AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!

ఎన్నో సంవత్సరాలుగా భయపడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌తో పెద్ద ముప్పు పొంచి ఉంది. అరుదైన పశుపక్షాదులు అంతరించిపోయే ముప్పు ఏర్పడింది. బర్డ్‌ప్లూ అస్ట్రేలియాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవి, సముద్ర పక్షుల్లో వైరస్ నిర్ధారణ కావడంతో పాటు, తాజాగా విడుదలైన ఫెడరల్ ప్రమాద అంచనా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది.

ప్రకృతికి డేంజర్ బెల్స్..! జీవవైవిధ్యానికి భారీ ముప్పు.. అంతరించే ప్రమాదంలో 400 జాతులు!
Penguins
Balaraju Goud
|

Updated on: Aug 05, 2026 | 12:22 PM

Share

ఎన్నో సంవత్సరాలుగా భయపడుతున్న అత్యంత ప్రమాదకరమైన H5N1 ఏవియన్ ఇన్‌ఫ్లుయెంజా (బర్డ్‌ఫ్లూ) వైరస్‌తో పెద్ద ముప్పు పొంచి ఉంది. అరుదైన పశుపక్షాదులు అంతరించిపోయే ముప్పు ఏర్పడింది. బర్డ్‌ప్లూ అస్ట్రేలియాలో తీవ్ర ప్రభావం చూపుతోంది. అడవి, సముద్ర పక్షుల్లో వైరస్ నిర్ధారణ కావడంతో పాటు, తాజాగా విడుదలైన ఫెడరల్ ప్రమాద అంచనా నివేదిక ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వైరస్ కారణంగా ఆస్ట్రేలియాకు చెందిన దాదాపు 400 స్థానిక పక్షి, క్షీరద జాతులు అత్యంత తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. చిన్న పెంగ్విన్‌లు, డాల్ఫిన్‌లు, ఆస్ట్రేలియన్ ఫర్ సీల్స్, క్వోల్స్, అంతరించిపోతున్న టాస్మానియన్ డెవిల్స్ వంటి అరుదైన జాతులు కూడా ఈ జాబితాలో ఉండటం శాస్త్రవేత్తలను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది.

ఆస్ట్రేలియా ఫెడరల్ ప్రభుత్వం, చార్లెస్ డార్విన్ యూనివర్సిటీ, బర్డ్‌లైఫ్ ఆస్ట్రేలియా సంయుక్తంగా నిర్వహించిన ఈ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే ఇప్పటికే అంతరించిపోతున్న 80కు పైగా జాతుల మనుగడ మరింత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ద్వీపాల్లో మాత్రమే సంతానోత్పత్తి చేసే సముద్ర పక్షులు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెరాల్డ్ పెట్రెల్ వంటి అత్యంత అరుదైన పక్షి జాతులు వైరస్ ప్రభావాన్ని తట్టుకోలేకపోవచ్చని అంచనా వేస్తున్నారు.

ఇప్పటి వరకు బర్డ్‌ఫ్లూను ప్రధానంగా పక్షులకు మాత్రమే సోకే వైరస్‌గా భావించినప్పటికీ, ప్రస్తుతం వ్యాపిస్తున్న H5N1 రకం ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా క్షీరద జాతులకు కూడా సోకినట్లు గణాంకాలు చెబుతున్నాయి. సీల్స్, సముద్ర సింహాలు, నక్కలు, ఎలుగుబంట్లు, పాడి పశువులు సహా అనేక జంతువుల్లో ఈ వైరస్ గుర్తించారు. ఇదే పరిస్థితి ఆస్ట్రేలియాలోనూ కనిపించే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో ఇప్పటికే వైరస్ వ్యాప్తి ప్రారంభమైంది. దక్షిణ ఆస్ట్రేలియాలోని కేప్ జాఫా ప్రాంతంలో H5N1 సోకిన గ్రేటర్ క్రెస్టెడ్ టెర్న్ పక్షులు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడ్డాయి. దీంతో ఆ దేశంలో తొలి సామూహిక మరణ ఘటన నమోదైంది. 2026 ఆగస్టు 5 నాటికి దేశవ్యాప్తంగా అడవి సముద్ర పక్షుల్లో మొత్తం 101 H5 బర్డ్‌ఫ్లూ కేసులు నమోదైనట్లు అధికారులు ధృవీకరించారు. వీటిలో దక్షిణ ఆస్ట్రేలియాలో 81, పశ్చిమ ఆస్ట్రేలియాలో 10, విక్టోరియాలో 7, న్యూ సౌత్ వేల్స్‌లో 2, క్వీన్స్‌లాండ్‌లో ఒక కేసు నమోదైంది. అయితే ఇప్పటివరకు పౌల్ట్రీ ఫారాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఎలాంటి వైరస్ వ్యాప్తి గుర్తించలేదని అధికారులు స్పష్టం చేశారు.

వలస పక్షుల ద్వారా వైరస్ వేగంగా వ్యాపించే అవకాశం ఉండటంతో మరిన్ని ప్రాంతాల్లో కేసులు పెరిగే ప్రమాదం ఉందని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అడవి పక్షులను నియంత్రించడం సాధ్యం కాకపోవడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడం అత్యంత క్లిష్టమని వారు పేర్కొంటున్నారు. గూళ్లు కట్టే కాలంలో వైరస్ ద్వీప ప్రాంతాలకు చేరితే, అరుదైన సముద్ర పక్షుల జనాభాకు కోలుకోలేని నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, ఇది కేవలం ఒక జంతు వ్యాధి వ్యాప్తి మాత్రమే కాదు, ఆస్ట్రేలియా జీవవైవిధ్యానికి ఎదురవుతున్న అతిపెద్ద పర్యావరణ సంక్షోభాల్లో ఒకటి. ప్రస్తుతం మానవులకు H5N1 వైరస్ సోకే ప్రమాదం చాలా తక్కువగానే ఉన్నప్పటికీ, అడవి జంతువులతో అనవసరంగా సన్నిహితంగా ఉండొద్దని అధికారులు సూచిస్తున్నారు. వైరస్ ప్రభావాన్ని నియంత్రించేందుకు నిఘా, పరీక్షలు, బయోసెక్యూరిటీ చర్యలను మరింత కట్టుదిట్టం చేస్తున్నారు. రాబోయే నెలలు ఆస్ట్రేలియా వన్యప్రాణుల భవిష్యత్తును నిర్ణయించే కీలక కాలమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us