Back Pain: ఆఫీస్‌లో కుర్చీలో గంటల తరబడి కూర్చుని వర్క్ చేసే అలవాటు మీకూ ఉందా?
కొంతమంది ఆఫీస్ లో వర్క్ చేసేటప్పుడు సమయం మర్చిపోతారు. తాము ఎన్ని గంటలుగా ఒకే పొజిషన్లో కూర్చున్నారో కూడా పట్టించుకోరు. ఇలా గంటల తరబడి కుర్చీలో కూర్చుంటే త్వరలోనే మీ ఒంట్లోకి కొత్తకొత్త రోగాలు వచ్చి తిష్టవేస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

ఒక్కోసారి వెన్ను నొప్పి విపరీతంగా వేధిస్తుంది. నిజానికి వెన్ను, నడుము నొప్పి అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. ఎక్కువ సేపు కూర్చోవడం, ఎక్కువ సేపు నిలబడటం వల్ల నడుము నొప్పి వస్తుంది. చాలా మంది పనిలో పడి ఆఫీసుల్లోని కుర్చీలో గంటల తరబడి కూర్చుంటారు. అలాగే కూర్చీలో కూడా సరిగ్గా కూర్చోరు. ఆఫీసులో డెస్క్‌లో నిరంతరం పని చేస్తున్నప్పుడు చాలా మందికి అకస్మాత్తుగా వెన్ను, నడుము నొప్పి సంభవిస్తుంది. కొందరు దీనిని పెద్దగా పట్టించుకోరు. కానీ ఇదే పెద్ద పొరబాటు. వెన్నునొప్పి రెండు మూడు రోజుల్లో తగ్గకపోతే జాగ్రత్త అవసరం. ఈ సమస్యతో బాధపడేవారు వీలైనంత త్వరగా డాక్టర్ వద్దకు వెళ్లాలి. వెన్ను, నడుము నొప్పి తగ్గించడానికి వైద్యులు మందులు సూచిస్తారు. మందులతోపాటు కొద్దిపాటి జాగ్రత్తలు కూడా తీసుకుంటే వెన్ను నొప్పి నుంచి సులువుగా బయటపడొచ్చు..
రెగ్యులర్ వ్యాయామం
వెన్ను, నడుము నొప్పితో బాధపడేవారు వైద్యుల సూచనల ప్రకారం.. కొన్ని సాధారణ యోగాసనాలు, స్ట్రెచ్‌లు చేస్తే తేలిగ్గా ఉపశమనం పొందవచ్చు. క్రమం తప్పకుండా రోజూ వ్యాయామం చేయడం వల్ల చక్కని ప్రయోజనం ఉంటుంది.
కోల్డ్ లేదా హాట్ కంప్రెస్
గాయం కారణంగా వెన్నునొప్పి ఉంటే, ఐస్ కోల్డ్ కంప్రెస్ ఉపశమనాన్ని అందిస్తుంది. రక్తం గడ్డకట్టినట్లు అనిపిస్తే బేకింగ్ ద్వారా సమస్య పరిష్కరించుకోవచ్చు. మళ్లీ వేడివేడిగా కాపడం పడితే రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
శరీర భంగిమలో మార్పు
మీరు ఆఫీసులో ఒకే చోట కూర్చొని నిరంతరం పని చేస్తే, వెన్ను నడుము నొప్పి త్వరగానే వస్తాయి. చాలామంది ఎలా కూర్చుంటున్నారో కూడా పట్టించుకోరు. కుర్చీలో కూర్చుని నిద్రపోవడం వల్ల నడుముపై ఒత్తిడి పడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం సరైన నిద్ర అలవాట్లు పాటించాలి. టేబుల్-చైర్‌పై పనిచేసేటప్పుడు కూడా వెన్నెముక నిటారుగా ఉంచడం చాలా ముఖ్యం.
మనస్సు ప్రశాంతంగా ఉంచుకోవడం
ఇది ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ.. దీని వల్ల కూడా శరీరంలోని వివిధ భాగాలలో నొప్పి నుంచి బయటపడొచ్చు. మానసిక ఒత్తిడి – నిరాశకు మధ్య లింక్ ఉందని అనేక అధ్యయనాలు కూడా కనుగొన్నాయి. కాబట్టి శారీరక నొప్పి లేని జీవితాన్ని పొందాలంటే ఒత్తిడిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
తగినంత నిద్ర
చాలా మందికి అనుమానం రావచ్చు.. నిద్రతో వెన్ను, నడుము నొప్పికి సంబంధం ఏమిటి? అని. కానీ నిద్ర నిజంగా నడుం నొప్పిని ప్రభావితం చేస్తుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. తక్కువ నిద్ర నడుము నొప్పిని పెంచుతుంది. రోజంతా వివిధ కార్యకలాపాల తర్వాత హాయిగా నిద్రపోతే శరీరం విశ్రాంతి తీసుకుంటుంది. శరీరంలోని వివిధ కండరాలు, నరాలు విశ్రాంతి మోడ్‌లోకి వెళ్లిపోతాయి. కాబట్టి ఆరోగ్యంగా, నొప్పి లేకుండా ఉండటానికి రోజుకు 7 నుంచి 8 గంటల నిద్ర అవసరం.
మరిన్ని ఆరోగ్య వార్తల కోసం క్లిక్ చేయండి.



