి. దీనిద్వారా.. మేక మాంసం ముక్కలు మంచిగా సిద్ధమవుతాయి..

బోనాలు స్పెషల్ మటన్ కర్రీ తయారీ విధానం:

ప్రాథమిక తయారీ: ముందుగా, మందపాటి అడుగున్న ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టి, అది కాస్త వేడి అయిన తర్వాత ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడెక్కగానే, మధ్యస్థ పరిమాణంలో ఉన్న మూడు ఉల్లిపాయలను సన్నగా తరిగి, నాలుగు పచ్చిమిరపకాయలను చీల్చి వేయాలి. వీటిని ఒకసారి కలిపి, గుప్పెడు కరివేపాకు వేసి మరోసారి కలపాలి. ఫ్రెష్ కరివేపాకు అందుబాటులో ఉంటే మంచి వాసన వస్తుంది. రెండు నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించాలి. (ఇలానే కుక్కర్లో కూడా వండుకోవచ్చు..)

అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం: రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఉల్లిపాయలు పచ్చి వాసన పోయి కొద్దిగా వేగి ఉంటాయి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, మంటను కొద్దిగా పెంచి, పచ్చి వాసన పోయే వరకు నిరంతరం కలుపుతూ వేయించాలి. ఇలా చేయడం వల్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగుతుంది.

పసుపు చేరిక: అనంతరం, ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. పసుపు వేయడం వల్ల ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ త్వరగా వేగి మంచి రంగు, రుచి వస్తాయి. ఈ మిశ్రమాన్ని రెండు నిమిషాల పాటు మీడియం మంటపై మూత పెట్టి ఉడికించాలి.

మటన్ చేరిక: రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే అడుగున అంటుకున్నట్లు కనిపిస్తుంది, ఇది మామూలే. ఇప్పుడు మ్యారినేట్ చేసిన ఒక కేజీ మటన్‌ను ఈ మిశ్రమంలో వేయాలి. వెంటనే ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేయాలి. నాన్-వెజ్ వంటకాల్లో ఉప్పును ముందుగా వేయడం వల్ల ముక్కలకు ఉప్పు పట్టి, తినేటప్పుడు చప్పగా ఉండకుండా రుచిగా ఉంటాయి.

మటన్‌ను ఉడికించడం: మటన్, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా కలిసేలా రెండు మూడు నిమిషాలు కలపాలి. ఆ తర్వాత పది నిమిషాల పాటు మీడియం మంటపై మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత చూస్తే మటన్ తనలోని నీటిని విడుదల చేసి ఉడుకుతూ ఉంటుంది. ఒకసారి కలిపి, మరో పది నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి.

కారం, టమాటాలు చేరిక: పది నిమిషాల తర్వాత మూత తీస్తే మటన్ 50% ఉడికి, నీరంతా ఇంకిపోయి ఉంటుంది. ఈ దశలో మీ రుచికి తగ్గట్టుగా రెండు టేబుల్ స్పూన్ల కారం వేసి బాగా కలపాలి. తర్వాత, ముందుగా కోసి పెట్టుకున్న నాలుగు మధ్యస్థ పరిమాణపు టమాటాలను వేసి, ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి కలపాలి. టమాటాలకు బదులుగా టమాటా ప్యూరీని కూడా వాడవచ్చు. కొందరు మటన్ కర్రీలో టమాటాలు వేయకుండానే వండుకుంటారు, ఇది వ్యక్తిగత అభిరుచిని బట్టి ఉంటుంది. ఐదు నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఒకసారి కలపాలి.

నీరు, మసాలా దినుసులు: మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి నీరు పోయాలి. ఒక కేజీ మటన్‌కు పావు లీటర్ గ్లాసుతో మూడు గ్లాసుల నీరు సరిపోతుంది. నీరు పోసి ఒకసారి కలిపిన తర్వాత, ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా వేయాలి. ఇలా చేయడం వల్ల కూరకు మంచి ఫ్లేవర్, రుచి వస్తుంది. 15 నిమిషాల పాటు మీడియం మంటపై మూత పెట్టి ఉడికించాలి.

మాంసం మెత్తగా ఉడకడానికి చిట్కా: 15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే నూనె పైకి తేలి, మటన్ బాగా ఉడుకుతూ ఉంటుంది.

మటన్ కర్రీని గిన్నెలో లేదా ప్రెజర్ కుక్కర్లో రెండింటిలో కూడా వండుకోవచ్చు..

అయితే.. ముదురు మటన్ త్వరగా ఉడికేందుకు బొప్పాయి తో మ్యారినేట్ చేసుకోకపోతే.. ఉడుకుతున్నప్పుడు లేత బొప్పాయి కాయల ముక్కలు, లేదా లేత మామిడికాయ ఆకులు, లేదా బిర్యానీ ఆకులు వేస్తే మాంసం త్వరగా మెత్తబడుతుంది.

మటన్ చాలా వరకు ఉడికిన తర్వాత, మటన్ మసాలా వేసి బాగా కలపాలి. పది నిమిషాల పాటు మీడియం మంటపై మూత పెట్టి ఉడికించాలి. పది నిమిషాల తర్వాత కర్రీ చిక్కబడుతుంది. ఈ సమయంలో గింజలు తీసిన ఒక నిమ్మకాయ రసం పిండి, తరిగిన కొత్తిమీర వేసి ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. కర్రీ చల్లబడిన తర్వాత మరింత చిక్కబడుతుంది. ఈ మటన్ కర్రీ వేడి వేడి అన్నం, చపాతీలు లేదా బగారా రైస్‌తో అద్భుతంగా ఉంటుంది. ఈ పద్ధతిలో తయారుచేసిన మటన్ కర్రీ ఎంతో రుచికరంగా, మృదువుగా ఉండి కుటుంబ సభ్యులందరినీ పండుగవేళ ఎంతో ఆకట్టుకుంటుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ ఇష్టంగా తింటారు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us