నివురు గప్పిన నిప్పులా నియంత్రణ రేఖ.. ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ !

|

Oct 16, 2019 | 4:28 PM

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. రాజౌరీ లో పాక్ దళాల కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందడం, సుమారు 500 మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడేందుకు సిధ్దంగా ఉన్నారన్న సమాచారం అందడంతో భారత దళాలు అప్రమత్తమయ్యాయి. స్వయంగా నార్తర్న్ కమాండ్ చీఫ్ జనరల్ రణబీర్ సింగ్ అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ రేఖ ద్వారా ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా భారత్ లోకి చొరబడవచ్ఛునని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదివరకే హెచ్చరికలు […]

నివురు గప్పిన నిప్పులా నియంత్రణ రేఖ.. ఇండియన్ ఆర్మీ హైఅలర్ట్ !
Follow us on

జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో.. నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. రాజౌరీ లో పాక్ దళాల కాల్పుల్లో ఓ జవాన్ మృతి చెందడం, సుమారు 500 మంది ఉగ్రవాదులు కాశ్మీర్లోకి చొరబడేందుకు సిధ్దంగా ఉన్నారన్న సమాచారం అందడంతో భారత దళాలు అప్రమత్తమయ్యాయి. స్వయంగా నార్తర్న్ కమాండ్ చీఫ్ జనరల్ రణబీర్ సింగ్ అక్కడే ఉండి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ రేఖ ద్వారా ఉగ్రవాదులు ఏ క్షణంలోనైనా భారత్ లోకి చొరబడవచ్ఛునని ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా ఇదివరకే హెచ్చరికలు చేశాయి. ప్రస్తుతం పరిస్థితి నివురు గప్పిన నిప్పులా ఉందని, అయితే పాక్ దళాలు లేదా, ఉగ్రవాదుల నుంచి ఎదురయ్యే ఎలాంటి సవాళ్ల నైనా ఎదుర్కోవడానికి సిధ్ధంగా ఉన్నామని భారత ఆర్మీ ప్రకటించింది. అటు-అనంత నాగ్ లో బుధవారం జరిగిన ఎన్ కౌంటర్లో నసీర్ చద్రు అనే కమాండర్ సహా ముగ్గురు హిజ్ బుల్ ముజాహిదీన్ టెర్రరిస్టులు మరణించినట్టు జమ్మూ కాశ్మీర్ పోలీసులు తెలిపారు. అయితే ఇందుకు సంబంధించి పరస్పర వార్త మరొకటి కూడా వచ్చింది. అనంత్ నాగ్ లోని ఫజల్ పొలాలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై వారు కాల్పులకు దిగగా.. సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు టెర్రరిస్టులు పారిపోయి ఓ ఇంట్లో నక్కి దాక్కున్నారని, ఆ ఇంటిని సైన్యం చుట్టుముట్టిందని ఈ వార్త సారాంశం. ఈ ప్రాంతంలో ఇంటర్నెట్, టెలికాం సేవలను నిలిపివేశారు. అటు-ఛత్తీస్ గడ్ కు చెందిన ఓ కూలీని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు కాల్చి చంపారు. షోపియాన్ లో మూడు రోజుల క్రితం ఓ ట్రక్కు డ్రైవర్ ను కాల్చి చంపిన టెర్రరిస్టులు.. బయటి రాష్ట్రాల నుంచి ఉపాధి కోసం వచ్ఛే ఇలాంటివారిని టార్గెట్ గా పెట్టుకున్నట్టు కనిపిస్తోంది. తద్వారా స్థానికుల్లో భయాందోళన రేకెత్తించడమే వారి ధ్యేయంగా ఉందని అంటున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో.. బాల కోట్ వంటి వైమానిక దాడులకు ప్రభుత్వం మళ్ళీ పూనుకొంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఆ మధ్య ఆర్మీచీఫ్ జనరల్ బిపిన్ రావత్ గురేజ్ సమీపంలోని నియంత్రణ రేఖను సందర్శించి దాదాపు పరోక్షంగా ఇదే సూచన చేశారు. అయితే అధికారికంగా కేంద్రం నుంచి ఎలాంటి సంకేతమూ రాలేదు.