
గుడ్లు పౌష్టికాహారం. అందుకే ఆరోగ్య నిపుణులు, వైద్యులు ప్రతిరోజూ గుడ్లను ఆహారంలో తీసుకోమని చెబుతుంటారు. అధిక ప్రోటీన్లు, విటమిన్లు ఉండటంతో ప్రజలు కూడా అనేక రకాలుగా వండుకుని తింటుంటారు. కొంతమంది ఉడకబెట్టిన కోడిగుడ్లు తింటే.. మరికొందరు ఆమ్లెట్లు, కూరలు వండుకుని తింటూంటారు. అయితే, ఇంకొందరు మాత్రం గుడ్లను పగలగొట్టి పచ్చిగానే తింటారు. పచ్చి గుడ్లు తినడం వల్ల ఎక్కువ ప్రోటీన్లు లభిస్తాయా? లేక వండిన కోడిగుడ్ల వల్ల ఎక్కువ పోషకాలు లభిస్తాయా? అనేది పెద్ద సందేహంగా మారింది. దీని చుట్టూ అనేక అపోహలు కూడా ఉన్నాయి. వండినవే మేలని కొందరు అంటే.. పచ్చివే బెటర్ అని మరికొందరు అంటారు. ఇందులో వాస్తవాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి గుడ్లు తినడం వల్ల ఎక్కువ ప్రోటీన్ లభిస్తుందనే భావన నిజం కాదని వైద్యులు వివరిస్తున్నారు. ఆమ్లెట్లు లేదా ఉడికించిన గుడ్లు వంటి వండిన గుడ్లు ఎక్కువ ప్రోటీన్ శోషణకు దోహదం చేస్తాయని మీరు తెలుసుకోవాలి. ఉడికించిన గుడ్లు తినడం వల్ల 90 శాతం వరకు ప్రోటీన్ శోషణ జరుగుతుంది. అయితే పచ్చి గుడ్లు తినడం వల్ల 50 శాతం మాత్రమే ప్రోటీన్ శోషణ జరుగుతుంది.
వైద్యారోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పచ్చి గుడ్లు తినడం వల్ల ఇన్ఫెక్షన్ కూడా వస్తుంది. దీనివల్ల విరేచనాలు, మలబద్ధకం వంటి సమస్యలు వస్తాయి. పచ్చి గుడ్లు తినడం వల్ల వికారం, గ్యాస్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. ఇంకా, పచ్చి గుడ్లు బయోటిన్ శోషణను నిరోధిస్తాయి. ఇది జుట్టు రాలడానికి, విటమిన్ లోపానికి దారితీస్తుంది. అందువల్ల మీరు పచ్చి గుడ్లు కాకుండా ఉడికించిన లేదా వండి గుడ్లను మాత్రమే తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇక, గుడ్లు ప్రోటీన్ యొక్క అద్భుతమైన మూలం అని అందరికీ తెలిసిందే. అయితే, వాటిలో విటమిన్లు, కొవ్వులు, విటమిన్ డి, విటమిన్ బి 12 కూడా ఉంటాయి. వ్యక్తులు వారి బరువు, వయస్సు ప్రకారం గుడ్లు తినాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. ఇంకా, గుడ్లు వేడి చేసే ప్రభావాన్ని కలిగి ఉంటాయి, కాబట్టి వేసవిలో వాటిని తక్కువగా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.