అలాంటి వారు మధ్యాహ్నం అస్సలు నిద్రపోవద్దు.. ఇందులో మీరున్నారో లేదో తెలుసుకోండి..
ఆరోగ్యకరమైన జీవనశైలికి నిద్ర ఎంతో కీలకం. అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత నిద్రపోవడం అందరికీ ఒకేలా ప్రయోజనకరం కాదు. ఉదయం నుంచి ఎక్కువ శారీరక, మానసిక శ్రమ చేసే వారికి కొద్దిసేపు మధ్యాహ్నపు కునుకు శక్తిని అందించవచ్చు. అదే సమయంలో శారీరక శ్రమ తక్కువగా ఉండేవారు ఎక్కువసేపు మధ్యాహ్నం నిద్రపోతే రాత్రి నిద్రకు ఆటంకం కలగవచ్చు. అందుకే వ్యక్తిగత జీవనశైలి, రోజువారీ శ్రమను బట్టి మధ్యాహ్నపు నిద్ర విషయంలో నిర్ణయం తీసుకోవడం మంచిది.

ఆరోగ్యకరమైన జీవనశైలికి నిద్ర అనేది అత్యంత కీలకమైన అంశం.. ఆహారం, నీటితో సమానంగా నిద్రకు ప్రాముఖ్యత ఇవ్వాలి. నిద్రను అత్యుత్తమ ఔషధంగా పరిగణిస్తారు.. ఇది శరీరానికి, మనస్సుకు విశ్రాంతినిచ్చి, పునరుజ్జీవింపజేస్తుంది. సరైన నిద్ర లేనివారు ఎంత పని చేసినా, ఎంత ఆరోగ్య సమస్యలు ఉన్నా చురుకుగా ఉండలేరు. నేటి కాలంలో వర్క్ స్ట్రెస్, ఆరోగ్య సమస్యలు లేనివారు లేరు. వీటన్నింటినీ అధిగమించడానికి నిద్ర చాలా అవసరం. అయితే, నేటి సమాజంలో చాలామంది నిద్రను డబ్బుతో కొనుక్కుని, టాబ్లెట్ల రూపంలో తీసుకుంటున్నారని.. అయితే.. ఒత్తిడిని నియంత్రించుకొని, మనస్సును ప్రశాంతంగా ఉంచుకుంటే నిద్ర సహజంగానే వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఒక మనిషి రోజుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి అనే ప్రశ్నకు.. 6 నుండి 10 గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎంత ఎక్కువ సమయం నిద్రపోగలిగితే అంత ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు.
మధ్యాహ్నపు నిద్ర: మంచిదా కాదా?
మధ్యాహ్నపు నిద్ర విషయంలో చాలామందికి సందేహాలున్నాయి. దీనికి సమాధానం వ్యక్తిగత జీవనశైలి, శారీరక శ్రమ మీద ఆధారపడి ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఎవరికి మధ్యాహ్నపు నిద్ర మంచిది?
ఉదయాన్నే 5 గంటలకు లేచి, మధ్యాహ్నం 1 లేదా 2 గంటల వరకు నిరంతరం పని చేసేవారికి (సుమారు 7-9 గంటల శ్రమ), మధ్యాహ్నపు నిద్ర ప్రయోజనకరంగా ఉంటుంది. అలాంటివారు భోజనం చేసిన తర్వాత అరగంట నుండి ఒక గంట పాటు కునుకు తీయవచ్చు. ఇది వారికి తిరిగి శక్తినిచ్చి, సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9-10 గంటల వరకు తమ పనులను చురుకుగా చేసుకోవడానికి సహాయపడుతుంది. బ్రెయిన్ యాక్టివ్‌గా ఉండాలన్నా, ఎక్కువ నిద్ర అవసరమన్నా, శారీరక శ్రమ చేసేవారికి మధ్యాహ్నపు నిద్ర కొంత మెరుగు. ఉదాహరణకు, ఉదయాన్నే లేచి పిల్లలను సిద్ధం చేసి, ఆఫీసుకు వెళ్లి, రోజంతా శ్రమించే మహిళలకు ఇది విశ్రాంతినిస్తుంది. వారికి ఇది అవసరం..
ఎవరికి మధ్యాహ్నపు నిద్ర మంచిది కాదు?
అయితే, ఎటువంటి శారీరక శ్రమ లేకుండా, ఉదయాన్నే ఆలస్యంగా (7 గంటలకు) లేచే వారికి, ఎక్కువ క్యాలరీలు ఖర్చు కాని పని చేసే వారికి (ఉదాహరణకు, ఏసీ గదులలో కూర్చుని చేసే పనులు), మధ్యాహ్నపు నిద్ర మంచిది కాదు. మధ్యాహ్నం భోజనం చేసి పడుకోవడం వలన బరువు పెరిగే అవకాశం ఉంది. చాలామందికి మధ్యాహ్నం నిద్రపోతే బరువు పెరుగుతారని అనుమానం ఉంటుంది, అది నిజమే. ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉన్నవారికి, మధ్యాహ్నం నిద్రపోతే శరీర బరువు పెరిగి, లేనిపోని జబ్బులు వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.
అంతేకాకుండా, శారీరక శ్రమ తక్కువగా ఉన్నవారు మధ్యాహ్నం అరగంట లేదా ఒక గంట నిద్రపోతే, రాత్రిపూట వారికి నిద్ర పట్టకపోవచ్చు. దీనివల్ల నిద్రలేమి (ఇన్సోమ్నియా) సమస్యలు మొదలవుతాయి. నిద్రలేమి తీవ్రమైతే టాబ్లెట్‌లకు అలవాటు పడాల్సి వస్తుంది.. కొన్నిసార్లు అవి కూడా పనిచేయకపోవచ్చు. అటువంటి పరిస్థితులలో జీవనశైలిని మార్చుకోవడం, ఒత్తిడిని తగ్గించుకోవడం ముఖ్యం.
నిద్ర అనేది చాలా ముఖ్యమైనది.. దాని సమయం, పద్ధతులు వ్యక్తి యొక్క జీవనశైలి, చేసే పని, శారీరక శ్రమపై ఆధారపడి ఉంటాయి. ఒకరికి మేలు చేసేది మరొకరికి హానికరం కావచ్చు కాబట్టి, మీ జీవనశైలిని బట్టి సరైన నిర్ణయం తీసుకోవాలి.. ఏమైనా అనారోగ్య సమస్యలుంటే.. వెంటనే ఆరోగ్య నిపుణులను సంప్రదించడం మంచిది.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
