Natural Farming: వావిలి ఒక రకమైన ఔషధ మొక్క. ఈ మొక్క ఆకులను వినాయక చవితి కి పత్రపూజలో ఉపయోగిస్తారు. వరసిద్ధివినాయక ఏకవింశతి పత్రి పూజా క్రమంలో ఈ ఆకు 14 ఆకు. ఈ వావిలి మొక్క రెండు రకాలు.. తెలుపు, నలుపు. సాధారణముగా నీటి వనరులు ఉన్న గట్ల మీద ఆంధ్రప్రదేశ్ అంతటా బంజరు భూముల్లో పెరుగుతుంది. ఈ మొక్క సాంప్రదాయ వైద్యంలో అనేక రకాలుగా ఉపయోగిస్తారు. అయితే ఈ వావిలాకుని సహజ సిద్ధమైన రసాయనిక క్రిమి సంహారకంగా కూడా ఉపయోగించవచ్చు.
వావిలాకు లో ఉండే “కాస్టిసిస్” అనే రసాయనం క్రిమి సంహారంగా పనిచేస్తుంది. వావిలి నిలువుగా పెరిగే గుబురు లేదా చిన్న వృక్షం. ఇది 2 – 8 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. బెరడు ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. ఆకులు ఐదు విభాగాలుగా ఉంటాయి. ప్రతి చిన్న ఆకు 4 నుండి 10 సెంటీమీటర్లు పొడవు ఉంటుంది. పూలు తెలుపు లేదా ఊదా లేదా నీలి రంగులో ఉంటాయి. దీని కషాయాన్ని సహజమైన ఎరువుగా ఉపయోగించవచ్చు. ఎలా తయారు చేయాలంటే..
కషాయం తయారు చేసే విధానం: 5 కిలోల వావిలాకు తీసుకుని కొంచెం మెత్తగా దంచి పది లీటర్ల నీటిలో అరగంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ విధంగా ఉడకబెట్టిన ద్రావణం సుమారు ఐదు లీటర్ల వరకు ఉంటుంది. ఉడుకుతున్న ద్రావణాన్ని మధ్యమధ్యలో కర్రతో కలుపుతూ ఉండాలి. ద్రావణం బాగా ఉడికిన తరువాత కషాయాన్ని బాగా చల్లార్చి, పలుచటి గుడ్డతో వడపోయాలి. కషాయానికి 100 గ్రాముల సబ్బు పొడిని లేదా 500 గ్రాముల కుంకుడు కాయ రసాన్ని కలపాలి. ఈ ద్రావణానికి నూరు లీటర్ల నీటికి చేర్చి ఒక్క ఎకరాకు సాయంత్రం సమయంలో పంటపై పిచికారి చేసుకోవాలి.
ఈ కషాయాన్ని పంటలో.. రసం పీల్చు పురుగుల పైన, చిన్న దశలో ఉన్న లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, ఆకులను తిని పురుగుల నివారణకు ఉపయోగిస్తారు. పంట కాలంలో పంట దశను, పురుగు ఉధృతిని బట్టి 2 – 3 సార్లు పిచికారి చేసుకోవచ్చు
పిచికారీ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు: వావిలాకు కషాయం తయారు చేసే సమయంలో ముక్కుకు తప్పనిసరిగా గుడ్డ కట్టుకోవాలి. అంతేకాదు ఈ కషాయం ఎప్పుడు కావాలంటే అప్పటికప్పుడు రెడీ చేసుకోవాలీ. అంతేకాని.. ముందుగా తయారు చేసుకొని నిల్వ చేసుకోరాదు.
Also Read: ఎవరు మీలో కోటీశ్వరులు షోలో మహేష్.. ఎప్పుడు ప్రసారం కానున్నదంటే..