పాము కాటుకు నాటు వైద్యం.. పరిస్థితి విషమించి యువకుడి మృతి..!
అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన ఓ యువకుడు నాటు వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు. బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పాము విషం శరీరమంతా వ్యాపించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ప్రసాద్‌ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.

అనకాపల్లి జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పాము కాటుకు గురైన ఓ యువకుడు నాటు వైద్యం వికటించడంతో ప్రాణాలు కోల్పోయాడు. బుచ్చయ్యపేట మండలం చిన్నప్పన్నపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..చిన్నప్పన్నపాలెం గ్రామానికి చెందిన ప్రసాద్ పొలంలో పని చేస్తుండగా పాము కాటుకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే సమీపంలోని నాటు వైద్యుడిని ఆశ్రయించారు. పాము కాటుకు గురైన ప్రసాద్‌కు నాటు వైద్యుడు పసర మందు రాసి, ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అయితే కొద్దిసేపటికే ప్రసాద్ ఆరోగ్య పరిస్థితి క్రమంగా విషమించింది. పాము విషం శరీరమంతా వ్యాపించడంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై ప్రసాద్‌ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించారు.
అనకాపల్లి ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ప్రసాద్ పరిస్థితి మరింత విషమించి మృతి చెందినట్లు సమాచారం. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. పాము కాటుకు గురైనప్పుడు నాటు వైద్యాన్ని ఆశ్రయించకుండా వెంటనే సమీపంలోని ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
ఆర్ఎంపీ వైద్యం వికటించి వ్యక్తి మృతి..!
అనకాపల్లి జిల్లాలోనే మరో విషాద ఘటన చోటు చేసుకుంది. ఆర్ఎంపీ వైద్యం వికటించడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన కలకలం రేపింది. కె.కోటపాడు మండలం ఆనందపురంలో ఈ ఘటన జరిగింది. ఆనందపురానికి చెందిన ఈశ్వరరావు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో స్థానికంగా ఆర్ఎంపీ వైద్యుడిగా పనిచేస్తున్న గణేష్‌ను సంప్రదించాడు. ఈశ్వరరావుకు గణేష్ వైద్యం అందించిన అనంతరం ఆయన తీవ్ర అస్వస్థతకు గురైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
పరిస్థితి విషమించడంతో ఈశ్వరరావును ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈశ్వరరావు మృతిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంటూ బాధిత కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈశ్వరరావుకు అందించిన వైద్యం, ఉపయోగించిన మందులు, మృతికి గల కారణాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
