డయాబెటిస్.. ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలో ఇదీ ఒకటి. రోజురోజుకీ ఈ వ్యాధి బారినపడుతోన్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా భారత్‌లో డయాబెటిస్ బాధితుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దీంతో డయాబెటిస్ వచ్చిన వారు జీవన శైలిలో మార్పులు తీసుకోవాలని, తీసుకునే ఆహారంలో జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతుంటారు. అయితే డయాబెటిస్ ఉన్న వారు పెరుగును తీసుకొవచ్చా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉంటుంది. ఇంతకీ డయాబెటిస్ ఉన్న వారు పెరుగును తీసుకుంటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డయాబెటిస్ ఉన్న వారికి పెరుగు దివ్యౌషధమని నిపుణులు చెబుతున్నారు. రోజు ఒక కప్పు పెరుగు తీసుకునే వారికి షుగర్ అదుపులో ఉంటుందని చెబుతున్నారు. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. రోజులో కనీసం రెండు కప్పుల పెరుగు తినడం వల్ల టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుందని అంటున్నారు. అయితే షుగర్‌తో బాధపడుతున్న వారు పెరుగులో ఎట్టి పరిస్థితుల్లో చక్కెర కలుపుకోకూడదని చెబుతున్నారు.
హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ యొక్క డిపార్ట్మెంట్ ఆఫ్ న్యూట్రిషన్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధనల్లో కూడా ఇదే విషయం వెల్లడైంది. పెరుగును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని తేలింది. అయితే బాదం, కొబ్బరి పాలు వంటి వాటితో తయారయ్యే పెరుగుకు కాకుండా కేవలం పాల ద్వారా తయారు చేసిన పెరుగుతోనే ఇలాంటి లాభం ఉంటుంది.
పెరుగులో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. దీంతో ఇన్సులిన్ సహాయం లేకుండానే రక్తంలో చక్కెర స్థాయిలలో ఇది నియంత్రించగలదు. మధుమేహ వ్యాధిగ్రస్తులకు పెరుగు మేలు చేస్తుందని చెప్పేందుకు ఇదే కారణం. సాధారణంగా తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాలలో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. వాటి నుంచి విడుదలయ్యే శక్తి కూడా నెమ్మదిగా విడుదలవుతుంది. కాబట్టే రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరగవని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షుగర్ పేషేంట్స్ ఎలాంటి భయం లేకుండా రోజు పెరుగు తీసుకోవచ్చు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..