
మధుమేహంతో బాధపడేవారు ముఖ్యంగా ఆహారాల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా చపాతీ, అన్నం విషయంలో తరచుగా సందేహాలు వ్యక్తం అవుతాయి. మరి ఈ అంశంపై డాక్టర్ దీప్తి కరేటి ఏమన్నారో ఇప్పుడు చూసేద్దాం.. ఈ రెండు ఆహారాలు కూడా అధిక పోషక నిల్వలు ఉన్నవిగా ఆమె పేర్కొంది. అలాగే రెండింటిని ఎంత మోతాదులో తీసుకుంటే.. ఆరోగ్యానికి అంత మంచిదని చెప్పింది. ఒక కప్పు అన్నంలో సుమారు 50 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. అయితే ఒక చపాతీలో దాదాపు 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు లభిస్తాయి. చపాతీలో అన్నం కంటే సుమారు 2 గ్రాముల ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా గోధుమ పిండితో తయారైన చపాతీలో బియ్యం కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయి. ఒక చపాతీలో దాదాపు 71 కేలరీలు, 3 గ్రాముల ప్రోటీన్, 0.4 గ్రాముల కొవ్వు, 15 గ్రాముల కార్బోహైడ్రేట్లు ఉంటాయి. బియ్యంలో ఫాస్ఫరస్, మెగ్నీషియం.. గోధుముల కంటే తక్కువగా ఉంటాయి. అయితే ఫోలేట్, ఐరన్ మాత్రం రెండింటిలోనూ దాదాపు సమానంగా లభిస్తాయి.
మధుమేహ వ్యాధిగ్రస్తులు అన్నం లేదా చపాతీలలో ఏదైనా తీసుకోవచ్చు. కానీ పరిమితిలోనే తీసుకోవాల్సి ఉంటుంది. ఒక కప్పు అన్నం లేదా రెండు చపాతీలు ఒకే కేలరీల స్థాయికి సమానం. డిన్నర్‌లో, చాలామంది డయాబెటిక్ పేషెంట్లు అన్నం తీసుకున్నప్పుడు పరిమితి లేకుండా తినే అవకాశం ఉంది. కానీ చపాతీలను తీసుకోవడం ద్వారా మోతాదును సులభంగా నియంత్రించవచ్చు. రెండు చపాతీలతో డిన్నర్ ముగించడం వారికి మంచిది. జొన్నలు, సజ్జలు, రాగులు వంటి మిశ్రమ ధాన్యాలతో చేసిన చపాతీలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి.. ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉండటం వల్ల మధుమేహాన్ని కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. శుద్ధి చేయని, తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న Wholegrain పిండిని ఎంచుకోవడం మంచిదని నిపుణులు అంటున్నారు.
మరిన్ని ఆరోగ్య కథనాల కోసం క్లిక్ చేయండి.