Home Remedies For Skin: సాధారణంగా చాలామంది చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటారు. శీతాకాలంలో చర్మ సంబంధిత సమస్యలు మరింత పెరుగుతాయి. అయితే.. వీటి చికిత్స కోసం మనం ఎక్కువగా రసాయనాలతో నిండిన ఉత్పత్తులను ఉపయోగిస్తుంటాం. అయితే.. అవి మన చర్మానికి హాని కలిగిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సందర్భంలో మీరు సహజ పదార్ధాలను కూడా ఉపయోగించవచ్చు. ఇవి కొన్ని సాధారణ చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి. చర్మ సంరక్షణ కోసం ఇంటి కొన్ని ఇంటి చిట్కాలను ఉపయోగిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.
పసుపు
వంటగదిలో ఉండే ఔషధాలలో పసుపు కూడా ఒకటి. పసుపు శతాబ్దాలుగా సాంప్రదాయ వైద్యంలో భాగంగా ఉంది. యాంటీబయోటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్న పసుపును పురాతన కాలం నుంచి ఉపయోగిస్తున్నారు. ఇది అందం కోసం కూడా ఉపయోగిస్తారు. పసుపు మీ చర్మాన్ని మృదువుగా, మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా ఉపయోగించడం ద్వారా మీ చర్మ ఛాయను మెరుగుపరుచుకోవచ్చు. అందుకే బాడీ ప్యాక్‌లు లేదా సౌందర్య వస్తువుల తయారీలో పసుపును సాధారణంగా ఉపయోగించటానికి ఇది కూడా ఒక కారణం. పసుపు ఫేస్ టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. పెరుగులో చిటికెడు పసుపు కలిపి మొహంపై రాస్తే ట్యానింగ్ త్వరగా తొలగిపోతుంది. 20 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
రోజ్ వాటర్
రోజ్ వాటర్లో కొన్ని అద్భుతమైన సౌందర్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ సహజ పదార్ధం సున్నితమైన చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. రోజ్ వాటర్ నేచురల్ స్కిన్ టోనర్. ఇది చర్మాన్ని రిఫ్రెష్ చేయడంలో సహాయపడుతుంది. మీరు రోజ్ వాటర్‌ను అనేక రకాలుగా ఉపయోగించవచ్చు. జిడ్డు చర్మానికి ఇది చాలా మేలు చేస్తుంది. ఇది చర్మ రంధ్రాలను శుభ్రపరచడానికి, చర్మంపై జిడ్డును తగ్గించడానికి సహాయపడుతుంది. రోజ్ వాటర్, ముల్తానీ మిట్టి లేదా గంధపు పొడిని ఒక గిన్నెలో వేసి కలపాలి. బాగా మిక్స్ చేసి పేస్ట్‌లా తయారు చేసుకొని ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. కళ్ళు, పెదవులపై ఈ పేస్ట్‌ను పూయకూడదు. అలా అరగంట ఉంచిన తర్వాత నీటితో మొహాన్ని శుభ్రపరుచుకోవాలి.
తేనె
తేనె.. సాధారణ మాయిశ్చరైజింగ్ లక్షణాల కారణంగా దీనిని చర్మ సంరక్షణ ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. ఇది మీ చర్మాన్ని మృదువుగా మార్చే సహజమైన మాయిశ్చరైజర్. తేనె అన్ని చర్మ సమస్యలకు మేలు చేస్తుంది. తేనెను రోజూ 20 నిమిషాల పాటు ముఖానికి రాసుకుంటే.. ఫేస్ ప్యాక్‌లా పనిచేస్తుంది. ఇది చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా ఉంచడంలో సహాయపడుతుంది. డ్రై స్కిన్‌కి ఇది గ్రేట్ రెమెడీ. జిడ్డు చర్మం ఉన్నవారు రోజ్ వాటర్, నిమ్మరసం, తేనెను ఉపయోగించి.. ఫేస్ ప్యాక్‌ను తయారు చేసుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని చర్మాన్ని తేమగా మార్చడానికి ఉపయోగిస్తారు.
వేపాకులు
వేప సల్ఫర్ మూలకాలతో నిండి ఉంది. వేపఆకులు మీ జుట్టు, చర్మం రెండింటికీ మేలు చేస్తాయి. మొటిమలు, దద్దుర్లు మొదలైన అనేక చర్మ సమస్యలకు వేపను ఉపయోగించవచ్చు. ఒక గిన్నెలో 5 కప్పుల నీరు, కొన్ని వేప ఆకులను వేసి మరగబెట్టాలి. ఆ తర్వాత ఆకులను ఫిల్టర్ చేసి వేప నీటిని చల్లారనివ్వాలి. ఈ నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. వేపాకులతో ముఖంపై దద్దుర్లు, మొటిమలు, పగుళ్లకు చికిత్స చేయడానికి ఫేస్ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు.
Also Read: