రంజాన్ స్పెషల్.. ఆంధ్రా స్టైల్ మసాలా గంజి.. ఇలా తయారు చేశారంటే తెపాళ్ల గిన్నె లేపాల్సిందే..
ఉపవాస విరమణ సమయంలో తీసుకునే గంజి అత్యంత పోషకమైన, తేలికగా అరిగే సాంప్రదాయ ఆహారం.. జస్ట్ బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లితో చేసే ఈ గంజి, రోజంతా ఉపవాసం తర్వాత శరీరానికి తక్షణ శక్తిని, హైడ్రేషన్‌ను (నీటి శాతం) అందిస్తూ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆంధ్రా స్టైల్ గంజి చేసుకుంటే లొట్టలేసుకుంటూ తాగాల్సిందే..

పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైంది.. ఈ నెలలో చాలా మంది ఉపవాసం ఉంటారు.. ముఖ్యంగా ఉపవాస విరమణ సమయంలో ఖర్జూరాలతోపాటు.. పండ్లు, హలీం లాంటివి తీసుకుంటారు.. అయితే.. రంజాన్ మాసంలో ఇఫ్తార్ సమయంలో తీసుకునే మరో స్పెషల్ వంటకం కూడా ఉంది.. అదేంటో కాదు.. గంజి.. అవును ఉపవాస విరమణ సమయంలో తీసుకునే గంజి అత్యంత పోషకమైన, తేలికగా అరిగే సాంప్రదాయ ఆహారం.. జస్ట్ బొంబాయి రవ్వ, అల్లం వెల్లుల్లితో చేసే ఈ గంజి, రోజంతా ఉపవాసం తర్వాత శరీరానికి తక్షణ శక్తిని, హైడ్రేషన్‌ను (నీటి శాతం) అందిస్తూ, జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఆంధ్రా స్టైల్ గంజి చేసుకుంటే లొట్టలేసుకుంటూ తాగాల్సిందే..
తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో రంజాన్ మాసంలో ఉపవాసాలు చేసే వారికి, ఇఫ్తార్ సమయంలో ఎంతో ఇష్టమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన వంటకం గంజి.. ఈ గంజి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.. ఇంకా రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. దీనిని బూందీతో కలిపి సర్వ్ చేస్తే రుచి మరింత పెరుగుతుంది. ఎన్నో పోషకాలున్న.. ఆంధ్రా స్టైల్ మసాలా గంజిని ఎలా తయారు చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం..
ఈ గంజిని తయారుచేయడానికి ముందుగా, ఒక పెద్ద పాత్రను స్టవ్ మీద పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని (నెయ్యి ఇష్టం లేనివారు నూనెను వాడవచ్చు) వేడి చేయాలి. నెయ్యి వేడెక్కిన తర్వాత, నాలుగు లవంగాలు, రెండు లేదా మూడు చిన్న దాల్చిన చెక్క ముక్కలు, చిన్న ముక్కలుగా కట్ చేసిన ఒక బిర్యానీ ఆకును వేసి రెండు నిమిషాల పాటు దోరగా వేయించాలి. సుగంధ ద్రవ్యాలు వేగిన తర్వాత, సన్నగా పొడవుగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల ఉల్లిపాయ ముక్కలు, చిన్న ముక్కలుగా తరిగిన ఒక పచ్చిమిర్చి, సన్నగా తరిగిన రెండు టేబుల్ స్పూన్ల క్యారెట్ ముక్కలను వేయాలి. వీటిని బాగా కలిపి, మూత పెట్టి రెండు నిమిషాల పాటు ఉల్లిపాయ, క్యారెట్ మగ్గే వరకు ఉంచాలి.
క్యారెట్ – ఉల్లిపాయ మగ్గిన తర్వాత, ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, పచ్చి వాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తరువాత, కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీర – కొన్ని పుదీనా ఆకులను వేసి ఒక నిమిషం పాటు బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత, ఒక టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన టమాటో ముక్కలను చేర్చాలి. వెంటనే ఒక టీ స్పూన్ సాల్ట్ ను కూడా వేయాలి.. సాల్ట్ కలపడం వల్ల టమాటో త్వరగా మగ్గుతుంది. అన్నింటిని సమానంగా కలిపి, మూత పెట్టి టమాటో మెత్తబడే వరకు రెండు నిమిషాల పాటు మగ్గించాలి.
టమాటో పూర్తిగా మగ్గి, కూరగాయలు అన్నీ మెత్తబడిన తర్వాత, ఒకటిన్నర లీటర్ల నీటిని చేర్చాలి. పాత్రపై మూత పెట్టి, నీటిని హై ఫ్లేమ్ లో బాగా మరగనివ్వాలి. నీరు మరుగుతున్నప్పుడు, రుచి చూసి ఉప్పు సరిపోకపోతే సర్దుబాటు చేసుకోవాలి. నీరు బాగా మరిగిన తర్వాత, ప్రధాన పదార్థమైన బొంబాయి రవ్వను (సుమారు 100 గ్రాములు) నెమ్మదిగా కలుపుతూ ఉండలు కట్టకుండా చూసుకోవాలి. బొంబాయి రవ్వను కలిపిన తర్వాత, హై ఫ్లేమ్ లో రెండు లేదా మూడు నిమిషాలు ఉంచితే సరిపోతుంది.
గంజి పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయాలి. ఎందుకంటే అది చల్లారిన తర్వాత చిక్కబడుతుంది. ఈ విధంగా ఎంతో సులభంగా తయారుచేయగల ఆంధ్రా స్టైల్ మసాలా గంజి రంజాన్ ఇఫ్తార్ కోసం సిద్ధమవుతుంది. ఈ ఆరోగ్యకరమైన, రుచికరమైన గంజిని వేడివేడిగా బూందీతో కలిపి ఆస్వాదించవచ్చు.
ఇది ఎవరైనా సులభంగా తయారుచేసుకుని తాగవచ్చు.. దీని రుచి ఎంతో అద్భుతంగా ఉంటుంది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
