
కొందరు తిన్న వెంటనే మీకూ టాయిలెట్‌కి వెళ్లాలని అనిపిస్తుందా? తరచుగా మలవిసర్జన చేయాలని ఎందుకు అనిపిస్తుంది? వంటి సందేహాలు మీకు ఎప్పుడైనా వచ్చాయా? నిజానికి, ఈ సమస్య మీది మాత్రమే కాదు. చాలా మందికి ఈ సమస్య ఉంది. కొంతమంది దీనిని తేలికగా తీసుకుంటారు. తిన్న వెంటనే మలవిసర్జన చేయాలనే కోరికను గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అంటారు . ఇది మన శరీర సహజ జీర్ణ ప్రక్రియలో భాగం. హార్వర్డ్ వైద్యుడు సౌరభ్ సేథి ఏం చెబుతున్నారంటే.. ఇలా జరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని నివారించడానికి చిట్కాలను కూడా ఆయన ఇచ్చారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..
సాధారణంగా మనం ఏదైనా ఆహారాన్ని తీసుకున్నప్పుడు కడుపుకు చేరాక.. ఆహారం జీర్ణవ్యవస్థను ప్రేరేపిస్తుంది. ముఖ్యంగా కడుపు నిండినప్పుడు, శరీరం పెద్ద ప్రేగుకు సంకేతాలను పంపుతుంది. ఈ సంకేతాలు పెద్ద ప్రేగు సంకోచించడానికి కారణమవుతాయి. ఈ సంకోచాల ఫలితంగా వెనుక నుంచి జీర్ణం కాని వ్యర్థాలు ముందుకు కదులుతాయి. ఒక విధంగా ఇది మీ జీర్ణవ్యవస్థను ఖాళీ చేయడానికి ప్రేరేపిస్తుంది. ఇది ఒక కారణమైతే, దీనితో పాటు అనేక ఇతర కారణాలు కూడా ఉన్నాయి.
తిన్న వెంటనే మలవిసర్జన జరగడం సహజమే. కానీ మరికొన్ని లక్షణాలు ఉంటే విస్మరించకూడదు. ఉదాహరణకు మలవిసర్జన చేసేటప్పుడు మీకు తీవ్రమైన కడుపు నొప్పి వస్తే, మీకు తరచుగా విరేచనాలు లేదంటే మలబద్ధకం సమస్యలు ఎదురైతే, మలంలో రక్తం కనిపిస్తే, మలం ముదురు రంగులో ఉంటే తప్పక వైద్యుడిని సంప్రదించాలి.
ఒకేసారి ఎక్కువగా తినడం మానేయాలి. అలా చేయడం వల్ల గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ పెరుగుతుంది. అందుకే వైద్యులు మితంగా తినాలని సిఫార్సు చేస్తారు. కాబట్టి, రోజుకు చాలాసార్లు తక్కువ మొత్తంలో ఆహారం తీసుకోవడం మంచిది. ఇది మీ జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఫలితంగా గ్యాస్ లేదా ఆమ్లత్వం సమస్యలు ఉండవు. అలాగే ఆహారంలో కరిగే ఫైబర్ ఉన్న ఆహారాలను చేర్చుకోవాలి. ఇది నీటిని గ్రహింయి.. జెల్ లాంటి పదార్థాన్ని ఏర్పరుస్తుంది. ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. సులభంగా విసర్జించడంలో సహాయపడుతుంది. అంతే కాదు ఇది జీర్ణక్రియను నెమ్మదింపచేస్తుంది. గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్ అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. ఓట్స్, ఆపిల్స్, క్యారెట్లు, చిక్కుళ్ళులో కరిగే ఫైబర్ అధికంగా ఉంటుంది. వీటిని మీ ఆహారంలో చేర్చుకోవచ్చు. వీలైనంత వరకు గ్యాస్ట్రోకోలిక్ రిఫ్లెక్స్‌ను పెంచే ఆహారాన్ని తీసుకోవడం మానుకోవాలి. అంటే స్పైసీ ఫుడ్స్, పాల ఉత్పత్తులు, కెఫిన్, కృత్రిమ చక్కెరలు వంటి ఆహారాలను తీసుకోవడం తగ్గించాలి.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.