Yadadri Temple : తుది మెరుగులు దిద్దుకుంటున్న యాదాద్రి దివ్య క్షేత్రం.. త్వరలోనే భక్తులకు పునః దర్శనం..

|

Jan 25, 2021 | 5:51 AM

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునఃనిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. అద్భుత శిల్పకళా నైపుణ్యంతో యాదాద్రిలో పంచనారసింహ క్షేత్రం రూపుదిద్దుకుంటోంది.

Yadadri Temple : తుది మెరుగులు దిద్దుకుంటున్న యాదాద్రి దివ్య క్షేత్రం.. త్వరలోనే భక్తులకు పునః దర్శనం..
Follow us on

Yadadri Temple :  ఎప్పుడెప్పుడా అని భక్తులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న యాదాద్రి దివ్య క్షేత్రంలోని పునర్నిర్మాణ పనులు దాదాపుగా పూర్తవుతున్నాయి. ఇప్పటికే ప్రధాన ఆలయ పనులన్నీ పూర్తి చేసుకున్న స్వయం భూక్షేత్రం.. త్వరలోనే భక్తులకు పునః దర్శనం కల్పించే దిశగా తుది మెరుగులు దిద్దుకుంటోంది.

అద్భుత శిల్పకళా నైపుణ్యంతో పంచనారసింహ క్షేత్రం రూపుదిద్దుకుంటోంది. ప్రధానాలయాన్ని పురాణ ప్రాశస్త్యమైన రాతి శిలా సౌరభాలను ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణశిలలతో ఇప్పటికే ఆలయాన్ని అంతా నిర్మించారు. ఆలయానికి నలు వైపులా భక్తులను ఆకర్షించే విధంగా రాతి విగ్రహాలను ఏర్పాటు చేశారు.

ప్రధానాలయ మండపానికి నలుదిక్కులా విమానాలు, ప్రాకార మండపాలపై దేవదేవుడు నృసింహుడి ఇష్టవాహనమైన గరుత్మంతుడి విగ్రహాలను, ఆ విగ్రహాలకు ఇరువైపులా సింహం, శంకుచక్ర నామాలు ఏర్పాటు చేశారు. రెండున్నర అడుగుల ఎత్తుతో గరుత్మంతుడి విగ్రహాలు, ఒకటిన్నర అడుగు ఎత్తుతో సింహపు విగ్రహాలు, శంకు, చక్ర, తిరునామాలను అమర్చారు. చినజీయర్‌ స్వామి సలహాలు, సూచనలతో దేవతా మూర్తుల విగ్రహాలను బిగించే ప్రక్రియను ఇటీవల పూర్తి చేశారు. ప్రధాన ఆలయం మొదటి ప్రాకారంలో సాలహారాల్లో 93 విగ్రహాలను బిగించారు. ఇందులో ప్రధానంగా దశవతారాలు, అష్టలక్ష్మి, నృసింహస్వామి, ఆళ్వారులు, నారాయణమూర్తి వంటి విగ్రహాలను అమర్చారు.

ఆలయానికి వచ్చే భక్తులకు అడుగడుగునా ఆధ్యాత్మిక చింతన కలిగే విధంగా తీర్చిదిద్దుతున్నారు. తాజాగా యాదాద్రి క్షేత్రాభివృద్ధిలో భాగంగా కొండపైన తగిన స్థలం లేకపోవడంతో వ్రతాల నిర్వహణను కొండ కిందకు మార్చారు.