
ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా అమెరికాలో సగానికి పైగా పెద్దల్లో అధిక రక్తపోటు ఒక ప్రధాన ఆరోగ్య సమస్యగా మారింది. అధిక రక్తపోటు గుండె జబ్బులు, స్ట్రోక్, అకాల మరణం వంటి తీవ్రమైన పరిస్థితుల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి రక్తపోటును ఆరోగ్యకరమైన పరిధిలో ఉంచడం చాలా కీలకం. తాజా అధ్యయనం ప్రకారం.. మీ రోజువారీ దినచర్యలో కేవలం ఐదు నిమిషాలు చొప్పున వ్యాయమం చేస్తే రక్తపోటును గణనీయంగా తగ్గించవచ్చని తేలింది.
రోజంతా చేసే చిన్నపాటి కార్యకలాపాలు కూడా రక్తపోటును మెరుగుపరుస్తాయని పరిశోధన స్పష్టం చేసింది. ఈ అధ్యయనంలో 14,761 మంది పాల్గొన్నారు. వారిని పర్యవేక్షించడానికి మోషన్ ట్రాకర్‌లను అమర్చారు. ఎక్కువసేపు కదలకుండా కూర్చోవడం లేదా నిశ్చలంగా ఉండటం రక్తపోటు పెరగడానికి దారితీస్తుంది. ప్రతిరోజు కొద్దిసేపు వ్యాయామం చేయడం వల్ల రక్తపోటు రీడింగ్‌లు తగ్గుతాయని ఈ పరిశోధన స్పష్టంగా చూపించింది.
వారు రోజులో కూర్చునే సమయాన్ని 21 నిమిషాలు తగ్గించి.. ఆ సమయంలో చురుకైన పనులు చేస్తే.. బీపీ బాగా తగ్గిందని కనుగొన్నారు. అంటే మీరు పరుగెత్తడం, సైక్లింగ్ చేయడం లేదా మెట్లు ఎక్కడం లాంటివి కొద్దిసేపు చేసినా గుండెకు చాలా మంచిది. చిన్నపాటి వ్యాయమం ద్వారా సిస్టోలిక్ రక్తపోటు దాదాపు 2 mmHg వరకు తగ్గుతుందని తేలింది.
వ్యాయామం రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండె వేగాన్ని పెంచుతుంది. ధమనులపై ఒత్తిడిని తగ్గిస్తుంది. ఈ అధ్యయనంలో పరిశోధకులు రోజువారీ కార్యకలాపాలను ఆరు రకాలుగా విభజించారు.. నిద్ర, నిశ్చల జీవనశైలి, నిలబడటం, నెమ్మదిగా నడవడం, వేగంగా నడవడం, వ్యాయామం వంటి కార్యకలాపాలు. సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటును తగ్గించడంలో ఎక్కువ వ్యాయామం, ఎక్కువ నిద్ర వంటివి సహాయపడతాయని వారు కనుగొన్నారు.
వాకింగ్ లేదా జాగింగ్: ఇంట్లో చుట్టూ లేదా వీధిలో ఐదు నిమిషాలు వేగంగా నడవండి లేదా చిన్నగా పరుగెత్తండి.
మెట్లు ఎక్కడం: లిఫ్ట్ బదులు మెట్లు ఎక్కడం అలవాటు చేసుకోండి.
డైనమిక్ కదలికలు: కదలకుండా ఎక్కువసేపు కూర్చునే బదులు చిన్నపాటి జాగింగ్‌లు లేదా శరీరాన్ని కదిలించే వ్యాయామాలు చేయండి.
గుండె ఆరోగ్యంగా ఉండాలంటే కూర్చునే సమయాన్ని తగ్గించి, చురుకైన కదలికలను పెంచడం ఉత్తమ మార్గం అని నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్య రీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..