ఏపీ తీరు మారకుంటే.. ఆలంపూర్ వద్ద బ్యారేజీ కట్టి తీరుతాంః కేసీఆర్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరి తన పద్ధతిని మార్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కృష్ణానదిపై ఇష్టానుసారం చేప‌ట్టిన‌ పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని హెచ్చరించారు.

ఏపీ తీరు మారకుంటే.. ఆలంపూర్ వద్ద బ్యారేజీ కట్టి తీరుతాంః కేసీఆర్
Follow us

|

Updated on: Oct 06, 2020 | 9:28 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గతంలో మాదిరి తన పద్ధతిని మార్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. కృష్ణానదిపై ఇష్టానుసారం చేప‌ట్టిన‌ పోతిరెడ్డిపాడు తదితర అక్రమ ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపకుంటే తెలంగాణ ప్రభుత్వం కూడా అలంపూర్ పెద్ద మరూర్ వద్ద బ్యారేజీ నిర్మించి తీరుతుందని హెచ్చరించారు. దీంతో రోజుకు 3 టీఎంసీల సాగునీటిని ఎత్తిపోయడం ఖాయమని రాష్ర్ట‌ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. నదీ జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవహరిస్తే ఇకనుంచి కుదరదన్నారు. తెలంగాణ నీటివాటాను కొల్లగొట్టాలని చూస్తే తమ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను కాపాడుకోవడానికి తామూ సిద్ధమేనని సీఎం ప్రకటించారు.

మంగళవారం ప్రగతి భవన్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. రెండు గంటలపాటు కొనసాగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో కృష్ణా, గోదావరి నదీ జలాలపై తెలంగాణకున్న న్యాయమైన హక్కులు, వాటాల గురించి స్పష్టం చేశారు. నదీజలాల పంపిణీలో తెలంగాణకు జరిగిన అన్యాయం ఫలితమే ప్రత్యేక రాష్ట్ర ఉద్యమని సీఎం కేసీఆర్ అన్నారు. భారత యూనియన్ లో నూతనంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రానికి అంతర్ రాష్ట్ర నదీజలాల్లో న్యాయమైనవాటాను పొందే హక్కు ఉంద‌న్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ కోల్పోయిన సాగునీటిని ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాంగ హక్కుగా పొంది తీరుతామని సీఎం స్పష్టం చేశారు. కృష్ణా నదిపై ఏపీ అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులను వెంటనే నిలిపివేయాలని పలుమార్లు అభ్యంతరాలు వ్యక్తం చేసినా, ఈ దిశగా స్వయంగా కేంద్రమే స్పష్టమైన ఆదేశాలిచ్చినా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ కొనసాగించడం బాధాకరమన్నారు. ఆయకట్టు లేకుండా, నీటి కేటాయింపులు లేకుండా శ్రీశైలానికి గండిపెడుతూ నిర్మితమవుతున్న పోతిరెడ్డిపాడు కెనాల్ ను ఉద్యమకాలం నుంచే తెలంగాణ సమాజం వ్యతిరేకిస్తున్నదన్నారు. తమ అభ్యంతరాలతో పాటు, రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర జల్ శక్తి మంత్రి ఈ ఏడాది ఆగస్టు 20న లేఖ రాసిన సంగతిని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ అక్రమ ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేసే దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రిని ముఖ్యమంత్రి కోరారు.

ఒకవేళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొండివైఖరితో క్రమశిక్షణను ఉల్లంఘించి అక్రమ నీటి ప్రాజెక్టుల పనులను కొనసాగిస్తే తాము కూడా తమ రైతుల సాగునీటి అవసరాల కోసం మహారాష్ట నిర్మించిన బాబ్లీ బ్యారేజీ మాదిరిగా కృష్ణా నదిపై అలంపూర్ పెద్ద మరూర్ వద్ద బ్యారేజీని నిర్మించి తీరుతామని స్పష్టం చేశారు. దీనిద్వారా రోజుకు 3 టీఎంసీల నీటిని ఎత్తిపోస్తామన్నారు. రెండు రాష్ట్రాల మధ్య జలవివాదాలను చర్చల ద్వారా పరిష్కరించడానికి కేంద్రం ముందుకు వస్తే, తెలంగాణ రాష్ట్రం సంపూర్ణంగా సహకరిస్తుందన్నారు. అయితే బోర్డులు సమర్ధవంతంగా పనిచేయాలంటే ముందు నీటి కేటాయింపులు జరిపి వాటి పరిధిని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు.

నాలుగేండ్ల కింద మొదటిసారి జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశం వివరాలను సరిగా నమోదు చేయలేదని, నేటి రెండో అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో జరిపిన చర్చను తీసుకున్న నిర్ణయాలను వీడియో, రాతపూర్వకంగా నమోదు చేయాలని కేంద్రాన్ని కోరారు. సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి, ముఖ్యమంత్రుల సంతకాలు తీసుకున్న తర్వాతే మినట్స్ ను అధికారికంగా విడుదల చేయాలన్నారు.

ఆరేండ్లుగా పెండింగులో ఉన్న సెక్షన్ 3 ద్వారా ట్రిబ్యునల్ ను ఏర్పాటు చేసే అంశం తెలంగాణ ఒత్తిడి మేరకు 2వ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో పరిష్కారం కావడం తెలంగాణకు సాగునీటి జలాల వినియోగం విషయంలో మేలు చేకూర్చే అంశమన్నారు. తద్వారా తెలంగాణ ఫిర్యాదులు ట్రిబ్యునల్ ద్వారా పరిష్కారమైతే కృష్ణా జలాల్లో తెలంగాణకు వాటా మరింతగా పెరిగే అవకాశాలున్నాయని సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ వాదనను గట్టిగా వినిపించేందుకు కృషి చేసిన అధికారులందరినీ సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బి.వినోద్ కుమార్, సీఎస్ సోమేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.