
బిర్యానీ అంటే కేవలం బాస్మతీ బియ్యమే కాదు.. దక్షిణ భారతదేశంలో సిరగ సాంబా బియ్యంతో చేసే దొన్నె బిర్యానీకి విపరీతమైన క్రేజ్ ఉంది. చిన్నగా ఉండి, అద్భుతమైన సువాసననిచ్చే ఈ బియ్యం ఈ వంటకానికి ప్రాణం పోస్తాయి. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీరలతో తయారు చేసిన ప్రత్యేక మసాలా పేస్ట్ ఈ బిర్యానీకి ఒక విభిన్నమైన రంగును, రుచిని ఇస్తుంది. పండగ పూట ఇంట్లోనే స్పెషల్ బిర్యానీ చేయాలనుకునే వారి కోసం దొన్నె బిర్యానీ రెసిపీ స్టెప్-బై-స్టెప్ మీకోసం.
కావలసిన పదార్థాలు:
చికెన్ మ్యారినేషన్: 1 కిలో చికెన్
పెరుగు (1/4 కప్పు)
పసుపు, ఉప్పు.
మసాలా పేస్ట్: పుదీనా
కొత్తిమీర
పచ్చిమిర్చి (6)
అల్లం, వెల్లుల్లి
కరివేపాకు
కసూరి మేథి.
ముఖ్యమైనవి: సిరగ సాంబా బియ్యం (2 కప్పులు), నెయ్యి నూనె, బిర్యానీ సుగంధ ద్రవ్యాలు (లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గు), ఉల్లిపాయలు.
తయారీ విధానం:
మ్యారినేషన్: చికెన్‌ను పెరుగు, పసుపు, ఉప్పుతో కలిపి కనీసం 30 నిమిషాలు నానబెట్టాలి.
మసాలా పేస్ట్: పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లిని మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేయాలి.
ఉడికించడం: పాన్‌లో నెయ్యి, నూనె వేసి సుగంధ ద్రవ్యాలు, ఉల్లిపాయలు వేసి వేయించాలి. ఉల్లిపాయలు వేగిన తర్వాత సిద్ధం చేసిన మసాలా పేస్ట్ వేసి ఒక నిమిషం ఉడికించాలి.
చికెన్: ఇప్పుడు మ్యారినేట్ చేసిన చికెన్ వేసి బాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంట మీద 12 నిమిషాలు ఉడికించాలి. చికెన్ తన సొంత నీటిలోనే ఉడుకుతుంది.
బియ్యం ఎసరు: చికెన్ ఉడికాక, 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వేడి నీరు పోసి, నానబెట్టిన సిరగ సాంబా బియ్యాన్ని వేయాలి. నిమ్మరసం, ఉప్పు సరిచూసుకోవాలి.
దమ్ వేయడం: కుక్కర్ లేదా ఓవెన్ (200°C వద్ద 20 నిమిషాలు) ఉపయోగించి బియ్యాన్ని ఉడికించాలి. చివరగా మసాలాలు, చికెన్ ముక్కలు అన్నంతో కలిసేలా కదిపి వేడి వేడిగా రైతాతో వడ్డించాలి.