Car Tips: ఎండల్లో ఏసీ వాడకుండా ఉండలేం.. మరి పెట్రోల్ ఆదా చేయడం ఎలా?
మండుతున్న ఎండల్లో కారు ప్రయాణం చేయాలంటే ఏసీ ఉండాల్సిందే. కారు ఎక్కిన వెంటనే ఏసీ ఆన్ చేయడం మనందరికీ అలవాటు. అయితే, చాలా మంది వాహనదారులను వేధించే ప్రశ్న ఒకటే.. ఏసీ వాడటం వల్ల పెట్రోల్ త్వరగా అయిపోతుందా?. దీనికి సమాధానం అవును అనే చెబుతున్నారు నిపుణులు. కారులోని ఏసీ పని చేయాలంటే ఇంజిన్ నుండి అదనపు శక్తి అవసరమవుతుంది, ఇది నేరుగా మీ పెట్రోల్ వినియోగంపై ప్రభావం చూపుతుంది.

కారులో ఏసీ వాడటం వల్ల మైలేజ్ తగ్గుతుందన్నది పచ్చి నిజం. అయితే అది ఎంత పెట్రోల్‌ను మింగేస్తుంది అనేది మీ కారు ఇంజిన్ సామర్థ్యం మరియు బయటి ఉష్ణోగ్రతపై ఆధారపడి ఉంటుంది. ఒక నివేదిక ప్రకారం, ఏసీ వాడకం వల్ల మైలేజీలో గణనీయమైన మార్పులు వస్తాయి. అసలు ఏసీ వల్ల పెట్రోల్ ఎందుకు ఎక్కువ ఖర్చవుతుంది? ఆ అదనపు భారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు వివరంగా చూద్దాం.
ఏసీ పెట్రోల్ వినియోగం – కొన్ని వాస్తవాలు:
ఇంజిన్‌పై భారం: కారు ఏసీ కంప్రెసర్ ఇంజిన్ బెల్ట్ ద్వారా శక్తిని పొందుతుంది. ఏసీ ఆన్ చేసినప్పుడు కంప్రెసర్ పని చేయడానికి ఇంజిన్ అదనంగా శ్రమించాల్సి వస్తుంది, దీనివల్ల పెట్రోల్ వినియోగం పెరుగుతుంది.
ఎంత పెట్రోల్ ఖర్చవుతుంది?: సాధారణంగా గంట పాటు ఏసీ వాడితే సగటున 1.2 లీటర్ల పెట్రోల్ ఖర్చవుతుందని అంచనా.
మైలేజ్ తగ్గుదల: కారులో ఏసీ వాడటం వల్ల మైలేజ్ సుమారు 5 నుండి 10 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. కొన్ని సందర్భాల్లో పెట్రోల్ వినియోగం 20% వరకు పెరగవచ్చు.
హైవే ప్రయాణంలో: ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, హైవేపై వేగంగా వెళ్తున్నప్పుడు కిటికీలు తెరిచి ఉంచడం కంటే ఏసీ ఆన్ చేయడం వల్ల తక్కువ పెట్రోల్ ఖర్చవుతుంది. ఎందుకంటే కిటికీలు తెరిస్తే వచ్చే గాలి కారు వేగాన్ని అడ్డుకుంటుంది (Aerodynamic Drag), దీనివల్ల ఇంజిన్ పై ఎక్కువ భారం పడుతుంది.
పెట్రోల్ ఆదా చేయడానికి చిట్కాలు:
కారు ఎక్కిన వెంటనే ఏసీ ఆన్ చేయకుండా, ముందు కిటికీలు తెరిచి లోపలి వేడి గాలిని బయటకు పంపండి.
కారును ఎప్పుడూ నీడలోనే పార్క్ చేయడానికి ప్రయత్నించండి, దీనివల్ల కారు త్వరగా చల్లబడుతుంది.
ఏసీని మరీ తక్కువ ఉష్ణోగ్రతలో కాకుండా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉంచడం వల్ల ఇంజిన్‌పై భారం తగ్గుతుంది.
