Eye Exercises: కళ్ళ ఆరోగ్యానికి రోజూ ఇంట్లో ఈ వ్యాయామాలు చేయండి.. కళ్ళజోడుతో పని ఉండదు..

ప్రస్తుతం డిజిటల్ యుగం నడుస్తోంది. దీంతో స్క్రీన్ చూసే సమయం పెరిగింది. కంటి చూపు బలహీనపడటం ఒక సర్వ సాధారణ సమస్యగా మారింది. కంప్యూటర్లు, మొబైల్స్, టీవీలు, ల్యాప్‌టాప్‌లను అధికంగా ఉపయోగించడం వల్ల కళ్ళపై నిరంతరం ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా దృష్టి మసకబారడం, కంటి చికాకు, అలసట, తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా స్క్రీన్ ముందు ఎక్కువసేపు కూర్చునే వారు కంటి సంరక్షణపై ఎక్కువ శ్రద్ధ వహించాలి.

Eye Exercises: కళ్ళ ఆరోగ్యానికి రోజూ ఇంట్లో ఈ వ్యాయామాలు చేయండి.. కళ్ళజోడుతో పని ఉండదు..
Eye Exercises
Image Credit source: ahmed.clinic786

Updated on: Mar 06, 2025 | 1:23 PM

ఎవరికైనా వస్తువులు అస్పష్టంగా కనిపిస్తూ దృష్టి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే లేదా కళ్ళు త్వరగా అలసిపోతే.. భయపడాల్సిన అవసరం లేదు. రోజూ వారి దినచర్యలో కొన్ని సాధారణ కంటి వ్యాయామాలను చేర్చుకోవడం ద్వారా దృష్టి సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. అంతేకాదు కళ్ళను ఆరోగ్యంగా మార్చుకోవచ్చు. దృష్టి సమస్య నుంచి ఉపశమనం కోసం కొన్ని రకాల వ్యాయామాలు కంటి కండరాలను బలోపేతం చేయడంతో పాటు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అప్పుడు దృష్టి మెరుగుపడుతుంది. కనుక కంటి చూపును కాపాడుకోవడానికి సహాయపడే 5 ఉత్తమ కంటి వ్యాయామాల గురించి ఈ రోజు తెలుసుకుందాం..

కళ్ళకు విశ్రాంతి ఇచ్చేందుకు.. పామింగ్

ముందుగా నిశ్శబ్ద ప్రదేశంలో కూర్చుని మీ అరచేతులను ఒకదానికొకటి రద్దీ తద్వారా వేడి చేయండి. ఇప్పుడు మీ అరచేతులను మీ కళ్ళపై తేలికగా ఉంచండి. అయితే కళ్లపై ఎక్కువ ఒత్తిడి పెట్టవద్దు. ఈ స్థితిలో కొన్ని సెకన్ల పాటు ఉండి.. దీర్ఘ శ్వాస తీసుకోండి. ఇలా 2-3 నిమిషాలు చేయండి. ఈ వ్యాయామం కళ్ళ అలసటను తగ్గించి, వాటికి విశ్రాంతినిస్తుంది. ఇలా చేయడం వల్ల స్క్రీన్‌ను ఎక్కువసేపు చూసిన తర్వాత కళ్ళకు తక్షణ ఉపశమనం లభిస్తుంది.

కళ్ళలో తేమను నిర్వహించడానికి.. రెప్పపాటు

10-15 సెకన్ల పాటు మీ కళ్ళను వేగంగా రెప్పలు వేయండి. తర్వాత కళ్ళు మూసుకుని కొన్ని సెకన్ల పాటు విశ్రాంతి తీసుకోవాలి. ఈ ప్రక్రియను 4-5 సార్లు పునరావృతం చేయండి. రెప్పపాటు వ్యాయామాలు కళ్ళను తేమగా ఉంచడంలో సహాయపడతాయి. డ్రై ఐ సిండ్రోమ్‌ను నివారిస్తాయి. స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడిపే వారికి ఇది చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఇవి కూడా చదవండి

కంటి చూపుని పెంచడానికి .. దృష్టి కేంద్రీకరణ

చేతిలో పెన్నును లేదా వేలును పట్టుకుని మీ కళ్ళకు ముందు కొంత దూరంలో ఉంచండి. ఇప్పుడు నెమ్మదిగా దాన్ని మీ ముక్కు వైపుకు తీసుకురండి.. ఆపై వెనక్కి తీసుకుని వెళ్ళండి. ఈ సమయంలో తప్పకుండా కళ్ళను పెన్నుపై కేంద్రీకరించండి. ఈ ప్రక్రియను 5-10 సార్లు పునరావృతం చేయండి. ఈ వ్యాయామం కళ్ళ దృష్టి కేంద్రీకరణ సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. అస్పష్టమైన దృష్టి సమస్యను తొలగించడంలో సహాయపడుతుంది.

కంటి కండరాలను బలోపేతం చేయడానికి.. కళ్ళు తిప్పడం

కళ్ళను మొదట కుడి వైపుకు, తరువాత ఎడమ వైపుకు తిప్పండి. తర్వాత పైకి క్రిందికి తిప్పండి. ఈ ప్రక్రియను 5-5 సార్లు పునరావృతం చేయండి. ఈ వ్యాయామం కంటి కండరాలను బలపరుస్తుంది. దృష్టి సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇది దృష్టి లోపాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

కంటి కదలిక కోసం.. 8 ఆకార వ్యాయామం

ముందు ఒక ఊహాత్మక సంఖ్య 8 ని తయారు చేసి.. దానిని మీ కళ్ళతో గుర్తించండి. మొదట 8 ని ఒక దిశలో, తరువాత మరొక దిశలో చూడండి. ఈ ప్రక్రియను 4-5 సార్లు పునరావృతం చేయాలి. ఈ వ్యాయామాలు కళ్ళ కదలికను మెరుగుపరుస్తాయి. వాటిని మరింత సరళంగా చేస్తాయి.

వ్యాయామంతో పాటు జాగ్రత్త తీసుకోవడం కూడా ముఖ్యం

కళ్ళను పదే పదే రుద్దవద్దు. డిజిటల్ స్క్రీన్ల నిరంతరం చూడకుండా అప్పుడప్పుడు విరామం తీసుకోండి. కళ్ళను హైడ్రేట్ గా ఉంచడానికి ఎక్కువ నీరు త్రాగాలి. ఆకుకూరలు, విటమిన్ ఎ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి. రాత్రి సమయంలో బాగా నిద్రపోవాలి. తద్వారా కళ్ళు విశ్రాంతి తీసుకుంటాయి. దృష్టి సమస్య ఏర్పడదు.

 

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)