Mustard Seeds: చిన్నగా ఉన్నాయని చులకన వద్దు.. ప్రయోజనాలు తెలిస్తే.. కేజీలు కేజీలు తెచ్చుకుంటారు
మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్రతో పాటు మన తీసుకునే ఆహారం కూడా ఎంతో ముఖ్యం. అందుకే చాలా మంది ఆరోగ్యంగా ఉండేందుకు తమ జీవనశైలిలో అనేక మార్పులు చేసుకుంటారు. అందులో భాగంగానే తమ ఆహారంలో ఆరోగ్య కరమైన పదార్థాలను చేర్చుకుంటారు. అలాంటి వాటిలో ఆవాలు కూడా ఒకటి చాలా మంది వీటిని కూరట్లో పోపుగా మాత్రమే వాడుతారు. కానీ వీటి పూర్తి ప్రయోజనాలు తెలిస్తే.. ప్రతి వంటకంలో మీరు వీటిని చేర్చుకుంటారు. కాబట్టి ఆవాల వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఆవాలు బ్రాసికేసి కుటుంబానికి చెందినవి. ఇవి ఎక్కువగా దక్షిణాసియా, మధ్యధరా ప్రాంతాలలో పండుతాయి. మన ప్రాంతాల్లో ఎక్కువగా నల్ల ఆవాలను మాత్రమే వాడుతారు. కానీ పసుపు, గోధుమ రంగులో ఉండే ఆవాలు కూడా ఉంటాయని చాలా మందికి తెలియదు. ఇవి ఘాటైన రుచి, సువాసనతో పాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయి. వీటిలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి మన పూర్తి ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతాయి.
ఆవాలు తినడం వల్ల కలిగే ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనాలు ఇవే
యాంటీ ఆక్సిడెంట్ల భాండాగారం: ఆవాలలో సెలీనియం, మెగ్నీషియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్‌ను అరికట్టి, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. తద్వారా క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. ఇవి కణాల ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, వృద్ధాప్యాన్ని కూడా దూరం చేస్తాయి. అంతే కాదు ఇవి చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో తోడ్పడుతాయి.
వాపుల తగ్గింపు, జీర్ణక్రియ మెరుగుదల: ఆవాలలోని సెలీనియం, మెగ్నీషియం శరీరంలో వాపులను తగ్గించడంలో శక్తివంతంగా పనిచేస్తాయి. కీళ్ల నొప్పులు, వాపులు, ఆస్తమా, గుండె జబ్బులతో బాధపడేవారికి ఆవాలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. అలాగే ఆవాలు జీర్ణ ఎంజైమ్‌ల ఉత్పత్తిని ప్రేరేపించి, ఆహారం సులభంగా అరగడానికి, పోషకాలను శరీరం గ్రహించడానికి సహాయపడతాయి. వీటిలోని ఫైబర్ మలబద్ధకాన్ని నివారించి, ప్రేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అలాగే, ఇందులోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు కడుపులోని హానికరమైన బ్యాక్టీరియాను నశింపజేస్తాయి.
రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణ: ఆవాలు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. వీటిలో ఉండే మెగ్నీషియం ఇన్సులిన్ నియంత్రణలో, గ్లూకోజ్ జీవక్రియలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా స్థిరంగా ఉంచడంలో సహాయపడుతుంది, దానివల్ల మధుమేహం ఉన్నవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది.
గుండె ఆరోగ్యం, శ్వాసకోశ సమస్యల: ఆవాలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, మెగ్నీషియం, పొటాషియం గుండె ఆరోగ్యానికి ఎంతో రక్షణ ఇస్తాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, రక్తపోటును తగ్గిస్తాయి. అలాగే ధమనులలో కొవ్వు పేరుకుపోకుండా నిరోధించి, రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఆస్తమా, బ్రోన్కైటిస్, కఫం వంటి శ్వాసకోశ సమస్యలను తగ్గించంలో కూడా ఇవి చాలా బాగా పనిచేస్తాయి. ఆవనూనెను రాయడం ద్వారా జలుబు, సైనస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది.
మెటబాలిజం,ఎముకల బలం: ఆవాలలో ఉండే ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజాలు శరీర మెటబాలిజంను వేగవంతం చేస్తాయి. ఐరన్ శరీరమంతటా ఆక్సిజన్‌ను సరఫరా చేయడానికి సహాయపడగా, మెగ్నీషియం శక్తి ఉత్పత్తికి తోడ్పడుతుంది. ఇది అలసటను తగ్గించి, రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. అలాగే ఎముకల నిర్మాణానికి, బలానికి అవసరమైన కాల్షియం, ఫాస్పరస్, మెగ్నీషియం వంటి పోషకాలు ఆవాలలో మెండుగా ఉంటాయి. ఇవి వయసు పైబడటం వల్ల వచ్చే ఆస్టియోపోరోసిస్ వంటి సమస్యలను తగ్గిస్తాయి.
చర్మ సౌందర్యం: ఆవాలు చర్మ ఆరోగ్యానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతాయి. ఆవాలలోని అవసరమైన ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్లు చర్మానికి తేమను అందించి, రక్షణ ఇస్తాయి. వీటిలోని యాంటీబ్యాక్టీరియల్ గుణాలు మొటిమలు,చర్మ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. ఆవనూనె చర్మానికి రాయడం వల్ల పొడిబారడం తగ్గి, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. కాబట్టి వీటిని మన రోజువారి ఆహారంలోకి చేర్చుకోవడం ద్వారా మనం పూర్తి ఆరోగ్యంగా జీవించవచ్చు.
మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
