
వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి రాష్ట్రాభివృద్ధి కోసం సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. నేడు ప్రజావేదికలో ఐపీఎస్ అధికారులతో జరిగిన సదస్సులో సీఎం జగన్… గిరిజనుల జీవనానికి ఆటంకంగా మారుతున్న బాక్సైట్ తవ్వకాలకు సంబంధించిన జీవోను రద్దు చేస్తామని తేల్చి చెప్పారు. గిరిజనులు వద్దన్నప్పుడు తవ్వకాలు చేయడంలో అర్థం లేదన్నారు. బాక్సైట్ మైనింగ్ జరగకపోతే రాష్ట్రానికి వచ్చిన నష్టం ఏమీ లేదని సీఎం అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి శాంతి, ప్రశాంతత ముఖ్యం అని గుర్తించాలని అధికారులకు సూచించారు. యువకులు మావోయిస్టులుగా మారకుండా గిరిజన ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజనుల జీవనోపాధికి అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని, నెలకోసారి అన్ని శాఖల అధికారులూ మావోయిస్టు ప్రాంతాల్లోకి వెళ్లాలని ఆదేశించారు.