సమ్మర్‌లో నోరు ఎండిపోతోందా? డ్రై మౌత్ సమస్యకు చెక్ పెట్టే కిచెన్ టిప్స్
వేసవి కాలంలో ఎండల తీవ్రత, డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) మరియు విపరీతంగా చెమటలు పట్టడం వల్ల చాలామంది ఎదుర్కొనే ఒక సాధారణ సమస్య 'డ్రై మౌత్' (నోరు ఎండిపోవడం). సాధారణంగా నోరు ఎండిపోయినప్పుడు చాలామంది మార్కెట్లో దొరికే మౌత్ వాష్‌లతో నోటిని శుభ్రం చేసుకుంటుంటారు. అయితే, అలా చేయడం వల్ల సమస్య తగ్గకపోగా మరింత ఎక్కువవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎండకాలంలో నోరు ఎండిపోకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు చెప్పిన ఆసక్తికరమైన హెల్త్ టిప్స్ గూగుల్ ట్రెండ్స్‌లో వైరల్ అవుతున్నాయి. అధికశాతం మౌత్ వాష్‌లలో ఆల్కహాల్ లేదా అస్ట్రింజెంట్స్ ఉంటాయి. ఇవి నోటిలోని తేమను లాగేసి ఆరబెట్టేస్తాయి. దీనికి బదులుగా గోరువెచ్చని ఉప్పు నీటితో నోటిని పుక్కిలించడం వల్ల నోరు ఆల్కలైజ్ అవ్వడమే కాకుండా హాయిగా ఉంటుంది.
ఆయిల్ పుల్లింగ్
నోరు ఎండిపోయే సమస్యకు డాక్టర్ నీతికా మోడీ సూచించిన మరో అద్భుతమైన మార్గం ‘ఆయిల్ పుల్లింగ్’. రాత్రి పడుకునే ముందు ఆయిల్ పుల్లింగ్ చేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రాత్రిపూట నోటి ద్వారా శ్వాస తీసుకునే అలవాటును (ఓపెన్-మౌత్ బ్రీతింగ్) నియంత్రించి, ఉదయానికి నోరు ఎండిపోకుండా చూస్తుంది. అంతేకాకుండా, ఇది నోటిలోని హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేస్తుంది. దీనివల్ల నోరు ఎల్లప్పుడూ తాజాగా, గులాబీ రంగులో ఆరోగ్యంగా ఉంటుంది. పళ్ళు కూడా తెల్లగా మెరుస్తాయి. ఆయిల్ పుల్లింగ్ చేయడం ద్వారా ముఖ కండరాలకు (ఫేషియల్ మసల్స్) మంచి వ్యాయామం కూడా లభిస్తుంది.
ముఖ్యమైన జాగ్రత్తలు
ముంబైకి చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ షరీఫా చౌసే కూడా ఈ చిట్కాలను సమర్థిస్తూ, వేసవిలో నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మరికొన్ని సులువైన అలవాట్లను పంచుకున్నారు.
- దాహం వేసే వరకు ఆగకుండా రోజంతా కొద్దికొద్దిగా నీటిని తాగుతూ ఉండాలి. సాదా నీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, ఫ్రెష్ జ్యూస్‌లను డైట్‌లో చేర్చుకోవాలి. కెఫిన్ (టీ, కాఫీ), ఆల్కహాల్ మరియు చక్కెర ఎక్కువగా ఉండే పానీయాలకు దూరంగా ఉండాలి, ఎందుకంటే ఇవి నోటి పొడిదనాన్ని పెంచుతాయి.
- మసాలాలు, విపరీతమైన ఉప్పు ఉన్న ఆహార పదార్థాలు నోటిలోని తేమను తగ్గిస్తాయి. కాబట్టి వేసవిలో తేలికపాటి, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. వాటర్ మిలన్ (పుచ్చకాయ), కీరదోస, నారింజ వంటి నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను క్రమం తప్పకుండా తినాలి.
- రోజుకు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం, నాలుకను మృదువుగా క్లీన్ చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఒకవేళ మౌత్ వాష్ వాడాల్సి వస్తే, ఖచ్చితంగా ‘ఆల్కహాల్-ఫ్రీ’ మౌత్ వాష్‌లను మాత్రమే ఎంచుకోవాలి. షుగర్-ఫ్రీ గమ్ నమలడం వల్ల నోట్లో లాలాజలం (సలైవా) ఉత్పత్తి పెరిగి నోరు ఎండిపోకుండా ఉంటుంది.
లైఫ్‌స్టైల్ మార్పులు
ఎక్కువ సమయం ఎండలో తిరగకుండా జాగ్రత్తపడాలి. నోటి ద్వారా కాకుండా ముక్కు ద్వారానే శ్వాస తీసుకోవడం వల్ల నోరు త్వరగా ఎండిపోదు. ఒకవేళ ఈ డ్రై మౌత్ సమస్య చాలా కాలం పాటు వేధిస్తూ, తీవ్రమైన అసౌకర్యాన్ని కలిగిస్తుంటే వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది. ఎందుకంటే ఇది మీరు వాడే కొన్ని రకాల మందుల వల్ల లేదా ఇతర ఆరోగ్య సమస్యల వల్ల కూడా కావచ్చు. ఈ వేసవిలో సరైన రీతిలో హైడ్రేటెడ్‌గా ఉంటూ నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోండి.
