పెళ్లికి ముందు కట్నకానుకలు, ఆస్తి, జీతం కన్నా.. ఈ 4 వైద్య పరీక్షల రిపోర్ట్స్ అడగండి.. అసలు కథ తెలుస్తుంది!
భారతీయులకు పెళ్లి ఒక సాంప్రదాయ వేడుక. అంతేకాదు వివాహం అంటే రెండు జీవితాలను మరణం వరకూ కలిపి ఉంచే ఒక బంధం. ఇప్పుడు పెళ్లికి అర్ధం మారిపోయింది.. వధువు ఎంత కట్నం తెస్తుంది.. వరుడు ఎంత సంపాదిస్తున్నాడు అని అనే స్టేజ్కి చేరుకున్నారు. వైద్యులు పెళ్ళికి ముందు వధువరులను కట్న కానుల గురించి కాదు కొన్ని వైద్య పరీక్షలు చేయించుకోమని.. ఆ రిపోర్ట్ చూపించమని అడగాలని సూచిస్తున్నారు. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వైవాహికజీవితానికి కాబోయే వధూవరుల మధ్య ఆరోగ్యం గురించి తెలిసి ఉండాలని చెబుతున్నారు. మరి వైద్యులు చెప్పిన ఆ నాలుగు పరీక్షలు ఏమిటంటే..

వివాహం అనేది ఇద్దరు వ్యక్తులను, కుటుంబాలను కలిపే పవిత్ర బంధం. వైవాహిక బంధానికి పునాది భావోద్వేగం మాత్రమే కాదు, ఆరోగ్య రక్షణపై కూడా ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యకరమైన, సంతోషకరమైన వైవాహిక జీవితానికి ఆరోగ్య అవగాహన చాలా ముఖ్యం. ఈ విషయంలో మేఘాలయ రాష్ట్రం ఒక సరికొత్త నిర్ణయం తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వివాహానికి ముందు HIV పరీక్ష తప్పనిసరి కావచ్చననే వార్తలు వస్తున్నాయి. గోవాలో ఇప్పటికే అలాంటి నియమం ఉందని తెలిసిందే.
అటువంటి పరిస్థితిలో వధూవరులు వివాహానికి ముందు ఏ వైద్య పరీక్షలు చేయించుకోవాలో చాలా మంది ఆలోచిస్తున్నారు. ఈ పరీక్షలు సకాలంలో ఆరోగ్య సమస్యల గురించి తెలియజేయడమే కాదు.. భవిష్యత్ ఎదురయ్యే సవాళ్లకు సిద్ధం కావడానికి కూడా సహాయపడతాయి. ప్రతి వధూవరులు వివాహానికి ముందు తప్పనిసరిగా నాలుగు ముఖ్యమైన వైద్య పరీక్షలను చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఆ వైద్య పరీక్షలు ఏమిటి? ఎందుకు చేయించుకోవాలో తెలుసుకుందాం..
HIV పరీక్ష: వివాహానికి ముందు చేయవలసిన ముఖ్యమైన పరీక్షలలో HIV (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియెన్సీ వైరస్) పరీక్ష ఒకటి. ఈ పరీక్ష భాగస్వాములలో ఎవరికీ వైరస్ సోకలేదని నిర్ధారిస్తుంది. HIV లైంగికంగా సంక్రమించే వ్యాధి కనుక పెళ్ళికి ముందే తెలిసి ఉండడం ముఖ్యం అని వైద్యులు చెబుతున్నారు.
ఈ పరీక్ష ఎందుకు ముఖ్యమైనదంటే ఒక భాగస్వామికి ఇన్ఫెక్షన్ ఉంటే.. వివాహం తర్వాత ఇన్ఫెక్షన్ ప్రమాదం పెరుగుతుంది. ముందస్తుగా గుర్తించడం వల్ల ఇన్ఫెక్షన్ మరొక భాగస్వామికి వ్యాపించకుండా నిరోధించడమే కాదు.. భవిష్యత్తులో పిల్లలు పుట్టాలని ప్లాన్ చేస్తుంటే తల్లి నుంచి బిడ్డకుఈ వ్యాధి సంక్రమించే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ముందస్తుగా గుర్తించడం వల్ల వ్యాధి సోకిన వ్యక్తి వెంటనే యాంటీరెట్రోవైరల్ థెరపీని ప్రారంభించవచ్చు. తద్వారా HIV ఉన్నాసరే సాధారణమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపవచ్చు.
వంధ్యత్వ పరీక్ష: వివాహానికి ముందు కాబోయే జంటలకు..ముఖ్యంగా భవిష్యత్తులో పిల్లలు కావాలని ప్లాన్ ఉన్నవారికి ఈ వంధ్యత్వ పరీక్ష చాలా ముఖ్యమైనది. ఈ పరీక్ష ఇద్దరు భాగస్వాముల సంతానోత్పత్తిని అంచనా వేస్తుంది.
ఎందుకు ముఖ్యమైనదంటే ఈ పరీక్ష పురుషుడిలో స్పెర్మ్ నాణ్యత, స్పెర్మ్ కౌంట్ లేదా స్త్రీలోని అండోత్సర్గము, పునరుత్పత్తి అవయవాలకు సంబంధించిన సంభావ్య సమస్యలను వెల్లడిస్తుంది. స్త్రీ పురుషులలో ఏదైనా సమస్య ఉన్నట్లు తెలిస్తే.. ఈ జంట ముందుగానే తమ సమస్య గురించి తెలుసుకుంటారు. భవిష్యత్తు కోసం మానసికంగా, ఆర్థికంగా సిద్ధం అయ్యే అవకాశం ఉంది. స్త్రీలకు బిడ్డను గర్భం ధరించడంలో ఇబ్బంది ఉంటే తరువాత తలెత్తే అనవసరమైన ఒత్తిడి, నిరాశను నివారించడానికి ఇది సహాయపడుతుంది. ఈ పరీక్ష ద్వారా మహిళలు సంతానోత్పత్తి నిపుణులను సంప్రదించడానికి, సరైన సమయంలో చికిత్స ఎంపిక చేసుకునేందుకు వీలు కల్పిస్తుంది.
డయాబెటిస్ టెస్ట్ డయాబెటిస్ అనేది జీవనశైలి, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే దీర్ఘకాలిక వ్యాధి. వివాహానికి ముందు ఈ పరీక్ష (HbA1c లేదా ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ వంటివి) ఎవరైనా డయాబెటిస్ సమస్యతో ఉన్నారా లేదా ప్రీడయాబెటిక్ స్థితిలో ఉన్నారా అని నిర్ణయిస్తుంది. ముందుగానే ఈ ఆరోగ్య సమస్యని గుర్తించినట్లయితే జీవనశైలిలో మార్పులు, సరైన నిర్వహణ చేసుకోవచ్చు. అంతేకాదు స్త్రీలు గర్భధారణ సమయంలో ఈ సమస్య ప్రమాదకరంగా మారకుండా జాగ్రత్తగా ఉండడమే కాదు షుగర్ వలన భవిష్యత్తులో వచ్చే సమస్యలను నివారించవచ్చు. ఇది ఇద్దరు భాగస్వాములు కలిసి ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవడానికి ప్రేరేపిస్తుంది.
గుండె ఆరోగ్య పరీక్ష: ప్రధానంగా కొలెస్ట్రాల్ స్థాయిలు (లిపిడ్ ప్రొఫైల్), బీపీ పరీక్షలు చేస్తూనే ఉంటాయి. అధిక కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు ప్రారంభ దశలో ఎటువంటి లక్షణాలను కలిగి ఉండవు. అయితే ఈ సమస్యలే గుండె జబ్బులకు ప్రధాన ప్రమాద కారకాలు. ఈ పరీక్షలు భాగస్వామిలో ఎవరికైనా ఇప్పటికే గుండె సమస్య ఉందో లేదో నిర్ణయించగలవు. ఈ సమాచారంతో వారు ఆహారం, జీవనశైలిలో మార్పులు చేసుకుని తద్వారా వారు తమ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఇది దీర్ఘకాలంలో భార్యాభర్తలు మెరుగైన, సురక్షితమైన జీవితం గడిపేలా చేస్తుంది.








